దిశ ఎన్కౌంటర్ కేసు, సమత హత్యాచారం ఉదంతం వంటి అనేక నేరాలతో తీవ్ర ఒత్తిడిలోగల తెలంగాణా పోలీసులకు ఈ గాడిద పంచాయతీ మాత్రం తలకు మించిన కేసే. గాడిద కొడుకు, అడ్డ గాడిద అని కొందరిని తిడుతుంటాం కదా? పనీ, పాటా లేకుండా తిని, తిరిగే వారిని గాడిదలుగా అభివర్ణిస్తుంటారు. కానీ గాడిదలకూ విలువ ఉంటుంది. అవి ఇచ్చే పాలకూ విలువ ఉంటుంది. గాడిదలిచ్చే పాల మీదే ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. గాడిద పాలకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత విలువ కూడా. చిన్నపిల్లలకు గాడిద పాలు పట్టిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే అభిప్రాయం కూడా ఉంది.
అటువంటి గాడిద కనిపించడం లేదంటూ బాణాల ప్రభు అనే వ్యక్తి వికారాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక రాజీవ్ గృహకల్పలో జీవించే ప్రభుకు చెందిన నాలుగు గాడిదలు చోరీకి గురయ్యాయి. తన గాడిదలను ఎవరో దొంగిలించారని, కాస్త వెతికి పెట్టాలని ప్రభు వికారాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. కానీ గాడిదను వెతికేంత తీరిక వికారాబాద్ పోలీసులకు లేదు. ఎన్నో కేసులు, మరెన్నో నేరాలు. ఇటువంటి పని ఒత్తిడిలో ఈ గాడిద దొంగతనం ఏమిట్రా బాబోయ్ అనుకుంటూ దరఖాస్తు చేసిన ప్రభును పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ‘మాకు చాలా పని ఒత్తిడి ఉందిగాని, ఆ గాడిద ఎక్కడుందో కాస్త నువ్వే కనుక్కో, దాన్ని నీకు అప్పగించే బాధ్యత మాదే’ అని పోలీసులు భరోసా ఇచ్చారు.
దీంతో ప్రభు తన గాడిదల కోసం ఊరూ, వాడా తిరిగి వెతికాడు. చివరికి హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో సత్తయ్య అనే వ్యక్తి వద్ద తన గాడిద ఉందని ప్రభు పోలీసులకు ఉప్పందించాడు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి గాడిదను ఆటోలో వేసుకుని స్టేషన్ కు తీసుకువచ్చారు. కానీ ఈ గాడిద విషయంలో సత్తయ్య, ప్రభు పెద్ద పంచాయతీకే దిగారు. గాడిద తమదంటే తమదని ఠాణాలోనే పరస్పర వాగ్వాదానికి దిగారు. స్టేషన్ కు తీసుకువచ్చిన గాడిదను తాను మరో వ్యక్తి దగ్గర కొని, తన కూతురు పూజకు ఇచ్చానని, భర్త లేని తన కూతురు గాడిద పాలు విక్రయించుకుంటూ ఇద్దరు ఆడపిల్లలను పోషిస్తోందని సత్తయ్య వాపోతున్నాడు. సంచార జీవితం గడిపే సత్తయ్య కుటుంబం కర్నాటకలోని దెగ్లూర్ ప్రాంతంలో ఉండేది. గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగించే సత్తయ్య ప్రస్తుతం లబోదిబోమంటున్నాడు. ఈ గాడిద ఎవరిదో తేల్చే పనిలో ఉన్న వికారాబాద్ పోలీసులు మాత్రం గాడిదను, దాని పిల్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో కట్టేశారు. ఈ గాడిద పంచాయతీలో పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి.