‘బతుకు బస్టాండ్’ అంటే నిర్వచనం ఏమిటి? మానవుని జీవనశైలి అనూహ్యంగా ఛిన్నాభిన్నం కావడమే. దినచర్యకు విరుద్ధంగా, నిర్దేశిత ప్రాంతాల్లో సహజ జీవన శైలికి భిన్నంగా బతుకు కొనసాగడమే కావచ్చు. కరోనా వైరస్ మనిషి బతుకు చిత్రాన్ని కకావికలం చేస్తోంది. దేశంలోనేగాక, మన రాష్ట్రంలోనూ కరోనా రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు మరీ ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి. ఇండోనేషియా వాసుల పుణ్యమా అని కరీం‘నగరం’లోని కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలోకి కూడా వెళ్లాయి. దీంతో కరీం‘నగర’ వాసులు నానా కష్టాలు పడుతున్నారు.
ప్రజల నిత్యావసర వస్తువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వపరంగా అధికారులు అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రజల కూరగాయల అవసరాలు తీర్చేందుకు కరీంనగర్ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. డివిజన్ల వారీగా నడిబజార్లలో కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోతోంది. రెగ్యులర్ కూరగాయల మార్కెట్లు కూడా సరిపోవడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్, రాత్రి వేళ కర్ఫ్యూ వంటి చర్యలు జనజీవనాన్ని అతలాకుతలాం చేస్తున్నాయి. సడలింపు సమయంలో జనం ఒక్కసారిగా రోడ్లపైకి చేరుతుండడంతో సోషల్ డిస్టెన్సింగ్ పదానికి అర్థం లేకుండా పోతోంది.
దీంతో ప్రజల నిత్యావసరాలను, ముఖ్యంగా కూరగాయల మార్కెట్లలో రద్దీని నివారించేందుకు తెలంగాణాలో భారీ బస్టాండ్లలో ఒకటిగా పేరుగాంచిన కరీంనగర్ బస్ స్టేషన్ ను కూడా ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రజల కోసం వినియోగిస్తుండడం గమనార్హం. ఈమేరకు బస్ స్టేషన్ ను కూరగాయల మార్కెట్టుగా మార్చేశారు. మంత్రి గంగుల కమలాకర్ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో వసతులను స్వయంగా పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవలసిన చర్యలను అధికారులకు నిర్దేశించారు. ‘బతుకు బస్టాండ్’ అనే పదానికి ఇంతకన్నా నిర్వచనం ఏం కావాలి? ఇది కరోనా రక్కసి మిగిల్చిన కల్లోల దృశ్యం కాదా మరి!