మోస్ట్ వాంటెడ్ రౌడీగ్యాంగ్ లీడర్ వికాస్ దూబే ముఖ్య అనుచరుడు అమర్ దూబే పోలీస్ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ఎన్కౌంటర్ లో డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబే ముఠాలో అమర్ దూబే అత్యంత ముఖ్యుడు. గత శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో పోలీసుల మరణానికి దారి తీసిన కాల్పులకు ఇతని ప్రోద్భలమే ప్రధాన కారణంగా అనుమానిస్తున్నారు.
వికాస్ దూబే ముఠాకోసం తీవ్రంగా గాలిస్తున్న యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం అమర్ దూబేను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో వికాస్ దూబే రైట్ హ్యాండ్ అమర్ దూబే అక్కడికక్కడే మరణించాడు. అమర్ దూబేపై రూ. 25 వేల నగదు రివార్డు కూడా ఉందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే అచూకీ కోసం 40 స్పెషల్ పోలీసు టీమ్ లు వేర్వేరుగా గాలిస్తున్నాయి.