హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రులపై ఐటీ శాఖ అధికారులు చేస్తున్న దాడులు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. హాస్పిటల్స్ పైనే గాక, వాటిలో పనిచేసే సీనియర్ డాక్టర్ల ఇళ్లల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఇరవై బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ప్రారంభమైన దాడులు సాయంత్రం వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది.
అయితే ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ఈ దాడులు రాజకీయ కోణంలోనూ భిన్నాభిప్రాయాలకు తావు కల్పిస్తున్నాయి. వైద్యుల ఆదాయపు పన్ను చెల్లింపుల వ్యవహారంలో మాత్రమే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నరనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో దాడుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణాలో అధికార పార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులకు యశోద ఆసుపత్రుల నిర్వహణతో వ్యాపార సంబంధాలున్నట్లు ప్రచారం ఉంది. ఆసుపత్రి ముఖ్య నిర్వాహకులు ఉత్తర తెలంగాణాకు చెందిన ఓ మంత్రి బంధువులుగా భావిస్తుండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఆసుపత్రుల్లో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. కరోనా వైద్యచికిత్సలకు సంబంధించి యశోద ఆసుపత్రుల ఫీజు వసూళ్ల మొత్తాలపైనా భారీ ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో యశోద ఆసుపత్రులపై సాగుతున్న ఐటీ అధికారుల దాడులు సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అకస్మాత్తుగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలనే సారాంశంతో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు ఆయా వార్తల సారాంశం. ఈ పరిణామాల అనంతరం టీఆర్ఎస్ పార్టీ నేతలకు భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాచుర్యంలో గల యశోద ఆసుపత్రులపై ఐటీ దాడులు భిన్న చర్చకు దారి తీస్తున్నాయి.