రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. రాజ్ పాకాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది అనే సంగతి తెలిసిందే. జన్వాడ ఫాం హౌజ్ లో పార్టీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫాం హౌజ్ పై సైబరాబాద్ ఎస్వోటీ పోటీసులు గత రాత్రి దాడి చేశారు. డ్రగ్స్, రేవ్ పార్టీ వంటి వ్యవహారాలు ఇక్కడ చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఫాం హౌజ్ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు సహా మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. విదేశీ మద్యం, కాసినోవా పరికరాలు, ప్లే కార్డ్స్, కాయిన్స్ తదితర వస్తువులు దాడుల్లో వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఎన్డీపీసీ,ఎక్సయిజ్ యాక్టు కింద రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
సంచలనం కలిగించిన జన్వాడ ఫాం హౌజ్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించిన పార్టీ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా సూపర్ వైజర్ కార్తీక్ ను, ఏ2గా ఫాం హౌజ్ యజమాని, కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలను చేర్చినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత ప్రకటించారు. అయితే రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు రాజ్ పాకాల ఉంటున్న రాయదుర్గం ఓరియన్ విల్లా నెం. 40కి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాలను తాము అదుపులోకి తీసుకోలేదని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ప్రకటించారు.