ఊహించినట్టే జరుగుతోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత పేరు ఖరారైంది. లాంఛనంగా ఆమె పేరును ప్రకటించడం, నామినేషన్ దాఖలు చేయడం మాత్రమే ఇక జరగాల్సి ఉంది. ఈనెల 13న కవిత పుట్టిన రోజు వేడుకలను అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఛాంబర్లో నిర్వహించినపుడే ఇందుకు సంబంధించిన సంకేతాలు వెలువడ్డాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఎటువంటి ప్రజాప్రతినిధి హోదా లేకపోయినా కవిత బర్త్ డే వేడులకు డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో నిర్వహించడం, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం కవిత రాజకీయ భవితపై భిన్న కథనాలు వెలువడ్డాయి. ఆమె రాజ్యసభకు వెడతారనే సారాంశంతో కూడిన వార్తా కథనాలు ఇందులో భాగమే. తెలంగాణా నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆమెకు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది.
కానీ అనేక రాజకీయ సమీకరణలు, తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ టికెట్ కేటాయింపుతోనే కవితకు ఎమ్మెల్సీ టికెట్ అంశంలో లైన్ క్లియర్ అయినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రాచుర్యంలోకి వచ్చిన నర్సింగ్ రావు అనే నాయకుడు నిన్ననే తన నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. దాదాపు ఇతనే అభ్యర్థిగా పార్టీ వర్గాలు కూడా భావించాయి.
ఇదీ చదవండి: కాబోయే ఎమ్మెల్సీ ‘కవితక్క’! అక్కడ జన్మదిన వేడుక సంకేతమా?
కానీ నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గడువు ఉన్న పరిస్థితుల్లో గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం వెలువడింది. తన తనయ కల్వకుంట్ల కవిత పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారని, పార్టీ నేతలు కూడా ఇందుకు స్వాగతించారన్నది తాజా వార్తల సారాంశం. ‘వడ్డించేవాడు మనవాడయితే ఏ బంతిలో కూర్చున్నా మూలుగు బొక్క పడుతుంది’ అనే సామెతకు అనుగుణంగా కవితకు కలిసి వచ్చిన రాజకీయ అంశంగా టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాజకీయంగా ‘వడ్డించే వ్యక్తి నాన్నయితే…’ కవితకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమైనట్లుగా ఆయా ప్రచారపు సారాంశం. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు సీనియర్ మంత్రులకు, ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ గా ఉన్నప్పటికీ టికెట్లు దక్కని మరికొందరు టీఆర్ఎస్ నేతల తాజా రాజకీయ స్థితిని బేరీజు వేసుకుని ఆయా సామెతను రాజకీయ పరిశీలకులు అన్వయిస్తున్నారు. అదీ సంగతి.