నటన అంటే ఎలా ఉండాలి? సావిత్రి, ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి మహానటులు సైతం ఇతని ముందు దిగదుడుపే అని చెప్పక తప్పదు. వాళ్లు సినిమాల్లో మాత్రమే నటించి మహా నటులనిపించుకున్నారు. సినిమా వాళ్ల అద్భుత నటనకు అనేక సందర్భాల్లో రకరకాల అవార్డులు కూడా వస్తుంటాయి. నంది, ఫిలింఫేర్, ఆస్కార్ అంటూ రకరకాల అవార్డులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదానం చేస్తుంటారు. కరీంనగర్ కు చెందిన ముత్త కొంరయ్య అనే ఓ హత్యోదంత నిందితుడి నటన ముందు సినిమా రంగానికి చెందిన మహానటులు సైతం నివ్వెరపోక తప్పదు.
గత నెల 10వ తేదీన కరీంనగర్లో రాధిక (19) అనే ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కలిగించింది. కేసును సవాల్ గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు దర్యాప్తులో జర్మన్ టెక్నాలజీని ప్రప్రథమంగా వినియోగించి రాధిక హత్య కేసులో నిందితున్ని సోమవారం అరెస్ట్ చేశారు. తన కూతురు వైద్య ఖర్చులకు బయపడి రాధిక తండ్రి ముత్త కొంరయ్య ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తమ పరిశోధనలో తేలిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి నిన్న ప్రకటించారు.
ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రకటించిన కొంరయ్య ఎలా నటిస్తున్నాడో చూడండి. ఘోరం జరిగిన రోజు రాధిక కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి గంగుల కమలాకర్ కొంరయ్య నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి ముందు కొంరయ్య అత్యద్భుత నటన ప్రదర్శించాడు. కొంరయ్య కన్నీళ్లకు మంత్రి కమలాకర్ హృదయం కరిగిపోయింది. కొంరయ్య నటిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోలేని మంత్రి కమలాకర్ అతనికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాధిక దహన సంస్కారాలకు తక్షణ సాయంగా రూ. 20 వేల మొత్తాన్ని తన జేబు నుంచి తీసి కొంరయ్యకు ఇచ్చారు. కన్నకూతురినే కర్కశంగా కడతేర్చిన రాధిక తండ్రి కొంరయ్య మంత్రి ముందు ఎలా నటిస్తున్నాడో దిగువ గల వీడియోలో చూడండి.