అదేదో సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం చెత్తను తీసుకువచ్చి నడిబజార్లో పోస్తాడు. క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఆ చెత్తను తీసుకువెళ్లి మళ్లీ బ్రహ్మానందం నెత్తిన పోస్తాడు. చెత్తను బజార్లలో వేయడం వల్ల వచ్చే నానారకాల వ్యాధులను ఏకరవు పెడుతూ… చివరికి కుష్టు వ్యాధితో ఛస్తావని, నీ డెడ్ బాడీని రాబందులు పీక్కుతింటాయని భయానక దృశ్యాన్ని కళ్లముందే బ్రహ్మానందానికి చూపిస్తాడు ప్రకాష్ రాజ్. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఓ సినిమాలోని ఈ సీన్ ఇప్పటికీ టీవీల్లో అప్పుడప్పుడు కనిపించి తెగ నవ్విస్తూ ఉంటుంది.
సినిమాలో ఆ సీన్ కామెడీ కోసం పెట్టినప్పటికీ, చెత్తవిషయంలో మాత్రం సందేశం ఉందని చెప్పక తప్పదు. కరీంనగర్ నగరపాలక సంస్థ సిబ్బంది అచ్చంగా అదే ‘సీన్’ను తలపించారు. ఆవిడెవరో చెత్తను బజార్లో పోసిందని, అందుకు మూడు, నాలుగు రెట్ల చెత్తను మళ్లీ బుట్టలోకి ఎత్తారు. బుట్టను తీసుకువెళ్లి చెత్త పోసినావిడ నట్టింట్లో పోశారు. మరోసారి చెత్తను బజార్లో వేస్తే బాగుండదు… ఖబడ్దార్… అంటూ హెచ్చరించి మరీ వెళ్లిపోయారు.
నేను వేసింది కాస్త చెత్తే… ఇదంతా నా చెత్త కాదని ఆవిడ ఎంతగా మొత్తుకుంటున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆసలే కరోనా, ఆపై వర్షాకాలం. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయ్. ఇదేం పని? ఆయ్… అన్నట్లు వార్నింగ్ ఇచ్చి మరీ మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు. ఇక దిగువన గల ఆ దృశ్యపు వీడియోను చూసేయండి.