కరోనా దెబ్బకు పత్రికలు బక్క చిక్కి పోయాయి. సమస్త రంగాలు మూతపడటంతో అనివార్యంగా పత్రికలూ ఆర్థికంగా కుదేలై పోయాయి. అయితే లాక్డౌన్ వేళ అత్యవసర సర్వీసుల వలెనే, సమాజానికి నిరంతరం సమాచారం అందించే మీడియాకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ‘పని చేసుకోవచ్చు..’ అంటూ ఉదారంగా అనుమతి ఇచ్చింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియానే వారధి కనుక ఇవ్వక తప్పదు కూడా.
కరోనా ఆపత్కాలంలో పోలీసులు, వైద్యులు, ఇతర అధికార యంత్రాంగం ఎలాగైతే విధుల్లో, వీధుల్లో ఉంటున్నారో.. పాత్రికేయులు కూడా విధులను నిర్వర్తిస్తున్నారు. ఫీల్డుల్లో, డెస్క్‌ల్లో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. పాత్రికేయులు ఏ సంస్థకు చెందిన వారైనా సరే, ఆ సంస్థ వెలువరించే పత్రిక ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండాలంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి రెగ్యులర్‌గా రెవెన్యూ రావాలి. కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు సహకరించకపోయినా పత్రికలు ప్రైవేటు రంగం నుంచి రెవెన్యూను ప్రోది చేసుకొని మనుగడ సాధిస్తాయి. పత్రిక ఒక్కో కాపీ ప్రచురణకు అయ్యే వ్యయం కన్నా, ఆ కాపీ విక్రయ ధర తక్కువ ఉండటం పత్రికారంగ నిర్వహణలో ఒక వైరుధ్యంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఏ వస్తువును తీసుకున్నా.. ఇలా నష్టానికి అమ్మడం కనిపించదు. ఇందుకు రక రకాల కారణాలు, చరిత్ర ఉన్నాయి. అది వేరే కథ.
కరోనా కాలంలో ప్రైవేటు రంగాలన్నీ లాక్‌డౌన్‌కు గురికావడంతో పత్రికలు రెవెన్యూ లేక ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.. ఉక్కపోతకు గురవుతున్నాయి. లక్షల కోట్ల ఆదాయం ఉన్న ప్రభుత్వమే తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన గడ్డు రోజులివి. ప్రైవేటు రంగంలోని పత్రికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని భావించడం సముచితం కాదు. సర్దుబాటు, దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. ఇవి తాత్కాలికమే కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే జరుగుతుందన్న నమ్మకం, భరోసా కూడా ఉంది. ప్రైవేటు రంగంలోని ఏ సంస్థలకైనా ఇది అనివార్యమైన పరిస్థితి.
ఈ ఆపత్కాలంలో పత్రికల పట్ల, పాత్రికేయుల పట్ల ప్రభుత్వం ఏ బాధ్యతతో వ్యవహరిస్తోందన్నది.. ఒక ప్రశ్న. పాత్రికేయ వృత్తి అత్యంత భిన్నమైనది. అభిరుచి, ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చే వారే ఎక్కువ. ఉద్యోగ భద్రత, స్థిరమైన జీ(వి)తం గురించి ముందు చూపుతో ఆలోచించే వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. వృత్తిపైన ఇష్టం… వ్యామోహంగా, వ్యసనంగా మారిన వాళ్లు మాత్రమే పాత్రికేయులుగా మిగిలిపోతారు.
వాస్తవానికి ఈ వృత్తిలోకి వచ్చే వాళ్లు రెండురకాలుగా ఉంటారు. మొదటి రకం– ఫుల్‌టైమర్లు, రెండో రకం– పార్ట్ టైమర్లు. ఫుల్‌టైమర్లకు జీతభత్యాలుంటాయి. పార్ట్‌టైమర్లకు పారితోషికం ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకునే వారికి ఈ విషయాలు ముందే తెలుసు. కానీ ఒకసారి ఈ వృత్తిలోకి ఎంటరైన తర్వాత… ‘ఫుల్ – పార్ట్’ అనే విభజనకు హద్దులు చెరిగిపోతాయి. ఒకరకమైన మోహంతో, వ్యామోహంతో జర్నలిస్టులు తమ జీవితాలను జర్నలిజం వృత్తితో మమేకం చేసుకుంటారు. ఈ లోకాన్ని ఉద్దరించడం, అందరినీ వెలుగులోకి తీసుకురావడమే తమ ‘పని’ అనుకుంటూ ప్రవాహంలో కొట్టుకు పోతుంటారు. వీరికి తమ ఇంటి సమస్యలకన్నా, సమాజం సమస్యలపైనే ఎక్కువ అవగాహన కనిపిస్తుంది.
‘అసలే రాని/లేని జీతాలతో, అరకొర జీతాలతో వీళ్లు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారు…?’ అనే ప్రశ్న కొందరిని ఎప్పుడూ తొలుస్తూ ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో అనేక రకాల ‘సానుకూల అంశాల’ను ఆధారం చేసుకొని పాత్రికేయులు తమ జీవనపయనం సాగిస్తుంటారు. ఓ జర్నలిస్టు మిత్రుడు చెప్పినట్టు బయటి సమాజంలోని వివిధ వర్గాల నుంచి లభించే ‘వెసులుబాటు’ కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఈ సానుకూల అంశాలు, వెసులుబాటుకు సంబంధించి భిన్నాభిప్రాయాలే కాదు, తరుచూ విమర్శలూ వ్యక్తమవుతుంటాయి. ఇందుకు పత్రికా నిర్వహణ సంస్థల కంటే, బయటి సమాజం తీరే ఎక్కువ కారణంగా కనిపిస్తుంది. దీని లోతుపాతుల్లో వెళ్లితే అనేక అంశాలు చర్చకు వస్తాయి. అందుకు ఇది సమయం కాదు. కరోనా లాక్డౌన్ కారణంగా సానుకూల అంశాలు, వెసులుబాట్లు అన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. సింహభాగం పాత్రికేయుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారాయి. ఇది దీర్ఘకాలమా.. స్వల్పకాలమా.. అన్నది భవిష్యత్తు చెప్పాలి.
ఇన్ని ఒడిదొడుకులు, ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే పాత్రికేయుల పట్ల ఈ కరోనా ఆపత్కాలంలో ప్రభుత్వం కొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పోలీసులు, వైద్యులు, ఇతర సిబ్బంది వలెనే ప్రాణాలు ఫణంగా పెట్టి పాత్రికేయులు కరోనా సమాచారాన్ని భిన్న కోణాల్లో అందిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ అవగాహన, చైతన్యం కల్పిస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో తమదైన కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే తన కార్యాచరణ, నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాలు కూడా పత్రికలు, టీవీ చానెళ్లపైనే ఆధారపడుతున్నాయి. విధి నిర్వహణలో మహారాష్ట్ర, తమిళనాడులో కొందరు పాత్రికేయులు కరోనా పాజిటివ్ బారిన పడటం పాత్రికేయ వృత్తి కత్తిమీద సాము అనడానికి నిదర్శనం.
ముందే చెప్పినట్టు పాత్రికేయ వృత్తి అత్యంత భిన్నమైనది. ఈ వృత్తి వ్యసనంగా మారిన వారు మరో వృత్తిలోకి మారడం అసాధ్యం. ఇట్లాంటి ‘అక్షర వ్యసనపరులు’ ఇప్పుడు రాష్ట్రంలో వేలాదిమంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి పోలీసులు, వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ను ప్రకటించింది. సకల సౌకర్యాలు కల్పిస్తోంది. కానీ అదే తరహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్న పాత్రికేయులకు ఆర్థికంగా అండగా నిలిచే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? పత్రికల పాలసీల పట్ల పాలకులకు అనేక పేచీలు ఉండొచ్చు. కానీ పాలసీలతో నిమిత్తం లేకుండా, సమాజ హితం కోసం సమాచార సేకరణ యజ్ఞం జరిపే, ప్రభుత్వ కార్యాచరణను ప్రజల్లో తీసుకువెళ్లే పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలకు పేచీలు ఉండొద్దు. వారి వెతలను, వ్యథలను సానుకూల కోణంలో చూడాలి. అట్లా చూడగలిగినప్పుడు చోటామోటా నాయకుల వద్ద నిత్యావసరాల కోసం క్యూ కట్టే దుర్గతి పాత్రికేయులకు రాదు.
– శంకర్ శెంకేసి