నేను పుట్టి పెరిగిన ప్రాంతం. జన్మనక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరపు అసలు పేరును మార్చి, సమ్మక్క తల్లి అక్షర నామాన్ని కలుపుతూ చేసిన ‘సమ్మిరెడ్డి’ నామకరణం. సమ్మక్క తల్లి మహిమకు ప్రతిరూపమే పేరు మార్పునకు కారణమని నా తల్లి, దండ్రులు చెబుతుండేవారు. ఆదివాసీ గిరిజనుల సాన్నిహిత్యంతో పెరిగిన వాతావరణం. ఏటూరునాగారం అభయారణ్యంలో ‘ఈనాడు’ పత్రికలో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభం. అక్కడ నేర్చుకున్న పాత్రికేయ అక్షర ప్రస్థానంలో అవకాశం ఉన్నా, లేకున్నా మేడారం జాతర వచ్చిందంటే భక్తులకు తెలియని విషయాలు రాయాలనే తపన. ఎన్నో జాతరలకు ప్రముఖ పత్రికల్లో న్యూస్ కవర్ చేసిన అనుభవం. మేడారం జాతర ప్రాశస్త్యాన్ని దినపత్రికల సండే మేగజైన్ కవర్ పేజీ స్టోరీ వరకు తీసుకువెళ్లిన తొలి ఘనత. కానీ సమ్మక్క తల్లి జాతర గురించి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న చరిత్రలోనూ ఇంకా తెలియని విషయమేదో దాగి ఉందనే సందేహం. మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజపు కెరీర్ లో చేసిన ప్రయత్నాలు ఎప్పుడూ ఫలించలేదు. ఇదిగో ఈసారి ఆ అవకాశం లభించింది. మేడారం జాతర వెనుక మనకు తెలియని విషయం దాగి ఉందనే అంశం ఆసక్తిని కలిగిచింది. పాత తరం ఆదివాసీ పెద్దలు, స్నేహితులతో తెలుసుకున్న విషయాల్లో ఓ సరికొత్త అంశమిది. దీనికీ కూడా చారిత్రక ఆధారం లేదు. కాకపోతే ఆదివాసీలు చెప్పే నేపథ్యాన్ని మించింది లేదనే నమ్మకం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని మరింత ఇనుమడింజేసే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. పాత చరిత్రకూ ఆనవాళ్లు లేవు. కొత్త విషయానికి ఆధారం లేదు. అంత మాత్రాన కల్పితమూ కాదు. మహిమగల సమ్మక్క తల్లిగా భక్తుల విశ్వాసానికి సంబంధించిన మేడారం జాతర ప్రాశస్త్యం వెనుక ఆదివాసీలు చెబుతున్న విషయాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించే ప్రయత్నం మాత్రమే.
-ఎడమ సమ్మిరెడ్డి
కోట్లాది మంది భక్తుల విశ్వాసం..ఎటువంటి లిఖితం లేని చరిత్ర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే రాష్ట్ర పండుగ మేడారం జాతర. రెండేళ్లకోసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజు అడవిలో సాక్షాత్కరించే అద్భుత దృశ్యం. శాశ్వత సౌకర్యాలు లేకపోయినా జాతర, జాతరకూ పెరుగుతున్న భక్తుల సంఖ్య. మేడారం జాతర గురించి, సమ్మక్క-సారలమ్మల మహిమలు, ప్రాశస్త్యం దశాబ్ధాలుగా తెలిసిన చరిత్రే. కానీ ఎవరికీ తెలియని చరిత్ర ఉందని సమ్మక్క-సారలమ్మలను ఇలవేల్పులుగా కొలిచే కోయలే చెబితే..? ఆశ్చర్యమే…ఔనా అనిపించే సందేహం. చారిత్రక ఆధారం ఏమిటనే ప్రశ్నలు. ప్రస్తుతం వాడుకలో గల చరిత్రకు ఆధారం ఉందా? అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. కానీ ఆదివాసీ ‘జనశ్రుతి’ ప్రాచుర్యంలోకి రాకుంటే ఒక్కోసారి వాస్తవాలు కూడా మరుగున పడే ప్రమాదం ఉంటుంది. నిజమేమిటో తెలుసుకునే కనీస ప్రయత్నం చేయకపోవడమూ జర్నలిస్టు లక్షణం కాదనే భావన కూడా స్ఫురిస్తుంది.
సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించి ఇప్పటి వరకు మనం చదువుకుంటున్న చరిత్ర ఏమిటి? 13వ శతాబ్దం. కరీంనగర్ పరగణా, మేడారానికి చెందిన పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్నల సంతానం. కరవు నెపంతో మేడారం సామంతరాజు పగిడిద్దరాజు తమకు కప్పం కట్టలేదనే ఆగ్రహంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించడం. పగిడిద్దరాజు సంగతేమిటో తేల్చాలని తన ప్రధాన మంత్రి యుగంధర్ ను పురమాయించడం. మేడారంపై కాకతీయ సేనలతో అతను దండెత్తడం. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన పగిడిద్దరాజు. సారలమ్మ, నాగులమ్మలు వీరమరణం పొందడం, పరాజయ భారాన్ని తట్టుకోలేక సమ్మక్క కుమారుడైన జంపన్న సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడం, ఫలితంగా సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రాచుర్యం పొందడం, కాకతీయ సేనలతో అందరికన్నా గట్టిగా పోరాడిన సమ్మక్క తీవ్ర గాయాలతో రుధిర ధారలతోనే యుద్దభూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెడుతూ అదృశ్యం కావడం, ఓ పుట్ట వద్ద లభించిన కుంకుమ భరిణెను సమ్మక్క తల్లి రూపంగా భావిస్తూ రెండేళ్లకోసారి మేడారంలో జాతర నిర్వహించుకుంటుండడం…. ఇదీ మనకు తెలిసిన లేదా అనాదిగా ప్రాచుర్యంలో గల చరిత్ర. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర గల జాతర ఒకప్పుడు గిరిజన తెగల్లోని కోయజాతికి చెందిన పండుగ మాత్రమే. దాదాపు ఎనిమిది దశాబ్ధాలుగా గిరిజనేతరుల పండుగగా రూపాంతరం చెందడమే విశేషం. కానీ మేడారం జాతరకు చారిత్రక ఆధారాలు లేకపోవడమే ఇక్కడ గమనార్హం.
చరిత్ర ప్రకారం… వాస్తవానికి కాకతీయరాజు ప్రతాపరుద్రుడు గొప్ప చక్రవర్తి. తన ప్రజల సుభిక్షమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగించిన కాకతీయ వంశంలోని చివరి రాజు. రాణీ రుద్రమదేవి మనుమడు. కాకతీయ సామ్రాజ్యంలో అనేక శివాలయాలు నిర్మించారు. ప్రజల జీవన పరిస్థితుల మెరుగునకు పెద్ద పెద్ద చెరువులు నిర్మించారు. తెలంగాణాలోని అనేక పురాతన చెరువులు కాకతీయ రాజుల పుణ్యంగా చారిత్రక నేపథ్యం. ఓవైపు భక్తి, మరోవైపు రాచరిక దాతృత్వం, ఇంకోవైపు ప్రజల సుభిక్షాన్ని మాత్రమే కోరుకున్నట్లు చారిత్రక ఆధారాలు గల ప్రతాపరుద్రుడు అత్యంత కర్కశ నిర్ణయం తీసుకుంటాడా? వేయి స్తంభాల గుడి వంటి అనేక గోపురాలు నిర్మించిన శివభక్తుడు యుద్ధంలో ఆదివాసీల బలిని కోరుకుంటాడా? ప్రతాపరుద్రుని కాలంలో అంటే 13వ శతాబ్ధంలో అసలు సమ్మక్క ఆనవాళ్లు ఉన్నాయా? వాస్తవానికి కాకతీయ సేనలతో పగిడిద్దరాజు కుటుంబం ఎటువంటి యుద్దం కూడా చేయలేదా? సమ్మక్క కుటుంబీకుల వీరోచిత పోరాటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. లిఖిత ఆధారం, భౌతిక శాసనం, వస్తు సముదాయం లభ్యమైతేనే అది చరిత్ర. అందుకు ఆనవాళ్లు అవుతాయి. కానీ ప్రతాపరుద్రునితో సమ్మక్క-సారలమ్మ కుటుంబం తలపడిందనడానికి ఏ చారిత్రక ఆధారమూ లేదని చరిత్ర పరిశోధకులే స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రతాపరుద్రునికన్నా ముందు కాలం నుంచి కూడా మేడారం జాతర ఉండవచ్చని కూడా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. దేశంలో ప్రతి గిరిజన జాతర కూడా అడవిలో చేసుకునే పండుగగానే చరిత్ర పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఏ చారిత్రక ఆధారమూ లేని మేడారం జాతరలో అసలు సమ్మక్క ఎవరు? పగిడిద్దరాజు ఎవరు? నాగులమ్మ సమ్మక్క కూతురు కాదా? ఆమెకు సవతి మాత్రమే అవుతుందా? ప్రతాపరుద్రుని సేనలతో యుద్ధమే చేయని సమ్మక్క-సారమ్మలు కోట్లాది మంది భక్తి పారవశ్యపు విశ్వాసానికి ప్రతీకలుగా ఎలా నిలిచారు? వాళ్లెందుకు దేవుళ్లయ్యారు? మేడారంలో అసలు జరిగిందేమిటి?
(to be continued)