‘తమలపాకుతో నువ్వొకటంటే…తలుపు చెక్కతో నే రెండంటా..’ అన్నాడట వెనకటికెవరో. ఇదిగో ఈ సామెతను ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నేతల మాటలకు సరిగ్గా అన్వయించవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో ఇసుక సంక్షోభం, ప్రభుత్వం ప్రకటించిన ఇంగ్లీష్ మీడియం వ్యవహారాల గురించి రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మరి. రాజకీయ నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మరీ జాగ్రత్తగా మాట్లాడాలని అంటుంటారు.
‘‘ఉప ఎన్నికల్లో కుయుక్తులు పన్నుతున్న చంద్రబాబును కాల్చినా ఫరవాలేదనిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రి కాదు…ముఖ్యకంత్రీ’’ అని కర్నూలు జిల్లాలో జరిగిన ఓ సభలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విపక్ష నేత వైఎస్ జగన్ 2017 ఆగస్టులో చేసిన వ్యాఖ్యలివి. గుర్తుంది కదా? అప్పుడంటే జగన్ ప్రతిపక్ష నాయకుడు. మరి ఇప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ కుర్చీలో కూర్చున్న నాయకుడు హుందాగా మాట్లాడకపోతే పరిస్థితులు భిన్నరకాలుగా ఉంటాయని జగన్ తాజా వ్యాఖ్యల వివాదం సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘‘అయ్యా చంద్రబాబు గారూ.. మీ కొడుకు ఏ మీడియంలో చదివారు? రేపు మీ మనవడు ఏ మీడియంలో చదవబోతున్నాడు? అయ్యా వెంకయ్యనాయుడు గారు.. మీ కొడుకు, మనవళ్లు ఏ మీడియంలో చదివారు? అయ్యా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారూ.. మీకు ముగ్గురు భార్యలు, నలుగురో అయిదుగురో పిల్లలు.. మరి వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు?’’ అని జగన్ ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు జవాబుగా తాజాగా స్పందించారు. ఉప రాష్ట్రపతికి, మాజీ ముఖ్యమంత్రికి, జనసేన పార్టీ అధినేతకు ఒకే సమయంలో, ఒకే సందర్భంగా సీఎం జగన్ సంధించిన ఈ ప్రశ్నలే ప్రస్తుతం తీవ్ర స్థాయిలో రాజకీయ వ్యాఖ్యల దుమారానికి కారణమైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్భంగా విజయవాడలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాటల యుద్ధం తీవ్రతరమైంది.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెప్పాలని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సలహా, సూచన పూర్వకంగా మాట్లాడుతుంటారని, ఇష్టముంటే స్వీకరించాలి…లేదంటే వదిలేయాలి…అంతేగాని వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్పందించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని పేర్లు పెట్టి పిలిస్తే తామూ పెద్దోళ్లమవుతామనుకుంటే అది భ్రమే అవుతుందని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెప్పాలని కూడా కన్నా డిమాండ్ చేశారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. విజయవాడలో మీడియాతో పవన్ మాట్లాడుతూ, తన పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. తాను ప్రజల కష్టాల గురించి ప్రశ్నిస్తే, వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతున్నారని అన్నారు. జనసేన అంటే భయపడి తన వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ‘ప్రతీసారి నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటున్నారు. నేను పెళ్లిళ్లు చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? నా వ్యక్తిగత కారణాల వల్ల చేసుకున్నాను. వాటి వల్లే మీరు జైలుకు వెళ్లారా?’ అని జగన్ ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. పార్టీ నాయకుడిలా కాకుండా, ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని పవన్ హితవు చెప్పారు. సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ల మధ్య చోటు చేసుకున్న ఈ తాజా మాటల యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.