కరీంనగర్ బొమ్మకల్ భూ మాఫియాలో ఆర్టీఐ పిటిషన్ కు నిర్లక్ష్య సమాధానం ఇచ్చినందుకు ఆర్డీవో, ఏఓలపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కోర్టు ఆదేశించింది. గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న బొమ్మకల్ భూ మాఫియా వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారి ఏకంగా రెవిన్యూ డివిజనల్ అధికారి మీదనే కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి దారి తీసింది.

పూర్తి వివరాల్లోకి వెడితే… బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి హిందూ స్మశాన వాటికను కబ్జా కోరుల నుండి రక్షించాలనే ఉద్దేశంతో పోరాడుతున్న విషయం తెలిసిందే. నగరానికి కూతవేటు దూరంలో గల బొమ్మకల్ గ్రామ శివారులోని హిందూ స్మశాన వాటిక భూములను దొంగదారిలో కబ్జా చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకోవాలనే చెడు ఉద్దేశ్యంతో కొందరి అధికార పార్టీ నేతల అండదండలతో ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల వివాదానికి సంబంధించిన ఇంకొన్ని ఆధారాలు సేకరించడానికి ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ అధికారి ఆయన కరీంనగర్ ఆర్డీవో కార్యాలయంలో సి.సి నెం: ఎస్/3010/75, ఎల్.ఆర్.ఎ.నెం: 8/97, అలాగే సర్వే నంబర్లు 723, 724 ల నుండి పూర్తి వివరాలు కావాలని అయిదు పాయింట్స్ ద్వారా సమాచార హక్కు చట్టం కింద న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోరారు. ఇందుకు జవాబుగా “మీరు కోరిన సమాచారం మా కార్యాలయంలో లభ్యంగా లేనందున ఇవ్వలేకపోతున్నాము. కావున, తెలియజేయనైనది” అని మెమో ద్వారా ఆర్టీవో కార్యాయలం నుంచి సమాధానం వచ్చింది.

ఈ నేపథ్యలో సెక్షన్ 8, 9 పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్, 1993 ప్రకారం ప్రజలకు సంబంధించిన రెవిన్యూ రికార్డులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు రికార్డులు లభ్యంగా లేవని సమాధానం ఇచ్చారని, ఇతరులకు నష్టము కలిగించాలానే ఉద్దేశ్యంతో చట్టంలో నిర్ధేశించిన దానికి భిన్నంగా వ్యవహరించి ప్రభుత్వ డాక్యుమెంట్లను భద్రపరచకపోవడం, తప్పుడు సమాచారం ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నగర పోలీస్ కమీషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అన్ని ఆధారాలతో రెండవ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో తన న్యాయవాది యెన్నంపల్లి గంగాధర్ ద్వారా బేతి మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, పూర్తి వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రదీప్ కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు కాలయాపన చేయకుండా ఆర్డీవోపై, ఏఓపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ స్మశాన వాటిక భూమిని భూ బకాసురాలనుండి కాపాడడానికి చివరి వరకు పోరాడుతానని, తప్పు చేసినవారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ స్మశాన వాటిక భూములను కాపాడి వాటిలో బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలని, అలాగే తప్పు చేసిన రెవిన్యూ అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Comments are closed.

Exit mobile version