ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈనెల 12వ తేదీన కవిత భారీ ఆధిక్యతతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 14వ తేదీన శాసన మండలిలో ఆమె ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.
కానీ అంతకు ఓరోజు ముందుగానే కవిత హోం క్వారంటైన్ కు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా బారిన పడడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం వాయిదా పడింది.
తాజాగా కవిత ప్రమాణస్వీకారానికి మరోసారి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు తెలంగాణా అసెంబ్లీ ప్రాంగణంలో కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో కవిత అభిమానుల్లో మరోసారి సంబరాల సందడి నెలకొంది.