బండి సంజయ్…కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు. అన్నంత పనీ చేశారు. చెప్పినట్లే చేశారు. ఓ ఆర్టీసీ కార్మికుని అంతిమ యాత్రలో పాల్గొన్నతనపై పోలీసులు అకారణంగా దాడి చేశారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ సభ్యుడైన తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని స్పీకర్‌కు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు. తన మీద జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించారు. ఆర్టీసీ డ్రైవర్‌ అంతిమయాత్రలో పాల్గొన్న తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పలువురు పోలీసు అధికారులపై  చర్యలు తీసుకోవాలని  సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా విచారణ చేపట్టాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ త్వరగా ముగించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దాడి చేసిన పోలీస్ అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. తనపై పోలీసులు దాడికి దిగారని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మరోవైపు కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. పోలీసు దాడి ఘటనపై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నంబర్‌ 1137/36/3/2019గా నమోదు చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

అర్టీసీ డ్రైవర్ అంతిమయాత్ర, పోలీసులపై ఆరోపణలు, ఫిర్యాదులు, సభా హక్కుల ఉల్లంఘన వంటి అంశాలు కొద్దిసేపు పక్కన పెడితే…బండి సంజయ్ వ్యవహారశైలి తెలంగాణాలో అధికార పార్టీకి మింగుడు పడని అంశంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్ధాలుగా బీజేపీనే నమ్ముకుని రాజకీయ భవితను వెదుక్కున్నసంజయ్ కార్యకలాపాలు కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలకు అస్సలు రుచిస్తున్నట్లు లేదు. మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం… ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించినందుకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారట. అనేక మంది తన వద్దకు వచ్చి ఇదే విషయంపై తెగ బాధపడిపోతున్నారట.

మంత్రి కమలాకర్ వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఎంపీ బండి సంజయ్ రాజకీయ నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే…కరీంనగర్ మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలో నాలుగు దఫాలు కౌన్సిలర్, కార్పొరేటర్ గా ఆయన ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్మేగా పోటీ చేసి ఓటమి చెందారు. కానీ కొద్ది నెలల వ్యవధిలోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే ఎంపీగా సంజయ్ విజయం సాధించడం ఒక ఎత్తయితే, సీఎం కేసీఆర్ కు కుడి భుజంగా ప్రాచుర్యం పొందిన బోయినపల్లి వినోద్ కుమార్ ను ఓటమి బాట పట్టించడం ద్వారా సంజయ్ రాష్ట్ర స్థాయిలోనేగాక దేశ వ్యాప్తంగానూ వార్తల్లోకి వచ్చారు.

హిందుత్వం అంటే అమితంగా ఆరాధించే సంజయ్ ఎంపీగా గెలవడం కొన్ని వర్గాలకు మింగుడు పడలేదన్నది వేరే విషయం. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల సారు-కారు-పదహారు నినాదానికి గండి కొట్టిన నాలుగు పార్లమెంట్ స్థానాల్లో కరీంనగర్ కూడా ఒకటి. ఈ నలుగురు బీజేపీ ఎంపీల్లో ఎవరి శైలిలోవారు అధికార టీఆర్ఎస్ పార్టీ కోటలకు బీటలు వార్చే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో అధికారం చేపట్టాలనే బీజేపీ నాయకత్వం అభీష్టానికి అనుగుణంగా అడుగులు వేస్తున్న ఎంపీల్లో ఒకరైన సంజయ్ పై పోలీసులు దాడి చేస్తే నరేంద్ర మోదీ సర్కార్ ఊరుకుంటుందా? ఇదీ అసలు ప్రశ్న. ఇంతకీ ఈ ఉదంతంలో ఏం జరుగుతుందన్నదే కదా సందేహం? ఏమైనా జరగవచ్చు… ఏదీ జరక్కపోవచ్చు. ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసు అధికారులకు నోటీసులు జారీ కావచ్చు. కాకనూపోవచ్చు. తమ ముందు హాజరై సమాధానం చెప్పాలని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఆదేశించవచ్చు. అసలు పిలుపు కూడా రాకపోవచ్చు. సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు విచారణలో తేలితే సంబంధిత అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. అయితే ‘తప్పయింది’ అని ఒప్పుకుంటే ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసు అధికారులను కమిటీ క్షమించి  వదిలేయనూ వచ్చు.  అలాగని సంజయ్ ఫిర్యాదు చేసినంత మాత్రాన సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయాలని కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శానసభలో అప్పటి ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పోలీసులపై చేసిన సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. తన ఇంటిపై అర్థరాత్రి పోలీసులు అకారణంగా దాడి చేశారని, తన హక్కులకు భంగం కలిగింది మొర్రో అని గుమ్మడి నర్సయ్య మొత్తుకున్నా ఎటువంటి ఫలితం లేకపోయింది. చివరికి శాసనసభలోనే నర్సయ్య తనకు జరిగిన ఘటనపై కంట తడి పెట్టినా ఎటువంటి ప్రయోజనం లభించలేదు. కాకపోతే గుమ్మడి నర్సయ్య న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. బండి సంజయ్ అధికారంలో గల కేంద్ర ప్రభుత్వ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. అంతే తేడా…ఏం జరుగుతుందన్నది వెయిట్ అండ్ సీ…

ఇదిలా ఉండగా, సంజయ్ ఉదంతంపై ఓ సీనియర్ పోలీసు అధికారి ఏమన్నారంటే… ‘ధర్నాలో కూర్చోవడం కాదు…అందుకు లభించే ఫలితాన్ని కూడా స్వీకరించాల్సి ఉంటుంది. శాంతి భద్రతలు దెబ్బ తినకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఎంపీపై ఉంటుంది. ప్రజా భద్రతకు భంగం వాటిల్లినపుడు పోలీస్ తన బాధ్యతను నిర్వహిస్తుంది. సమూహం లేదా గుంపు ఉన్నచోట ఒక్కోసారి పరిస్థితి చేయిదాటిపోవచ్చు. అప్పడు ఏదైనా జరగవచ్చు. ఇటువంటి సందర్భాల్లో లభించే ఫలితాన్ని కూడా రాజకీయ నేతలు స్వీకరించక తప్పదు. ఐపీసీ 353, 332 సెక్షన్ల కింద వారిపై కేసు కూడా నమోదు కావచ్చు.’ అంటే ప్రగతి భవన్ ముట్టడి ఘటనలో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై నమోదైన కేసు తరహా అన్నమాట.

Comments are closed.

Exit mobile version