నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ లోనే ఆమె తన గెలుపునకు అవసరమైన మేజిక్ ఫిగర్ ను సాధించడం విశేషం. దీంతో ఆమె గెలుపు ఖాయమైనట్లుగానే భావించవచ్చు.
ఈనెల 10వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 824 మంది ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉన్నాయి. మరో ఓటరు పోలింగ్ కు ముందే చనిపోయారు. శనివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు.
మొత్తం రెండు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తుండగా, తొలి రౌండ్ లోనే కల్వకుంట్ల కవిత భారీ ఆధిక్యాన్ని సాధించారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో కవితకు 531 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థికి 39, కాంగ్రెస్ అభ్యర్థికి 22 ఓట్ల చొప్పున వచ్చాయి. మరో ఏడు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.
పోలైన 823 ఓట్లలో సగానికి పైగా ఓట్లు, అంటే 412 ఓట్లు లభించినా కవిత విజయం సాధించినట్లే. కానీ తొలి రౌండ్ లోనే ఆమెకు 531 ఓట్లు లభించడం గమనార్హం. దీంతో తొలి రౌండ్ లోనే కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించినట్లుగానే పరిగణించవచ్చు.
రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిశాక ఆధిక్యత స్పష్టంగా వెల్లడవుతుంది. ఈ ఫలితం అనంతరం టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
UPDATE:
కాగా ఈ ఎన్నికల్లో కవిత భారీ ఆధిక్యతను సాధించారు. పోలైన 823 ఓట్లలో 728 ఓట్లను ఆమె దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 56, కాంగ్రెస్ అభ్యర్థికి 29 ఓట్ల చొప్పన లభించాయి. మరో పది ఓట్లు చెల్లలేదు. స్థానిక సంస్థల్లో 505 ఓట్ల బలం మాత్రమే గల అధికార పార్టీ అభ్యర్థి కవితకు 728 ఓట్లు లభించడం గమనార్హం. ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.