బెంగళూరు నగరంలో ఐటీ దాడులు భారీ కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేతదారులు లక్ష్యంగా సాగుతున్న ఐటీ దాడులు రాజకీయ చర్చకు కూడా ఆస్కారం కలిగిస్తున్నాయి. మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితునిగా పేరుగాంచిన ఉమేష్ ఆఫీసు, ఇంటిపైనా ఐటీ దాడులు జరుగుతుండడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
బెంగళూరు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలపై, చార్టెడ్ అకౌంటెంట్ల, కాంట్రాక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుడు ఉమేష్ కు చెందిన నివాసంలో, ఆఫీసుల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దాదాపు 300 మంది ఐటీ విభాగాపు అధికారులు, సిబ్బంది టీములగా విడిపోయి దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని యాభైకి పైగా ప్రాంతాల్లో ప్రముఖుల ఇళ్లపై, ఆఫీసులపై జరుగుతున్న దాడులు, తనిఖీలు కర్నాటక రాష్ట్రంలోనేకాదు దేశవ్యాప్తంగా ఆసక్తికర వార్తాంశంగా మారడం గమనార్హం. ఇప్పటికే దాదాపు 150 కార్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.