‘పట్టుమని పదివేల మంది గెరిల్లాలు లేని మావోయిస్టులు అత్యంత బలోపేతమైన లక్షలాది మంది సైనికుల బలం కలిగిన భారత ప్రభుత్వంతో సాయుధ పోరాటం చేయడం అసంభవం. మైదాన ప్రాంతాల్లో పార్టీ పలుకుబడి పెరిగే అవకాశాలు మృగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో కొలంబియా మాదిరిగా ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విలీనం కావడమే తెలివైన మార్గం. భారత మావోయిస్టు పార్టీకంటే పెద్దదైన కొలంబియా ఎఫ్ఏఆర్సీ రెండేళ్ల కిందనే సాధారణ జనజీవన స్రవంతిలోకి వచ్చేసింది. గణపతి, మరికొందరు అగ్రనేతలు లొంగిపోతున్నారనే ప్రచారంపై మావోయిస్టుల అధికార ప్రకటనే నిజం కావచ్చు. అలా కాకుండా వేలాది మంది సహచరులను వదిలేసి కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే లొంగిపోతే యాభయ్యేళ్ల విప్లవ పోరాటానికి విషాదకరమైన ముగింపుగానే భావించాలి.’
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతినే కాదు ఆ పార్టీని టోకున లొంగిపోవాలని ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, ‘మార్క్సిస్టు’ నేపథ్యం గల వర్ధెల్లి మురళి తన ‘రాత’ ద్వారా పిలుపునిచ్చారు. కొందరు అగ్రనేతలు మాత్రమే లొంగిపోతే యాభయ్యేళ్ల విప్లవ పోరాటానికి విషాదకరమైన ముగింపుగానే భావించాలని కూడా ఆయన ముక్తాయించడం గమనార్హం. వర్ధెల్లి మురళి ఈ పిలుపును ఎక్కడ ఇచ్చారంటే…? ‘సాక్షి’ పత్రిక ఎడిటోరియల్ పేజీలో. ప్రతి ఆదివారం ఆయన ‘జనతంత్రం’ కాలమ్ కింద ఎడిటోరియల్ పేజీలో ఓ వ్యాసం రాస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రచారపు అంశాన్ని సారాంశంగా తీసుకుని వ్యాసం రాశారు. ‘గణపతి’ నిమజ్జనం శీర్షికన ఆయన రాసిన ఈ వ్యాసంలో అనేక అంశాలను తనదైన శైలిలో ప్రస్తావించారు.
అమెరికాలో పౌరహక్కుల కోసం మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం నుంచి ఆఫ్రికా చేగువేరా విప్లవ శంఖారావం వరకు, బెంగాల్ చారుమజుందార్, కానూ సన్యాస్ ల నక్సల్బరీ విప్లవ నాయకత్వం నుంచి ఉస్మానియా యూనివర్శిటీలో జార్జిరెడ్డి ఉద్యమ నేపథ్యం, పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)ల ప్రస్థానం దాకా, కొండపల్లి సీతారామయ్య నుంచి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు వరకు అనేక మంది విప్లవ నేతలను తన వ్యాసంలో ప్రస్తావిస్తూ విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్లో సీపీఎం సర్కార్ ను కూకటివేళ్లతో సహా పెకలించిన నందిగ్రామ్ పోరాట రూపశిల్పిగా కిషన్ జీని ప్రస్తావించారు. అదే కిషన్ జీని అనంతర పరిణామాల్లో మమతా బెనర్జీ సర్కార్ ఎన్కౌంటర్ చేసిందని కూడా గుర్తు చేశారు. వామపక్ష పార్టీల ప్రస్తుత స్థితినీ కూలంకషంగా సమీక్షించారు. బ్యాలెట్ కమ్యూనిస్టులపై బుల్లెట్ కమ్యూనిస్టులు ఓ పాయింట్ స్కోర్ చేశారని ప్రశంసించారు. మావోయిస్టు పార్టీ కొంత మేర గిరిజన పునాదినైనా నిలబెట్టుకోగలిగిందని, బ్యాలెట్ కమ్యూనిస్టులు నామమాత్రపు ఉనికిని కూడా కాపాడుకోలేకపోయారని అన్నారు.
ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి, గతితార్కిక వాదం, వర్గపోరాటం, సాయుధ విప్లవం వంటి అంశాల ఔచిత్యం ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ‘మార్క్సిస్టు’ నేపథ్యం గల ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి తన వ్యాసంలో అంతిమంగా ఏమంటారంటే…? కొలంబియా ఎఫ్ఏఆర్సీ సంస్థ తరహాలో మావోయిస్టు పార్టీ కూడా ఆయుధాలను అప్పగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విలీనం కావాలని తన ‘జనతంత్రం’ వ్యాసంలో పిలుపునిచ్చారు. కానీ కొద్ది మంది అగ్రనేతలు మాత్రమే లొంగిపోతే యాభయ్యేళ్ల విప్లవ పోరాటానికి విషాదకరమైన ముగింపుగానే భావించాలన్నది మురళి వ్యాసాభిప్రాయంలోని చివరి పేరాలోని ఓ వాక్యం.
ఈ అంశంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి కూడా అవసరమని, మావోయిస్టులను వేటాడడమే లక్ష్యంగా ఉన్నంతకాలం ఈ పరిణామం సంభవించదని సైతం ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే… మావోయిస్టు అగ్రనేత గణపతికి ‘తెలివైన’ మార్గాన్ని సూచిస్తూనే, ఈ విషయంలో ప్రభుత్వాలకు ఉండాల్సిన చిత్తశుద్ధి అవశ్యకతనూ వర్ధెల్లి మురళి తన జనతంత్రం కాలమ్ ద్వారా ‘గణపతి’ నిమజ్జనం శీర్షికతో రాసిన వ్యాసం ద్వారా హితబోధ చేశారు. అదీ సంగతి.