అనారోగ్యంతో నిద్రిస్తున్న బిడ్డపై కన్నతండ్రే విచక్షణ రహితంగా దాడి చేసిన ఉదంతమిది. దిండుతో నొక్కి చంపి, ఆపై గొంతు కోసి, చావుతో కొట్టుకుంటున్నప్పటికీ ఏమాత్రం కరగని కన్నపేగు ఉదంతమిది. కళ్ళ ముందే కూతురు అసువులు కోల్పోతున్నా, బంగారం, డబ్బు కోసం హత్యగా చిత్రీకరించిన వైనమిది. ఖర్చులు భరించలేక కన్నతండ్రి ప్రదర్శించిన అమానుషపు కర్కశత్వ ఘటన. కరీంనగర్లో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్నతండ్రే అసలు నిందితుడని తేల్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విలేకరుల సమావేశంలో వివరించారు.
గత నెల 10వ తేదీన కరీంనగర్ పట్టణం లోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ముత్త రాధిక (19) ను గొంతుకోసి దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి కేసును ఛేదించడం విశేషం. అనారోగ్యంతో గల కన్న బిడ్డకు ఖర్చులు భరించలేక కన్నతండ్రే కడతేర్చిన ఘటనను కమలాసన్ రెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు.
కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ కు చెందిన ముత్త కొంరయ్య గోదాంగడ్డ లోని గోడౌన్లలో హమాలీ పని చేస్తుంటాడు. కొన్నేళ్లుగా తన బిడ్డయిన రాధిక తీవ్ర అనారోగ్యం, పోలియో తో బాధపడుతూ ఉండేది. రాధిక ఆరోగ్యాన్ని బాగు చేసే నిమిత్తం కుటుంబ సభ్యులు అనేక హాస్పిటళ్ల చుట్టూ తిరిగి చికిత్స చేయించేవారు. చికిత్స కోసం దాదాపు రూ. 6.00 లక్షల వరకు చేశారు. ఏడాది క్రితం రాధికకు పోలియో శస్త్ర చికిత్స చేయడం వల్ల నయం చెంది కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చేరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుండి రాధిక మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుండగా, మళ్ళీ డబ్బులు ఖర్చు చేసి ఆమెకు నయం చేయించే ఆర్థిక స్తోమత లేని రాధిక తండ్రి కొంరయ్య ఎలాగైనా తన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు.
కొద్ది రోజులుగా ఇందుకు పక్కాగా ప్లాన్ చేశాడు. తన ప్లాన్ అమలు చేసేందుకు తమ ఇంట్లో కిరాయికి ఉంటున్న పోచయ్య కుటుంబాన్ని బలవంతంగా గత నెల 6వ తేదీన ఖాళీచేయించాడు. తన పథకం ప్రకారం గత నెల 10న ఎలాగైనా రాధికను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యను కూలీ పనికి పంపి, బయట పరిస్థితులు గమనించడానికి కిరాణం షాపునకు ఉప్పు కొనడానికి వెళ్లినట్లు వెళ్లి, తిరిగి వస్తుండగా తన ఇంటిపక్కన ఫంక్షన్ హాల్ కి వాచ్ మెన్ గా ఉన్న వీరేశం కుక్క చనిపోగా, అతనితో మాట్లాడుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్లిపోగానే ఇంటికి వచ్చిన కొంరయ్య తన బిడ్డ రాధిక బెడ్ పై దుప్పటి కప్పుకొని పడుకోవడం చూశాడు. అదే అదునుగా భావించి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి తన బిడ్డ పక్కన గల బరువైన దిండును తీసి ఆమె ముఖంపై శ్వాస ఆడకుండా అదిమిపెట్టి చంపాడు.
తర్వాత రాధిక మృతిపై పోలీసులకు అనుమానం రావొద్దని, రాధిక మృతదేహాన్ని బెడ్ పై నుండి కిందకు తోసి, కిచెన్లో గల కత్తిని తీసుకువచ్చి విచక్షణ రహితంగా ఆమె మెడని కోసేశాడు. అనంతరం కత్తిని కడిగి రక్తం పడిన బనియన్లని పిండి పైన ఆరేశాడు. ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం రాకుండా అన్నం తిని, టిఫిన్ బాక్స్ పెట్టుకొని, అలాగే బయటకి వచ్చిన తర్వాత ఇంటి వెనకాల కుక్క చనిపోయిన బాధలో ఉన్న వాచ్ మెన్ వీరేశం తో కాసేపు మాట్లాడాడు. తాను పనికి వెళ్తున్నానని, డోర్ దగ్గరకి పెట్టుకో బిడ్డా అని గట్టిగా చుట్టుపక్కల వాళ్ళకి వినపడే విధంగా వ్యాఖ్యలు చేసి అక్కడి నుండి తాను పని చేస్తున్న గోదాంకి సైకిల్ పై వెళ్లాడు. వెళ్లే ముందు ఇంట్లోని సెల్ఫ్ లో గల తన భార్య చైన్ ని కూడా ముందు గానే బియ్యం బస్తాలో కనపడకుండా దాచాడు. పని వద్దకు వెళ్ళాక ఎవరికీ అనుమానం రావొద్దని తన భార్యకు, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడాడు. మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని, యథా ప్రకారం తన హమాలీ పనిని రోజంతా చేసుకున్నాడు.
అదే రోజు సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళు చూసి, రాధిక హత్య చేయబడిందని తెలుసుకొని, తన కొడుకు వేణుకి ఫోన్ ద్వారా తెలుపగా, అతను తన తండ్రికి ఫోన్ ద్వారా తెలపడానికి ప్రయత్నించాడు. ఫోన్ కలవక పోవడంతో తన తండ్రితో పాటు పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్ చేశాడు. తన తండ్రితో రాధిక హత్య గురించి చెప్పగా, ఏమి తెలియని వాడిగా ఏడ్పు నటిస్తూ ఇంటికి వెళ్లాడు. ఇంటివద్ద అమాయకత్వాన్ని ప్రదర్శించాడు. పోలీసులు వచ్చి ఏమైనా డబ్బులు, బంగారం పోయిందా? అని ప్రశ్నించగా, ఇంట్లో గల 3 తులాల బంగారు ఆభరణాలు, రూ. 99,000/- రూపాయల నగదు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తన బిడ్డను చంపి, ఎత్తుకెళ్లారని కొత్త నాటకానికి తెరలేపాడు.
అయితే పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కన్నతండ్రే నిందితుడని పరిశోధనలో తేల్చారు. మొత్తం 21 రోజులపాటు ఎనిమిది ప్రత్యేక బృందాలు, 75 మంది సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో తీవ్రంగా శ్రమించినట్లు సీపీ కమలాసన్ రెడ్డి వివరించారు.