నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెలంగాణా సీఎం కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో 88.4 శాతంతో ఆమె గెలుపొందారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కవిత అనూహ్యంగా ఓటమిని చవి చూశారు. ఈ పరిణామం సహజంగానే అధికార పార్టీ వర్గాల్లో అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కవిత భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. పోలైన 823 ఓట్లలో 728 ఓట్లను ఆమె కైవసం చేసుకున్నారు. వాస్తవానికి అధికార పార్టీకి ఇక్కడ గల ఓట్ల సంఖ్య 505 మాత్రమే. ‘ఆకర్ష్’ వంటి ప్రాచుర్యపు వార్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 223 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు జైకొట్టారనే అంశం స్పష్టమవుతోంది. ఇందుకు అధికార, విపక్ష పార్టీలు చెప్పే అభిప్రాయాలు, చేసే వానదలు భిన్నంగా ఉండొచ్చు. కారణం ఏదైనా కవిత మాత్రం భారీ విజయం సాధించారు.
ఇక అసలు విషయంలోకి వస్తే ఎంపీగా ఓటమి చెందిన కవిత ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేయడమే లోతుగా గమనించాల్సిన అంశం. మరో 15 నెలల పదవీ కాలం మాత్రమే గల ఈ స్థానం నుంచి ఆమె పోటీకి దిగడం కూడా విశేషం. ముందస్తు వ్యూహం లేకుండా అభ్యర్థిగా తన కూతురు కవితను సీఎం కేసీఆర్ ఎంపిక చేసి ఉండరనే వాదన కూడా ఉంది. ఎంపీగా ఓటమి పరిణామాలవల్ల ప్రజాసేవ జీవితానికి దూరమైన కవితను చట్టసభల్లో మళ్లీ ప్రజాప్రతినిధిగా చూడడం కోసం మాత్రమే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి ఉండకపోవచ్చంటున్నారు. ఆమెకు ప్రాధాన్యతగల పదవి కోసమే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఉంటారంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో నిజామాబాద్ రాజకీయాల్లో కవిత మళ్లీ తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పాలంటే ఆమెకు మంత్రి పదవి అనివార్యమనే అభిప్రాయాలను కూడా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ‘కవితమ్మకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి తాము సంసిద్ధం’గా ఉన్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, షకీల్ అంటున్నారు. ఎమ్మెల్సీగా కవిత విజయానంతరం ఆయా నాయకులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దీంతో కవితకు మంత్రి పదవి ఖాయమనే పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే అది ఎలా సాధ్యమనేదే ఇక్కడ అసలు ప్రశ్న. తెలంగాణాలోని ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యుల సంఖ్య 18కి మించరాదు. ఇప్పటికే ఆయా సంఖ్య భర్తీ అయింది. కానీ కవితను మంత్రిగా చేయాలంటే ప్రస్తుత మంత్రుల్లో ఎవరో ఒకరిని తప్పించాల్సిందే. ఇదే జరిగితే తన కూతురుకోసం మరొకరిని తప్పించారనే అపవాదును సీఎం కేసీఆర్ మూటగట్టుకోవలసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కవితను ఇప్పటికిప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవడం అంత సులభం కాకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఇందుకు కొంత టైమ్ పట్టవచ్చంటున్నారు. కానీ కేసీఆర్ తలచుకుంటే కవితను మంత్రి పదవిలో కూర్చోబెట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చని కూడా పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. కవితను ఉన్నఫళంగా మంత్రిని చేస్తే ప్రశ్నించేవారెవరనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పేదేమిటంటే… ఎమ్మెల్సీగా కవిత గెలిచారు… ఆమె మంత్రి అవుతారా? లేదా? అనే విషయాన్ని భవిష్యత్ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ మాత్రమే తేల్చాలంటున్నారు.
ఫొటో: నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నుంచి ఎమ్మెల్సీగా గెలుపు ధృవీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్న కవిత