కల్వకుంట్ల కవిత…తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు. నిజామాబాద్ మాజీ ఎంపీ. ఇంతకన్నా ఎక్కువ వివరాలు అక్కరలేని రాజకీయ నేత. ఆమె ఇప్పడు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతానికి తెలంగాణాలోనే కాదు ఇండియాలో కూడా లేరు. కానీ.. కవిత ఎక్కడున్నారన్నదే అధికార పార్టీ వర్గీయుల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలోనూ తెలంగాణాలో కవిత ‘జాడ’ లేకపోవడం సహజంగానే చర్చకు దారి తీస్తోంది. మొన్నటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ ప్రాంతంలోనైనా కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం పార్టీకి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీ చేసి అనూహ్యంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న రైతులు కన్నెర్ర జేసిన ఫలితంగా కేసీఆర్ కూతురు సైతం పరాజయం బాట పట్టక తప్పలేదనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగిత్యాలలో కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పావులు కదిపినట్లు ప్రాచుర్యం పొందిన కవిత పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమిని మాత్రం ఊహించి ఉండరు. కవిత ఓటమి వెనుక జీవన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతల ప్రతీకార కృషి ఉందనే వార్తలు కూడా ఉన్నాయి.

సరే.. రాజకీయాలన్నాక గెలుపు, ఓటములు సహజం. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు పూర్తయింది. కానీ కవిత మాత్రం నిజామాబాద్ ముఖం కూడా సరిగ్గా చూడడం లేదనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎనిమిది నెలల కాలంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే కవిత నిజామాబాద్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు, ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాల్లో మాత్రమే కవిత నిజామాబాద్ వెళ్లినట్లు సమాచారం. అంతకు మించి పార్టీ పరంగా మరే ఇతర కార్యక్రమాలవైపు కూడా ఆమె కన్నెత్తి చూడలేదని స్థానిక పాత్రికేయ మిత్రులు చెబుతున్నారు. కనీసం తన ఓటమికి దారి తీసిన పరిస్థితులు, పరిణామాలపై కూడా కవిత పార్టీ పరంగా ఎటువంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదట.

కవితను ఓటమి బాట పట్టించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు హామీ గురించి మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కొన్ని నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల నియోజకవర్గాల్లో మాత్రమే అర్వింద్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. వాస్తవానికి అర్వింద్ ఇచ్చిన ‘నోట్’ మాటకు సంబంధించిన ఈ నిరసనల వెనుక కవిత హస్తముందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలు తెరవెనుక నిరసన సెగలను ఎగదోశారనే కథనాలు వాడుకలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే తన ఓటమి బాధ నుంచి కవిత ఇంకా తేరుకోలేదనే వాదన వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం తన సోదరుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కేటీఆర్ కుటుంబం తిరిగి వచ్చినా, కవిత మాత్రం విదేశాల్లోనే ఉన్నారు. ఈ వార్త రాసే సమయానికి కవిత సిడ్నీలో ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం. ఇంతకీ కవిత భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటన్నదే అధికార పార్టీలో తాజా హాట్ టాపిక్. అధికార పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇక ఎన్నికల్లో ప్రత్యక్షంగా తలపడే ప్రసక్తే లేదని తన సన్నిహిత వర్గాలతో చెబుతున్నారట. అయితే ఆమె రాజకీయంగా మరేం చేస్తారన్నదే కదా ప్రశ్న?

మరికొద్ది రోజుల్లోనే ఖాళీ అవుతున్న తెలంగాణాలోని రెండు రాజ్యసభ స్థానాల్లో ఓ సీటును ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినా కవిత నిరాకరించినట్లు సమాచారం. తనకు ఎటువంటి పదవీ అక్కర్లేదని తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, ఇటు రాజ్యసభ సీటునూ నిరాకరిస్తున్న నేపథ్యంలో కవిత ఏం చేస్తారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికిప్పడు సమాధానం లేదు. ప్రస్తుతం..అంటే ఈ రోజున ఆమె సిడ్నీలో ఉన్నారు…అంతే!

Comments are closed.

Exit mobile version