సమాజానికి జర్నలిస్టులే కళ్లు, చెవులూ. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను ప్రజలకు, ప్రజల సమస్యలు వారి ఆకాంక్షలు పత్రికలద్వారా ప్రభుత్వానికి తెలియచేసేది జర్నలిస్టులే. ప్రపంచ పరిణామాలను తెల్లవారేసరికి సవివరంగా ప్రజల కళ్లముందుంచేది జర్నలిస్టులు, సంపాదకులు, సంపాదకీయాలు, సంపాదక పేజీలో ప్రచురింపబడే వ్యాసాలు నిత్యం జరుగుతున్న సంఘటనల నేపధ్యం, విశ్లేషణ, ప్రజల, పాఠకుల ప్రపంచ జ్ఞానాన్ని పెంపొందించేది జర్నలిస్టులే.
ఇదొక పవిత్రమైన బాధ్యత. స్వతంత్ర పోరాటానికి ప్రజలను సమాయత్తం చేయటంలో పత్రికలు, జర్నలిస్టులు కీలకపాత్ర వహించారు. వారు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తెలుగులో దినపత్రికలకు శ్రీకారంచుట్టింది. ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు పంతులు. సాంఘిక దురాచారాలను దునుమాడుతూ, వితంతు వివాహాలను తన పత్రిక ద్వారా ప్రోత్సహించిన కందుకూరి వీరేశలింగం పంతులు, లైబ్రరీల స్థాపనే ఒక ఉద్యమంగా నడిపించిన గాడిచర్ల హరిసర్వో త్తమరావులాంటి ఉద్దండులకు నేటి జర్నలిస్టులు వారసులు.
మిగతా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు, ఈ రాష్ట్రంలోనివారికి ప్రధానమైన తేడా ఏమంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టులు గ్రామీణ జర్నలిస్టులు. జిల్లా సప్లిమెంట్లు ప్రచురించటం ప్రారంభించిన తర్వాత వారి సంఖ్య వేలకు పెరిగింది. వీరిలో చాలామంది వేర్వేరు వ్యాపకాలున్నవారున్నారు. జర్నలిజం ఒక సైడ్ బిజినెస్లాంటిది. వీరిలో కొంతమందికి ఇదే వృత్తి, ప్రవృత్తి. మన రాష్ట్రంలో జర్నలిస్టు ఉద్యమం మొదటి నుండి గ్రామీణ జర్నలిస్టుల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చింది. ప్రెస్ కమిషన్లకు ఇచ్చిన నివేదికల్లో వారిని పూర్తికాలం జర్నలిస్టులుగా గుర్తించాలని, పూర్తి వేతనాలివ్వాలని, కమిషన్ సిఫార్సులను వారికి కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూవచ్చింది. అనేక కారణాలవల్ల ఈ డిమాండ్ మరుగున పడిపోయి, ఇళ్లస్థలాలు, బస్పాసులు, గుర్తింపు కార్డులకే పరిమితమైపోయింది.
జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు, జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు… పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి, విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడు… అతనిది బ్రతుకు పోరాటం… ఇతనిది మంచిని బతికించాలనే ఆరాటం… జర్నలిజం బతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది… ఉరుకుల పరుగుల జీవితంలో, తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలనే తపనతో, కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు.
అలా రోజూ కామన్ మ్యాన్ లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్టు. ఆ గడియారం ముల్లు ఒకటి నుండి పన్నెండుదాకా తిరిగితే.., జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతూ, 24 గంటలు అదే ధ్యాసలో బతికేస్తాడు. పేరుకు అతనికి 8 గంటలే డ్యూటీ అయినా, నిద్రపోనంత వరకు, బుర్ర మాత్రం సమాజం చుట్టే తిరుగుతూ ఉంటుంది. తాను పడే వేదనలో, తన మెదడులో మెదిలో ఆలోచనల్లో బాస్ దగ్గర శభాష్ అనిపించుకోవాలంటే ఎలాంటి స్టోరీలు రాయాలి, కళ్ల ముందు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించేలా వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి? ఇందులో ఏ స్టోరీ పేలిపోతుంది? కంటికి కనిపించిన స్టోరీని ఏ యాంగిల్లో ప్రజంటేషన్ చేయాలి? అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తుంటాడు.
ఇలా ఆలోచించి ఆలోచించి అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు.. తనకు తెలియకుండానే బాడీ మొత్తం స్లో పాయిజన్ ఎక్కించేసుకుంటాడు. ఇలా అందరి గుండెచప్పుళ్లు వినే ఎందరో జర్నలిస్టులు.. తమ గుండెను మాత్రం కాపాడుకోలేక పోతున్నారు. ఇకపోతే నేటి సమాజంలో జర్నలిజం అంటే దోపిడిలా మారింది. జర్నలిజం పేరు చెప్పుకుని జేబులు నింపుకుంటున్న చోరులను చూసి అక్షరాలు సిగ్గుపడుతున్నాయి. అక్షరాలను ఆయుధాలుగా మార్చే చేతులు అవినీతిపనులకు అడ్డాగా మారుతుంటే కలం కూడా కన్నీరు కారుస్తుంది.
సోదరుల్లారా… జర్నలిజం అంటే బ్రోకరిజం కాదు.. తూటా లేని తుపాకి లాంటిది. రక్తం చూడని కత్తి లాంటిది. నేలను చదును చేసే నాగలి వంటిది. కాబట్టి అక్షర యజ్ఞం చేయండి… నిజాయితీగా జీవించండని ప్రతి అక్షరం అనుక్షణం జర్నలిస్టులను వేడుకుంటుంది. కానీ ఈ వేదన నిజమైన జర్నలిస్టుకు మాత్రమే అర్ధం అవుతుంది. నువ్వు అనుకుంటావు అక్షరాలకు ఊపిరి పోస్తున్నా అని, కాని నీకో గుర్తింపును ఆ అక్షరాలే సంపాదిస్తున్నాయనే విషయాన్ని విస్మరించకు మిత్రమా
ఎందుకంటే అమ్మకంటే అత్యుత్తమమైనది అక్షరం. ఆ అమ్మను పిలవాలంటే అక్షరమే తోడవ్వాలి మరి… ఇదే నిజమైన జర్నలిజం.!!
✍️ ఎన్ . జాన్సన్ జాకబ్, మచిలీపట్నం.