తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీకి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారి తీశాయి. వరంగల్ మహానగరంలోని హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద సీఏఏకు మద్ధతుగా జాతీయవాదుల ఐక్యవేదిక నిర్వహించిన ర్యాలీ అనంతరం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ, సీఏఏను వ్యతిరేకిస్తున్నవారంతా దేశ ద్రోహులేనని అభివర్ణించారు. ఇటువంటి వారంతా దేశం విడిచి పారిపోవాలని వ్యాఖ్యానించారు. తాము దాడులకు భయపడే ప్రసక్తే లేదని, ఎదురుదాడులు చేస్తామని కూడా హెచ్చరించారు.
‘ఎంఐఎం నేతల్లారా.. ఈ గడ్డమీద మీకు స్థానం లేదు. అవసరమైతే మీరు పాకిస్థాన్ పోతారో, బంగ్లాదేశ్ వెడతారో, ఆఫ్ఘనిస్థాన్ పోతారో నిర్ణయించుకోండి. కావాలంటే మీకు విమానం లేదా హెలీకాప్టర్ ఇస్తాం. అవసరమైతే బ్రేకుల్లేని బస్సుల్లో పంపిస్తాం.’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.
అంతే కాదు.. ‘ఓరుగల్లు నుంచే యుద్ధం ప్రారంభిస్తాం. నిజాం వారసులు పచ్చ జెండా చేబూని వస్తే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్ వారసులమై కాషాయ జెండా, కమలం పువ్వు చేతబట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ మనం వస్తున్నాం. ద్రోహుల్లారా ఖబర్దార్, మీరు రాళ్లు పడితే..మేం బాంబులు పడతాం. నువ్వు కట్టలు పడితే మేం కత్తులు పడతాం. నువ్వు రాకెట్టు పడితే మేం లాంఛర్లతో కొడతాం. యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో దేనికైనా సిద్దమేని ముందుకు వెడదాం’ అని సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓవైసీ సోదరుల ఆటలు తెలంగాణాలో సాగవని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని సంజయ్ వ్యాఖ్యానించారు.