పుదుచ్చేరి సముద్ర తీరం. పంబాకీర పాళ్యానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు సముద్రం బాట పట్టారు. పుదుచ్చేరి తీరం నుంచి దాదాపు 10 నాటికల్ మైళ్ల దూరంలో మత్స్యకారుల వలకు ఓ భారీ కుదుపు. పే…ద్ద చేప ఏదో పడిందని మత్స్యకారులు మహా సంబరపడ్డారు. తమ పంట పండిందని మురిసిపోయారు. దాన్ని బయటకు లాగేందుకు మత్స్యకారులు శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ ఎంతకీ రావడం లేదు. చివరికి పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో నాలుగు పడవల సాయంతో ఎట్టకేలకు వలలో చిక్కిన భారీ బరువును ఒడ్డుకు చేర్చారు. దాని భారీ ఆకారం చూసి మత్స్యకారులు నివ్వెరపోయారు. అక్షరాలా 13.5 మీటర్ల పొడవు, వెడల్పు, మూడు మీటర్ల వ్యాసంతో వలకు చిక్కిన 16 టన్నుల బరువు ఉంది మరి. ఇదేమీ అతి పే…ద్ద చేప కాదు మరి. ఇంతకీ మత్స్యకారుల వలకు చిక్కిన ఆ భారీ బరువు ఆకారం ఏమిటో తెలుసా? పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) రాకెట్ బూస్టర్. దీనిపై ఎఫ్ఎల్ 119, పీఎస్ వోఎం-ఎక్స్ఎల్, 23.02.2019 అని రాసి ఉంది.
చేప చిక్కితే మత్స్యకారులకు లాభం జరిగేది, కానీ ఈ రాకెట్ బూస్టర్ మాత్రం వారికి భారీ నష్టాన్నిమిగిల్చింది. కనీసం రూ. 20 లక్షల నష్టం వాటిల్లడంతోమత్స్యకారులు బావురుమన్నారు. రాకెట్ బూస్టర్ ను ఏం చేసుకోవాలో తెలియక పంబాకీరపాళ్యం లైట్ హౌస్ వద్ద దాన్నిఉంచి, శ్రీహరికోట షార్ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. రాకెట్ బూస్టర్ ను తీసుకువెళ్లేందుకు 16 టైర్ల లారీ, ఓ భారీ క్రేన్ ను షార్ అధికారులు తీసుకుని వచ్చారు. కానీ బూస్టర్ ను తరలించేందుకు మత్స్యకారులు అడ్డుతగిలారు. తమ వలలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముప్పయి మంది గల తాము ఓ రోజు ఉపాధిని కోల్పోయామని, తమ సంగతేమిటని ఆందోళనకు దిగారు. మొత్తానికి మత్స్యకారులతో పోలీసు, కోస్టల్ గార్డ్ అధికారులు చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. ఈ బూస్టర్ గత నెల 27న ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహానికి సంబంధించిందని, ప్రయోగాల సందర్భంగా రాకెట్ నుంచి ఈ తరహా వస్తువులు సముద్రంలో పడడం సాధారణమేనని షార్ అధికారులు వెల్లడించారు. విదేశీ అంతరిక్ష ప్రయోగాల సందర్భంగా కూడా మన దేశ సముద్ర తీరాల్లో ఇటువంటి వాహక భాగాలు లభ్యమవుతుంటాయని, కొన్నిసార్లు మండే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. అదన్నమాట సంగతి…వలకు చిక్కేవన్నీ సొరచేపలు కాదు.