ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఏదో కొంపలు అంటుకుపోయినట్లు జర్నలిస్టు సోదరులు ఏ విధంగా ఎగబడి మొబైల్ ఫోన్లలో వీడియో తీస్తున్నారో? దాదాపు 10 మంది విలేకరులు కనీస దూరం పాటించకుండానే తమ డ్యూటీని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఓ వివాదాస్పద ఘటన సందర్భంగా చోటు చేసుకున్న దృశ్యమిది. ఆయా ఉదంతాన్ని ఇక్కడ అప్రస్తుతంగా వదిలేద్దాం. సాధారణ పరిస్థితుల్లోనైతే ఇది పోటీ ప్రపంచం… తప్పదు… అనివార్యం… అంటూ సమర్థించుకోవచ్చు. కానీ ఇది కరోనా కబలిస్తున్న కాలం. సామాజిక దూరం పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న భయానక తీవ్రత.
కరోనా కల్లోలంలోనూ జర్నలిస్టుల ‘పోటీ’ డ్యూటీ బాపతు ప్రవర్తనలో మార్పు రాకపోవడమే తాజా దారుణం. ఒకరు కాదు ఇద్దరు కాదు. ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. చెన్నయ్ లో ఒకే టీవీకి చెందిన 27 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు తెలంగాణాలోనూ జర్నలిస్టులను కరోనా చుట్టుముట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో పలువురు జర్నలిస్టులను ఐసొలేషన్ వార్డుకు తరలించినట్లు వార్తల సారాంశం.
ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో జర్నలిస్టులు ఏం చేయాలన్నదే అసలు ప్రశ్న. వాస్తవానికి అనేక సందర్భాల్లో జర్నలిస్టులు అవసరానికి మించి అతిగా ప్రవర్తిస్తున్నారని చెప్పక తప్పదు. రాజకీయ నేతల మెప్పు కోసం, ‘అటెండెన్స్’ ప్రమాణికంగా వారికి ముఖం చూపించే యోచనతోనే కొందరు జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు ఓ మంత్రి లేదా కలెక్టర్ ప్రెస్ మీట్ అనుకుందాం. మామూలు పరిస్థితుల్లో అయితే కుప్పలు తెప్పలుగా విలేకరులు వెళ్లినా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
ప్రస్తుత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటువంటి ప్రెస్ మీట్లకు పరిమిత సంఖ్యలో విలేకరులు హాజరైతే సరిపోతుంది. ఆ తర్వాత సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. లేదంటే మంత్రి, కలెక్టర్ ఏం చెప్పారో మీడియాకు అందించాల్సిన బాధ్యత సమాచార శాఖది. ఈ విభాగపు అధికార వర్గాలపై ఆధారపడి కూడా ప్రస్తుతం విధులు నిర్వహించవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని పత్రికల్లో, టీవీల్లో కరోనా వార్తలే తప్ప, మరే ఇతర ఎక్స్ క్లూజివ్ వార్తలను అందించే అవకాశాలే లేవు. మంత్రి లేదా ఇతర ఉన్నతాధికారులు ప్రెస్ మీట్లలో నోరు జారి మాట్లాడినా దాన్ని ప్రజలకు అందించే ధైర్య సాహసాలు ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఎలాగూ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారిక ప్రెస్ మీట్లకు కుప్పలు తెప్పలుగా విలేకరులు హాజరు కావలసిన అవసరమే లేదు.
అదేవిధంగా ముఖానికి మాస్కులు తగిలించుకుని ‘మీడియా’పేరుతో వీధుల్లో ఊరేగినంత మాత్రాన వచ్చే అవార్డులు, రివార్డులు కూడా ఏమీ లేవు. ఇంట్లో ఉండలేక వీధుల్లో ఊరేగాలనే యోచన ఉంటే చేసేది కూడా ఏమీ లేదు. సోషల్ మీడియాలో బోలెడంత సమాచారం, ఫొటోలు కూడా వస్తూనే ఉన్నాయి. ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో విషయాన్ని ధృవీకరించుకుని కూడా వార్తలు అందించే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే ‘ఉరికురికి పసుల గాసినంత మాత్రన పొద్దు గూకదు’ అనే సామెతను జర్నలిస్టులు గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇది కరోనా కాలం. అది నిన్ను కాటేస్తే, నువ్వు కరుసై పోతే కనికరించేవాడు కూడా లేడన్నది వాస్తవికి చిత్రం. ఆ తర్వాాత నీ కుటుంబ పరిస్థితి దైవాధీనమ్… అదీ విషయం. ఆ తర్వాత నీ ఇష్టం జర్నలిస్టు సోదరా…!