‘అయినా నేను మళ్లీ చెబుతున్నాను. నేను ఏం చేసి సీఈవోను అయ్యానో నీకు తెలుసుకోవాలని ఉంటే గోవిందరావుపేట… వరంగల్ జిల్లా గోవిందరావుపేట వెళ్లి నడి సెంటర్లో నిలబడి వాటీజ్ వెంకటకృష్ణ? అని అడుగు. చెప్తారు నీకు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. వామపక్ష ఉద్యమాల్లో, తీవ్రవాదంలో పాల్గొన్నోన్ని నేను. బాధగా ఉంది చెప్పడానికి.. తీవ్రవాద ఉద్యమంలో పాల్గొన్నవాన్ని. ఇంకా గట్టిగ చెబుతున్న. రెండు, మూడు మేజర్ ఘటనల్లో మిస్సయినవాన్ని. చావు తప్పి… బయట పడినవాన్ని. అలాంటి నన్ను పట్టుకుని..’ అంటూ జర్నలిస్ట్ వెంకటకృష్ణ అలియాస్ పర్వతనేని వెంకటకృష్ణ ఎస్వీబీసీ మాజీ చైర్మెన్ పృథ్వీని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను సీఈవోగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఛానల్ లో వెంకటకృష్ణ ఇంకా అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే…?
ఇక్కడ విషయం వెంకటకృష్ణ, పృథ్వీరాజ్ లకు సంబంధించిన వివాదం కాదు. వెంకటకృష్ణకు, తీవ్రవాద ఉద్యమానికి గల ‘సంబంధం’పైనే జర్నలిస్టు సర్కిళ్లలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. ‘నా వృత్తి జర్నలిజం-ప్రవృత్తి నిజాయితీ’గా ప్రవచించిన వెంకటకృష్ణ తాను తీవ్రవాద ఉద్యమంలో పాల్గొన్నట్లు స్వయంగా ప్రకటించుకోవడం గమనార్హం. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఓ ఛానల్ సీఈవో స్థాయికి ఎదగడం మామూలు విషయమేమీ కాకపోవచ్చు. వెంకటకృష్ణ మాటల్లోనే చెప్పాలంటే ‘ఏదో చేస్తే సీఈవోలు అయిపోరు. వాటికి దమ్మూ, ధైర్యం, సబ్జెక్టు, జర్నలిజం పట్ల వాడికున్న మమకారం, ప్రొఫెషనలిజం…ఇవన్నీ ఉంటే అవుతారు. ఏదిబడితే అది చేస్తే అవ్వరు.’ ఈ విలువైన మాటలు కూడా వెంకటకృష్ణే వెల్లడించారు. ముందే చెప్పుకున్నాం కదా? విషయం వెంకటకృష్ణ, పృథ్వీరాజ్ లకు సంబంధించిన వివాదం కాదని.
సరే.. వెంకటకృష్ణ ‘ఈనాడు’ దినపత్రికలో సాధారణ కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ఓ ఛానల్ సీఈవో స్థాయికి ఎదగడం ఆయన స్వయంకృషే కావచ్చు. కానీ తాను తీవ్రవాద ఉద్యమం నుంచి వచ్చానని, రెండు, మూడుసార్లు మేజర్ ఘటనల్లో మిస్సయి, చావు నుంచి తప్పించుకున్నవాడినని ఆయనే ప్రకటించారు కదా? ఇంతకీ వెంకటకృష్ణ ఏ తీవ్రవాద గ్రూపులో పనిచేశారు. ఆ సంస్థ పేరేమిటి? సాయుధ దళాల్లో పనిచేశారా? అలీవ్ గ్రీన్ డ్రెస్ ధరించి, కిట్ బ్యాగ్ భుజాన వేసుకుని, ఏకే-47 లేదా ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) వంటి ఏదేని తుపాకీ చేతబట్టి అడవుల్లో తిరిగారా? లేక తీవ్రవాద గ్రూపు తరపున లీగల్ కార్యకలాపాలు చేశారా? లీగల్ కార్యకలాపాలు మాత్రమే చేస్తే చావు తప్పి ఎలా బయట పడగలిగారు? అసలు తీవ్రవాద ఉద్యమానికి, వామపక్ష తీవ్రవాద ఉద్యమానికి, తీవ్రవాదానికి గల తేడా ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే చాలా పెద్ద చర్చ అవుతుందిగాని సింపుల్ గా తేల్చాద్దాం. ఓ సిద్ధాంతం, జెండా, ఎజాండా ఉంటే దాన్ని తీవ్రవాదం అంటారు. ఇవేవీ లేకుండా చేసే అరాచక చర్యలను తీవ్రవాదం అంటారు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఉన్మాద తీవ్రవాదం అని కూడా నిర్వచించవచ్చు.
ఇంతకీ వెంకటకృష్ణ సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న తీవ్రవాద ఉద్యమ నేపథ్యపు సంస్థ పేరేమిటి? ఆయన అందులో ఏ హోదాలో పనిచేశారు. ఆ పార్టీలో ఆయనకు గల హోదా ఏమిటి? ఇవీ అసలు ప్రశ్నలు. జర్నలిస్టుగా అనేక మందిని ప్రశ్నించే వెంకటకృష్ణ స్వయం ప్రకటిత తీవ్రవాద ఉద్యమ నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఆయన సామాన్య జర్నలిస్టు కాదు. సీఈవో స్థాయికి ఎదిగిన యాంకర్-కమ్-జర్నలిస్టు. అటువంటి పెద్ద స్థాయికి ఎదిగిన వెంకటకృష్ణ గురించి తెలుసుకోవాలనే తపన జర్నలిస్టులకే కాదు, సామాన్యుడికీ ఉంటుంది. ఇది అతని వ్యక్తిత్వాన్ని పెంచే పరిశీలనాంశపు ప్రక్రియ మాత్రమే. వెంకటకృష్ణ తీవ్రవాద ఉద్యమ నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే కాస్త చరిత్ర పుటల్లోకి వెళ్లాలి. ఎందుకంటే అది చరిత్ర. చెరిపితే చెరిగేది కాదు. చరిత్ర వక్రీకరణ కుదరదు. వక్రీకరిస్తే అది చరిత్ర కాదు.. కల్పితం అవుతుంది కాబట్టి. ఈ తరం జర్నలిస్టులకు వెంకటకృష్ణ తీవ్రవాద ఉద్యమ నేపథ్యం తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కొత్తగా జర్నలిజంలోకి వచ్చేవారు ఓ ఛానల్ సీఈవో స్థాయికి ఎదిగిన వెంకటకృష్ణ లాంటి జర్నలిస్టును ప్రేరణగా తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేం. అనివార్యంగా చరిత్ర పుటలను తిరగేయక తప్పదు. ఈ పుటల్లో విప్లవోద్యమ చరిత్ర చాలా ఉందిగాని, వీలైనంత క్లుప్తంగానే చర్చిద్దాం.
1980-90వ దశకంలో ప్రస్తుత ములుగు జిల్లాను కేంద్రంగా చేసుకుని నక్సల్ కార్యకలాపాలు తీవ్రంగా ఉండేవి. ఓ వైపు ప్రస్తుత మావోయిస్టు, అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లతోపాటు చండ్ర పుల్లారెడ్డి గ్రూపునకు చెందిన ఫణిబాగ్చి, రామచంద్రన్ వర్గాలకు చెందిన విప్లవ సంస్థలు ఉండేవి. చండ్ర పుల్లారెడ్డి తీవ్రవాద సంస్థ రెండు వర్గాలుగా చీలిన పరిణామాల ఫలితమే ఫణిబాగ్చి, రామచంద్రన్ తీవ్రవాద గ్రూపుల ఆవిర్భావం. పుల్లారెడ్డి సతీమణి రాధక్క, మధుసూదన్ రాజ్ యాదవ్, సామా అంతిరెడ్డి తదితరులు ఫణిబాగ్చి గ్రూపుగా, మరికొందరు నేతలు రామచంద్రన్ గ్రూపుగా విడిపోయారు. ములుగు నియోజకవర్గంపై తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ఫణిబాగ్చి, రామచంద్రన్ గ్రూపు సంస్థలు నిత్యం వర్గపోరాటానికి దిగుతుండేవి. ఈ రెండు గ్రూపుల సాయుధ ఘర్షణల్లో అనేక మంది విప్లవకారులే కాదు, సామాన్య ప్రజలు కూడా అసువులు కోల్పోయిన ఘటనలు అనేకం.
ఈ నేపథ్యంలోనే ములుగు నియోజకవర్గంలోని ప్రజానీకం రెండు నక్సల్ గ్రూపుల మధ్య దశాబ్ధాలపాటు నలిగిపోయిదని చెప్పక తప్పదు. నిత్యం తుపాకీ మోతలు, ములుగు, ఏటూరునాగారం అడవుల్లో నక్సల్ గ్రూపుల మధ్య పరస్పర కాల్పులు ఘటనలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ములుగు నియోకవర్గంలోని సెటిలర్లు, ముఖ్యంగా ఓ సామాజికవర్గం రామచంద్రన్ గ్రూపునకు, నాన్ సెటిలర్లు అంటే స్థానికులు ఫణిబాగ్చి గ్రూపునకు మద్ధతుగా నిలిచారు. దీంతో ఆయా నక్సల్ గ్రూపుల ప్రాబల్యం గల ప్రాంతాల్లో ప్రజలు కూడా రెండు వర్గాలుగా చీలిన అనివార్య స్థితి. రామచంద్రన్ గ్రూపును ఫణిబాగ్చి వర్గం ‘లైసెన్స్’ ముఠాగా వ్యవహరించేది. లైసెన్సు ముఠా అంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు, వారి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు అప్పటి పంజాబ్ ప్రభుత్వం కొందరికి ఇచ్చిన లైసెన్సు తుపాకుల నేపథ్యం వేరే ఉంది. ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సు తుపాకులను విప్లవకారులుగా చెప్పుకుంటున్నవారు వాడుకుంటున్నారనే ఆరోపణలతో రామచంద్రన్ గ్రూపును ఫణిబాగ్చి వర్గం లైసెన్స్ ముఠాగా అభివర్ణించేది. అది చాలా పెద్ద సబ్జెక్టు. దీన్ని కూడా ఇక్కడితో వదిలేద్దాం.
ఇటువంటి పరిస్థితుల్లో అప్పట్లో ములుగు నియోజకవర్గ కేంద్రంలోనేకాదు దాని పరిధిలోని గణపురం, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో దిన పత్రికలకు విలేకరులుగా పని చేయాలంటేనే వణుకు.. ప్రాణభయం. ఫణిబాగ్చి, రామచంద్రన్ గ్రూపుల మధ్య జరిగిన వర్గపోరాటపు హింసాత్మక ఘటనలను ‘బ్యాలెన్స్’గా కవర్ చేయడం విలేకరులకు కత్తిమీద సాము చేసినట్లుగానే ఉండేది. ‘ఈనాడు’ దినపత్రిలో ఏటూరునాగారం తాలూకా కేంద్రానికి నేను తొలి కంట్రిబ్యూటర్ గా పనిచేశాను కాబట్టి, ఈ విషయంలో నాకు పూర్తి అవగాహన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే గోవిందరావుపేట కేంద్రంగా పనిచేసిన కొందరు విలేకరులను మాత్రమే ఫణిబాగ్చి గ్రూపు ‘పోలీస్ ఇన్ఫార్లు’ గా ఆరోపణలు చేసింది. వీరిలో ఓ జర్నలిస్టును కిడ్నాప్ చేసి కాల్చి చంపగా, ఆరోపణలు ఎదుర్కున్న మరికొందరు విలేకరులు గోవిందరావుపేట నుంచి ‘మకాం’ మార్చి వరంగల్ నగరంలో తల దాచుకోవలసిన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
(to be continued)