రుణం తీసుకుని వాయిదాలు చెల్లించకుండా బకాయి పడితే బ్యాంకు వాళ్లు ఏం చేస్తారు? విజయ్ మాల్యా లాంటి వాళ్లను ఏం చేశారూ..? అని ప్రశ్నించకండి. సాధారణంగానైతే ఏం చేస్తారనేదే ఇక్కడ అసలు ప్రశ్న. వాయిదాలు చెల్లించండి సారూ.. అని సంబంధిత రుణగ్రస్థులకు ఓ నోటీసు పంపిస్తారు. పదే పదే నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. అయినా చెల్లించకుంటే గ్యారంటీ ఇచ్చినవాళ్లకు కూడా నోటీసులు పంపిస్తారు. అప్పటికీ దారికి రాకుంటే పత్రికల్లో ప్రకటన జారీ చేసి, ఫలానా వాళ్లు తమకు రుణ బకాయి పడ్డారని, ఎంతకీ చెల్లించడం లేదని, ఫలానా రోజు వాళ్లకు సంబంధించిన ఆస్తులు బహిరంగ వేలం వేస్తున్నామహో… అంటూ దండోరా వేసిన చందంగా పత్రికల్లో టాం టాం చేస్తారు. వేలం రోజు కూడా బాకీదారులకు చివరి అవకాశమూ ఇస్తారు. కానీ హుజురాబాద్ లో స్టేట్ బ్యాంక్ వాళ్లు అప్పు వసూల్ కోసం ఏం చేశారో తెలుసా…?
ఓ స్కూల్ వాళ్లు తీసుకున్న రుణ బాకీ వసూలుకు సంబంధించి వినూత్న నిరసన ప్రక్రియను అవలంభించారు. తమ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు చెల్లించడం లేదంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని గ్రీన్ సీడ్జ్ స్కూలుకు ఉదయాన్నేసిబ్బంది చేరుకున్నారు. తమ బ్యాంక్ కు బకాయి పడిన మొత్తాన్ని చెల్లించాలంటూ స్కూల్ ముందు కుర్చీలు వేసుకుని, టిఫిన్ చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. అప్పు వసూల్ కోసం బ్యాంకు సిబ్బంది నిర్వహించిన ఈ వెరైటీ నిరసన చర్చనీయాంశంగా మారింది.