తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠధామాన్నే కరోనా బాధితులు కొందరు ఐసొలేషన్ సెంటర్ గా మార్చుకున్న ఘటన ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మొద్దులమడ గిరిజన గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, ఈ గిరిజన గూడెంలో దాదాపు 150 మంది జనాభా ఉండగా, అందులో 50 మంది కరోనా బారిన పడ్డారు. సామూహికంగా చేపలవేటకు వెళ్లిన సందర్భంగా వీరందరికీ కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. దిరిమిలా దాదాపు ఇంటికొకరు చొప్పున కరోనా బారిన పడ్డారు. దీంతో వీరందరూ హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది.
అయితే ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని భావించిన బాధితులు ఊరికి దూరంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గ్రామంలోనే నిర్మించిన సువిశాలమైన స్మశానవాటిక ఐసోలేషన్ సెంటర్ గా ఉపకరిస్తుందని బాధితులు భావించారు. ఈమేరకు గత రెండు రోజులుగా స్మశానంలోనే వైరస్ బాధితులు ఉంటున్నారు. వీరందరూ సామూహికంగానే వంటలు చేసుకొని అక్కడే భుజిస్తూ ఐసొలేషన్ పాటిస్తున్నారు. అయితే. మొద్దులమడ కరోనా బాధితులు స్మశానంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటనపై సమాచారం కలెక్టరుకు చేరడంతో వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కానీ గిరిజనులు మాత్రం అందుకు నిరాకరించారు తమకు ిక్కడే సౌకర్యంతో పాటు స్వేచ్ఛ ఉందని అధికారులకు చెప్పడంతో చేసేదేం లేక వారు వెనక్కితగ్గాల్సి వచ్చిందంటున్నారు.
ఫొటో: మొద్దులమడ వైకుంఠధామంలో కరోనా బాధిత గిరిజనులు