ఆత్మ బలిదానం చేసుకుంటానంటూ ఓ జర్నలిస్టు ఇచ్చిన బహిరంగ అల్టిమేటానికి నేడు చివరి రోజు కావడంతో పాత్రికేయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెవెన్యూ శాఖలోని అవినీతి అనకొండలపై ప్రభుత్వం చర్య తీసుకోకపోతే తాను ఆత్మ బలిదానానికి సిద్ధమని నాగేందర్ రెడ్డి అనే జర్నలిస్టు బహిరంగ ప్రకటన చేసి నేటికి సరిగ్గా ఎనిమిదో రోజు.
ఈనెల 14వ తేదీన రాత్రి 9.13 గంటల ప్రాంతంలో సోషల్ మీడియా వేదికగా ఆయా జర్నలిస్టు ఈ అల్టిమేటమ్ జారీ చేశారు. ఈనెల 21వ తేదీ సోమవారం లోగా రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులపై చర్య తీసుకోకుంటే ఆత్మ బలిదానానికి సిద్ధమంటూ ఆయన చేసిన ప్రకటన గడువు నేటితో ముగుస్తోంది.
గతంలో తనకు తాను భూమిలో పాతుకుని రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నాగేందర్ రెడ్డి తాజాగా ఇచ్చిన ‘అల్టిమేటమ్’పై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటి వరకైతే ఏ విధంగానూ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో గడువు అనంతరం నాగేందర్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై జర్నలిస్టు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎందుకంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అంశంలో నాగేందర్ రెడ్డి గతంలో అనుసరించిన ఆందోళనకర వైఖరే ఇందుకు కారణం. ఈనెల 14న నాగేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనను ఉన్నది ఉన్నట్లుగా దిగువన చదవవచ్చు.
మహబూబాబాద్
గౌరవనీయులైన పెద్దలకు నమస్కారం….
నేను మరో యుద్ధానికి సిద్ధం అవుతున్నాను…ఇరవై అయిదేళ్ళ జర్నలిస్టు అనుభవం… రెవిన్యూ శాఖలోని కొందరు దొంగలకు శిక్ష పడవేయించలేని స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను.
మాది పెరుమాళ్ల సంకీస గ్రామం… డోర్నకల్ మండలం,మహబూబాబాద్ జిల్లా…. 2010-12 మధ్య మా కుటుంబ ప్రమేయం లేకుండా మా ఆధీనంలో ఉన్న భూమిని… ఇతరుల పేరు మీద ఆర్.ఓ.ఆర్ చేసారు. అక్రమ ఆర్.ఓ.ఆర్ చేసి పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారు. మా నాన్న మారెడ్డి అప్పిరెడ్డి చనిపోయిన తరువాత మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేస్తే … రెవిన్యూ రికార్డులలో అవకతవకలు బయటపడ్డాయి. రెవిన్యూ దొంగలు ఎవరని ఆర్.టి.ఐ కింద వివరాలు అడిగితే… అక్రమ పట్టాల బాగోతం…రికార్డులు లేవని సెలవిచ్చారు…
ఏడాదిన్నర పాటు నా భూమి హక్కుల కోసం తహశీల్దారు మొదలుకొని కలెక్టర్ శివలింగయ్య వరకు అందరిని చెప్పులరిగేలా తిరుగుతూ నాకు న్యాయం చేయమని అడుక్కున్నాను… అయినా స్పందించలేదు…దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఆర్డివో కొమరయ్య, జాయింట్ కలెక్టర్ డెవిడ్…. రైతుగా ప్రతీ ఏడాది రెవిన్యూ రికార్డులను తనిఖీలు చేసుకోవాలని ఉచిత సలహ ఇచ్చారు. అధికారుల తీరును నిరసిస్తూ… గత ఏడాది(20-08-2019)నా పొలంలో భూమిలో భుజాల వరకు గొయ్యి తీసుకుని ప్రాణ త్యాగానికి సిద్ధం అయ్యాను.అప్పుడు స్పందించారు ఘనత వహించిన రెవెన్యూ యంత్రాంగం…. అప్పటికప్పుడు అవినీతి అధికారులు చేసిన తప్పును సరిదిద్దారు.
నాకు జరిగిన అన్యాయంపై తహశీల్దారు విజయ్ కుమార్, ఆర్.ఐ లక్ష్మణ్,వి.ఆర్.వో రాంబాబుపై రికార్డు ట్యాంపరింగ్ చేసారని… విచారించి కేసులు నమోదు చేయమని వేడుకున్నాను… అవినీతి అనకొండలుగా ప్రసిద్ధి చెందిన ఆ ముగ్గురిపై కేసులు పెట్టలేమంటూ డోర్నకల్ పోలీసులు చేతులు ఎత్తివేయడంతో… మహబూబాబాద్ కోర్టు మెట్లు ఎక్కాను.కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన డోర్నకల్ పోలీసులు… ఏడాది పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రికార్డులలో ట్యాంపరింగ్ చేసి… రికార్డులను దొంగ తనం చేసిన అవినీతి అనకొండలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే….ఆ అవినీతి అధికారులు… ఆ పై వారిని ఏ విధంగా మేనేజ్ చేసారో అర్ధం అవుతుంది.
గత ఏడాది ఆగష్టు 20 వ తేదీన నేను చేసిన నిరసనను విరమింప చేసేందుకు జాయింట్ కలెక్టర్ డేవిడ్…ఆర్డివో కొమరయ్య స్పష్టమైన హమీ ఇచ్చారు. వారం రోజుల్లో భాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా సమక్షంలో ఫోన్ ద్వారా హమీ ఇచ్చారు. ఇప్పటికీ 390 రోజులు అయింది. ఆ ముగ్గురు అవినీతి అనకొండలు అందినకాడికి దోచుకుంటూ… దర్జాజా ఉద్యోగాలు వెలగపెడుతుంటే… అన్యాయానికి గురి అయిన రైతుగా మనో వేదనకు గురి అవుతున్నాను… దొంగతనం చేసి సాక్ష్యాలు మాయం చేస్తే శిక్షపడదా…. లేక అవినీతి అనకొండలకు అరదండాలు పడకుండా… అండదండలు అందిసగతున్న వారు ఎవరు… సామాన్య రైతుగా పోరాటం చేయలేను…కానీ జర్నలిస్టుగా పోరాటం చేస్తున్నా….వరంగల్ ఎమ్మెల్సీ శీనన్న సైతం హమీ ఇచ్చారు… న్యాయం జరగకపోతే …నేనే ముందు ఉంటా అన్నారు…
ముఖ్యమంత్రి గారు…. రైతు బిడ్డ ఆవేదనను అర్థం చేసుకోండి…. దోషులకు శిక్ష పడకపోతే…మనమూ దోషులుగా నిలపడాల్సి వస్తుంది సర్….తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడకపోతే అవినీతి అనకొండలకు భయం ఉండదు….గతంలో 72 గంటల నిరసనకు దిగాను…సోమవారం (21 వ తేదీ ) వరకు అవినీతి అనకొండలపై చర్యలు తీసుకోకపోతే…. ఆత్మ బలిదానానికి అయినా సిద్ధం… దగా పడిన రైతు ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..
మారెడ్డి నాగేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్టు
ఖమ్మం…
99486 73832
79979 77521
ఫొటో: తనకు తాను భూమిలో పాతుకుని నిరసన వ్యక్తం చేసిన నాగేందర్ రెడ్డి (ఫైల్)