ప్రజాకవిగా, హక్కులు, తెలంగాణా భాషా పరిరక్షకడిగా, పద్మభూషణుడిగా ఎంతో కీర్తి గడించిన కవి కాళోజీ నారాయణరావు. ఇతనిలో మరో పార్శ్వం మంచి కథారచయిత. లంకా పునరుద్ధరణ కథ ఆయన సాహచర్యంలో ఆయన నోట వినటం నా అదృష్టం. నాగిళ్ళ రామశాస్త్రి కృషి ఫలితంగా ఆయన రాసిన కథలు కొన్ని పూర్వం చదివాను. ఎల్లప్పుడూ అన్యాయాన్ని ఎదిరించటమే.
‘నా గొడవ’ గా పదిహేను సంపుటాల కవితలు వచ్చాయి. ప్రొఫెసర్
వేలూరి శ్రీదేవి చొరవతో కాళోజీ రచనలపై కాకతీయ విశ్వవిద్యాలయంలో సదస్సు జరిగి సంచిక వచ్చింది. అప్పుడు ఆయన కథల సారాంశం తెలిసింది. ప్రజాకవి వరవరరావు శ్రద్ధ కృషి ఫలితంగా ‘కాళోజీ కథలు’ సంపుటి 2000 సంవత్సరంలో తొలి ముద్రణ పొందింది. మొత్తం 67పుటలతో పదమూడు కథలు చోటు పొందాయి.అణా అక్షర గ్రంథమాల ప్రచురణలు పది. రెండు మరాఠీ కథలకు అనువాదం. ఒకటి ఆంగ్లకథకు అనువాదంగా కాళోజీ రాసినవే. ఇందులో వాడిన భాష అచ్చంగా తెలంగాణా తెలుగు పదాలే. ప్రతులు లభించక కాళోజీ ఫౌండేషన్ వారు 2011లో మలి ముద్రణ చేశారు. ఈ సంపుటికి వరవరరావు తొలిపలుకులు పతాకశీర్షిక కాగా, వి.ఆర్. విద్యార్థి రాసిన ‘కాళోజీ కథల మంజూషా’ గుండెకాయ వంటిది. అన్ని కథలు చదివే సమయం చిక్కకపోతే ఈ రెండు వ్యాసాలు చదివినా కాళోజీలోని రచయిత దర్శనమిస్తాడు.
సామాజిక విలువలు, మానవత్వం, మూఢ నమ్మకాలు కథల్లో వస్తు వైవిధ్యంతో రచయిత మనస్సు పొరల్లోని భావజాలం దర్శనమిస్తాయి.
కాళోజీ భావనలో హింసతప్పు..
రాజ్యహింస మరీ తప్పు…
ప్రతిహింస ఆత్మరక్షణ కు ఆయుధం.
‘నాగొడవ’లో అదే కనిపిస్తుంది.
బడి పలుకుల భాష వద్దు. పలుకుబడుల భాష గావాలె.
నా మనసులోని ఆసక్తికి..
నా అవయవాలకు గల శక్తికి..
కట్టడి కుదరక
కొట్టుకు చేస్తున్నా !
మెట్టునెట్టుకు వస్తున్నా! అంటాడు 84 ఏళ్ళవయసులో కాళోజీ.
‘భూతదయ’ కథలో అప్పుడే కనులు తెరిచిన అనాథ పసిపాప ఆలయ ప్రాంగణంలో చూసి జనం గుమిగూడుతారు. తల్లిని అనేక కోణాల్లో తిడతారు. కానీ పాపను రక్షించటానికి మొగ్గు చూపరు. చివరికి ఒక మత గురువు చేరదీస్తాడు. కానీ అక్కడే ఒక్క రాత్రి విగ్రహం దొరికితే ఆనందంతో అందరు విరాళాలిచ్చి గుడి కట్టిస్తారు. ‘రాళ్ళకిచ్చిన విలువ ప్రాణాలకివ్వలేదని’ రచయిత ప్రశ్నిస్తాడు.
‘మనమే నయం’ కథలో రెండు ఎద్దులు, పొలాల పండుగ వంటి సందర్భంలో పశువులను అందంగా అలంకరించే వేళ వాటి సంభాషణలో కవి హృదయం వినిపిస్తుంది. చతుష్పాది రక్షణకు సంఘాలున్నాయి. కనీసం కసాయి శాలలున్నాయి. ’ద్విపాదికి జాలి, కరుణ, ఐక్యత ఏవీ లేవని పసురాలు బాధపడి మనమే నయం’ అనుకుంటాయి.
‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషం’ కథలో రెండు ఆత్మలు నరకంలో చిత్రగుప్తుని ముందు కలుసుకుంటాయి. భాష, ప్రాంతం పరిచయంలో ఎదుటివారెవరో ‘తెలియక’ ఒకటై ప్రేమను ప్రకటించుకుంటాయి. తర్వాత చర్చలో కుల, మతాలకు సంబంధించిన ఒకే ఘర్షణలో ఇరువర్గాలు ప్రతినిధులుగా అసువులు బాసిన వారని ‘తెలిసి’ ద్వేషం పెంచుకుంటాయి.
‘విభూతి లేక ఫేస్ పౌడర్’ కథ వ్యంగ్య భావాలది. కట్నాలకోసం సతాయించిన అల్లుడికి, మద్దతిచ్చిన బిడ్డకు తల్లి వైపు వాళ్ళు బుద్ధిచెప్పినది. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి, శివుని సంభాషణ, సతికి అవమానం కథకు అనుసరణవలె కనిపిస్తుంది.
‘లంకా పునరుద్ధరణ’ కథలో రావణ వధానంతరం లంకకు రాజెవరనే ప్రశ్నకు చర్చ. ఇరాన్-ఇరాక్ యుద్ధం, భారతదేశం స్వాతంత్య్రం అనంతరం పరిపాలకులెవ్వరు? హైదరాబాద్ రాష్ట్ర విముక్తి తర్వాత రాజులెవ్వరు? అంశాలకు ప్రతిబింబం. 1948-49 కాలంలో రాసింది, మైరావణుడా, విభీషణుడా, కుబేరుడా, లక్ష్మణుడా అనే తరుణం రాముని తీర్పుతో విభీషణుడు రాజు కావటం. ఈ కథ కాళోజీ తాత ఇంటిలో తాతనోటితో 1990లో విన్న అదృష్టవంతుడిని. అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉద్యమ సంఘాలకు తగిన స్వేచ్ఛనిచ్చారు. వరంగల్లులో భారీఎత్తున సమావేశాలు జరిగాయి. ఈనాడు పాత్రికేయ వృత్తిలో నేనాయన ఇంటికి వెళ్ళాను.సభలకు ముఖ్య అతిథిగా కాళోజీ వెళ్ళే ముందు చెప్పినకథ.
‘ఆగస్టు పదిహేను కథ’
అసమర్థులకు పరిపాలన అంటగడితే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తుంది.
‘జాజితీగ, రెండు గింజలు’
మరాఠీ అనువాద కథలు. జాజితీగలో తండ్రి కూతురుని తనకు మంచిగా భావించిన ధనవంతుడితో పెళ్ళిచేయాలని అనుకుంటాడు. బిడ్డ వారాలు చేసుకుని చదువుకునే పేదవాడిని ప్రేమిస్తుంది. యజమాని జాజిచెట్టు నాటి మంచి గుంజలతో పందిరి వేసి పెంచ యత్నిస్తాడు. కానీ ఆ జాజితీగ పక్కనే ఎండిపోయిన బీర తీగకు బలంగా చుట్టుకుని అల్లుకుని కమ్మని పూలు పూస్తుంది.
రెండు గింజలు కథలో ఆశావాదులు, నిరాశావాదుల భావాలు కనపడుతాయి.
‘అపోహ’ ఆంగ్లానువాదం కథ. ఒకే పోలిక ఉన్ననాణేల వల్ల తమదేదో తేల్చుకోలేనివేళ ఆంగ్లేయుడు తనను చెక్ చేయవద్దని నిరాకరించడం. అసలు నాణెం దొరికిన తర్వాత తన నిర్ణయానికి కారణం చెప్పి తనజేబులోని నాణెం చూపించి అపోహ తొలగిస్తాడు.
ఈ కథలన్నీ 1940-1970 మధ్యలో పలు సందర్భాలలో ప్రచురణ పొందాయి. కాళోజీలోని పోరాటపటిమే కాకుండా సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయటం, కథారచయిత లక్షణాలన్నీ చూపిస్తాయి. చదువదగిన కథల సంపుటి.
✍️ మాడుగుల నారాయణమూర్తి
(నేడు కాళోజీ నారాయణరావు జయంతి)