రైతు కష్టం పగోడికి కూడా రావొద్దన్నది తెలంగాణాలో ఓ సామెత. ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధి దాటి ఎగదన్నుతున్న ఫలితంగా ఈ కర్షకుని కంట కన్నీరొలుకుతున్న నిస్సహాయ స్థితి ఇక్కడ కనిపిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంత రైతులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు కోసం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో పంటలు నీట మునుగుతున్నాయి.
మేడిగడ్డకు ఎగువన గల సురారం, బెగ్లూరు, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి శివార్లలోని పంటలు బ్యాక్ వాటర్ కారణంగా మనిగిపోతున్నాయి. ప్రాజెక్టు నీటి కారణంగా పంటలు మునగకుండా ఉండేందుకు కరకట్ట నిర్మించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వేలాది ఎకరాల్లో మిర్చి పంట నీట మునిగిపోతోంది. ముంపు ప్రాంతంలో ఈ మిర్చి చేలు ఉండవచ్చని భావించకండి. ముంపు ప్రాంత పరిధి దాటిన వ్యథ ఇది. ఇంజనీరింగ్ అధికారుల లెక్కల్లోని లోటుపాట్లను కూడా ప్రశ్నించకుండా రైతాంగం కష్టాలను దిగువన గల వీడియోలో చూడండి.