సుమన్, భానుప్రియ నటించిన సితార సినిమా చూసే ఉంటారు కదా? అప్పట్లో ఆ చిత్రం సూపర్ హిట్. అందులో శరత్ బాబు పాత్ర ఉంటుంది. ఓ పెద్ద రాజమహల్ వంటి కోట. అందులో నివసించే శరత్ బాబు పాత్ర. పరిసర గ్రామాల ప్రజలు తనను కలవడానికి వచ్చినా, చందాల కోసం వారు అభ్యర్థించిన సమయంలో శరత్ బాబు పాత్ర రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. తన రాచరికాన్ని లేదా దర్పాన్ని ప్రదర్శించడానికి ఓ కోటు ధరించి శరత్ బాబు పాత్ర దర్శనమిస్తుంటుంది. తిరిగి మళ్లీ కోటలోకి వెళ్లగానే శరత్ బాబు కోటు తీసి పక్కన పడేస్తాడు. అప్పుడు కనిపిస్తుంది శరత్ బాబు పాత్ర ప్రదర్శించిన దర్పం వెనుక గల అసలు దృశ్యం. కోటు తీయగానే అనేక చోట్ల చిరిగి, పేలికలుగా మారిన చొక్కా దర్శనమిస్తుంది. ‘దీన్నే పైన పటారం…లోన లొటారం’ అని కూడా అంటుంటారు.

ఓకే..అది సినిమా. పాత్రను ఎలాగైనా మలచవచ్చు. అది దర్శకుడి ఇష్టం. కానీ ఇదిగో మీరు చూస్తున్న ఈ కార్టూన్ కూడా సితార సినిమాలోని శరత్ బాబు పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నదే. సగటు జర్నలిస్టు బతుకు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదే. కాకపోతే జర్నలిస్టుది సినిమా దృశ్యం కాదు. జీవిత చిత్రం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి బిజీ, బిజీగా గడిపే జర్నలిస్టు అసలు జీవితాన్ని ప్రతిబింబిస్తున్న కార్డూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో గిరా గిరా తిరుగుతోంది.

ఔను జర్నలిస్టు జీవితం ఇలా ఛిద్రం కావడానికి కారకులెవరు? ఇదీ అసలు ప్రశ్న. సరిగ్గా మూడు దశాబ్ధాల క్రితం వంద కిలోమీటర్ల వరకు విలేకరికి ఓ గుర్తింపు, గౌరవం ఉండేది. ఇప్పుడు పక్క వీధి మారితే పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందనే ఆవేదనను పాత్రికేయ వృత్తినే నమ్ముకున్న అసలు జర్నలిస్టులు అనేక మంది వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు కారణాలు అనేకం కావచ్చు. కొన్ని యాజమాన్యాల వైఖరే కాదు, జర్నలిస్టుల ముసుగులో గల నేర స్వభావం గల ‘లంచాల’ కేరక్టర్లు కూడా కారణమే. జర్నలిజాన్ని ఓ భుక్తికి మార్గంగా మార్చుకున్న మరికొందరి అకృత్యాలు సైతం కారణమే. ఇంకా లోతుల్లోకి వెడితే అనేక అంశాలు గుర్తుకు వస్తాయి. అందులో కొన్ని ‘లంచాల’ కేరెక్టర్లను పరిశీలిస్తే పతనావస్థకు ప్రధాన కారకులు ఎవరనేది మన కళ్లముందే సాక్షాత్కరిస్తారు.

ఒకానొక పత్రికలో ఓ కేరక్టర్ ఉండేది. నిత్యం ఆ సంస్థ చైర్మన్ చెవులు కొరకడమే ఆయన విధి. ఫలానా జిల్లా రిపోర్టర్ కు సీనియారిటీ పెరిగిపోయింది సర్. అతనికి అంత శాలరీ అవసరమా? కొత్త రిపోర్టర్లను తీసుకుంటే రూ. 1,800 లకే ఒకరు చొప్పన వస్తారు. సీనియర్ కి ఇచ్చే వేతనంతో ముగ్గురితో పని చేయించుకోవచ్చు. సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం ఈ కేరక్టర్ దుశ్చర్య అనేక మంది జర్నలిస్టులు వీధులపాటు కావడానికి దోహదపడింది. ఇటువంటి అనంతర పరిణామాల్లో ఆ పత్రిక ప్రస్తుతం దేవతా వస్త్రంగా మారిందనేది వేరే విషయం.

మరో పత్రికలో ఏకంగా ‘లంచాల’ కేరెక్టర్ ఒకటి ముఖ్య స్థాయిలోకి వెళ్లింది. తాను పనిచేసే పత్రికలో నూకలు చెల్లడం, కొత్త యాజమాన్యాన్ని బుట్టలో వేసుకుని అందలం ఎక్కడం చక చకా జరిగాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో ప్రధాన పోస్టులో నియమితుడైన ‘లంచాల’ కేరెక్టర్ ఏకంగా బ్యూరో ఇంచార్జిలనే టార్గెట్ చేశాడు. యాజమాన్యం క్రీమ్ టీమ్ గా భావించిన వారినే తన అక్రమ వసూళ్లకు లక్ష్యంగా చేసుకున్నాడు.

‘నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను’ అంటూ ఫోన్లలో బ్యూరో ఇంచార్జిలను వేధింపులకు గురి చేసేవాడు. ‘ఇంతకీ తమరు ఆశించేదేమిటి?’ అని బ్యూరో ఇంచార్జిలు ప్రశ్నిస్తే, మంచి న్యూస్ స్టోరీ కోసం అని మాట మార్చేవాడు. గల్లీ రాతల నుంచి గజ్జి రాతల వరకు ఎదిగిన అతని జీవితంలో వేధింపుల పర్వం తీవ్రతరమై ఆ పత్రికలో అనేక మంది సీనియర్లు సంస్థకు టాటా చెప్పక తప్పలేదు. తన ఎక్స్పెక్టేషన్ కు తగ్గట్లు మౌల్డ్ కాని బ్యూరో ఇంచార్జిలు రాజీనామా చేసే సమయంలో, తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే ముఖం లేక, ఆఫీసు నుంచి ముందుగానే పత్తా లేకుండా పారిపోయిన ఉదంతం సదరు ‘లంచాల’ ఇంచార్జ్ అసలు ప్రత్యేకత. పులస చేపల రుచికి, పక్క రాష్ట్రంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల స్థాయికి ఎదిగిన ‘లంచాల’ కేరక్టర్ నిజ స్వరూప దర్శనం అయ్యాకగాని ఆ పత్రిక యాజమాన్యానికి కనువిప్పు కలగలేదు. చివరికి ఆ పత్రిక యాజమాన్యం అతన్ని గెంటేసిందనేది వేరే విషయం.

ఆ తర్వాత ఉద్యోగం కోసం అతను ఎక్కని గడపా లేదు…దిగని గడపా లేదు. కేవలం ఏడాదిలో మూడు సంస్థలు అతన్ని భరించలేకపోవడమే ఈ ‘లంచాల’ కేరక్టర్ అసలు ప్రత్యేకత. చివరికి చేసేది లేక తానే ఓ పచ్చడి వంటి దుకాణం ప్రారంభించి రామోజీరావు వంటి వారికి పత్రిక ఎలా నడపాలనే అంశంపై సలహాలు ఇస్తూ, తనకు తోచిన విధంగా రాసుకుంటూ, తన  అచ్చటా, ముచ్చటా తీర్చుకుంటున్నాడు.

ఇదిగో ఇటువంటి అనేక ‘లంచాల’ కేరక్టర్లు ఎంతగా పత్రికా రంగంలోకి ప్రవేశించాయంటే 1989లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లభించిన స్వేచ్ఛ వల్ల అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో లంపెనిస్టులు చేరినంత స్థాయిలో అన్నమాట. అందుకే ఇప్పటి జర్నలిజంలో పాత్రికేయుల పాత్ర నామమాత్రం. మిడిల్ మేనేజ్ మెంట్ లో గల ‘లంచాల’ కేరెక్టర్లే అసలైన జర్నలిస్టుల జీవన పతనావస్థకు ప్రధాన కారకులు. వీరిలో రాయని భాస్కరులు కూడా అనేక మంది ఉన్నారు. కారణాలు ఇంకా అసంఖ్యాకంగా మిగిలే ఉన్నాయి. సందర్బానుసారం వాటి గురించీ చెప్పుకుందాం.

Comments are closed.

Exit mobile version