అంతరించిపోయిందని పోలీసులు అంచనా వేసిన జనశక్తి నక్సల్స్ తిరిగి యాక్టివ్ అయ్యారా? జనశక్తి పార్టీ మళ్లీ సిరిసిల్లలో ప్రాణం పోసుకుందా? జనశక్తి నక్సలైట్లుగా పేర్కొంటున్న ఆరుగురిని సిరిసిల్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన ఘటన ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. అరెస్ట్ చేసిన నక్సల్స్ నుంచి రెండు దేశవాళీ రివాల్వర్లు, అయిదు రౌండ్లు, పార్టీ సాహిత్యం తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం…
జనశక్తి పార్టీ రాజన్న వర్గం నుంచి విడిపోయి రామచంద్రన్ గ్రూపుగా ఏర్పడిన నక్సల్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర తెలంగాణా కార్యదర్శిగా పేర్కొంటున్న ఆర్మూరుకు చెందిన సుద్దపల్లి సుధాకర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలకు ఆయుధాలను సమకూర్చి నిధుల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే వ్యాపారుల, భూస్వాముల, రాజకీయ నేతల నుంచి చందాల పేరుతో భారీ ఎత్తున డబ్బు వసూలు చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
పెద్దలింగాపూర్ కు చెందిన కొందరిని రూ. 5 లక్షలు చందాగా ఇవ్వాలని తుపాకులతో జనశక్తి నక్సల్స్ బెదిరించినట్లు పోలీసులు ప్రకటించారు. మండేపల్లి గ్రామ శివార్లలోని గుట్ట వద్ద నక్సల్స్ సమావేశం కాగా అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల పోలీసులు ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 1990వ దశకంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జనశక్తి పార్టీ తిరిగి జీవం పోసుకోవడంపై సహజంగానే రాజకీయ కలకలాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఒకప్పుడు జనశక్తి పార్టీకి చెందిన ఎన్వీ కృష్ణయ్య ఎమ్మెల్యేగా గెలుపొందడం ఈ సందర్భంగా గమనార్హం.