టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లేనా? అందుకు అవసరమైన కసరత్తు కూడా దాదాపు పూర్తి కావచ్చినట్లేనా? ఫ్రంట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ పార్టీ పేరును దాదాపు ఆయన ఖరారు చేసినట్లేనా? అనే ప్రశ్నలకు ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ వేదికగా కేసీఆర్ జాతీయ రాజకీయాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
పార్టీ ప్లీనరలో కేసీఆర్ మాట్లాడిన సారాంశాన్ని పరిశీలిస్తే… జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారని చెప్పారు. ప్రాంతీయంగా తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జాతీయ స్థాయిలో కూడా పార్టీ ఉండాలంటున్నారని కేసీఆర్ అన్నారు. దేశ అభ్యున్నతి కోసం తెలంగాణ నుంచే తొలి అడుగు పడితే అదే తమకు గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ దేశానికి కావాల్సింది రాజకీయ ఎజెండా కాదని, ప్రత్యామన్నాయ ఎజెండాగా కేసీఆర్ చెప్పారు. ఎవరినో గద్దె దించడం కోసమో, లేదా గద్దెను ఎక్కించడం కోసమో తాను పనిచేయబోనని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలే ఎజెండాగా ఫ్రంట్లు రావాలన్నారు. అద్భుతమైన దేశ నిర్మాణానికి ప్రక్రియ మొదలు కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇదే దశలో జాతీయ పార్టీ పేరు ఎలా ఉండాలనే అభిప్రాయాలను కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారని, సలహా కూడా ఇచ్చాని కేసీఆర్ అన్నారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఉండాలని ఎమ్మెల్యేలు సూచించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ‘భారత రాజ్య సమితి’ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంక్షిప్తంగా ఈ పేరును ‘బీఆర్ఎస్’గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా కారు పార్టీ ఉండబోతున్నట్లు గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ ప్లీనరీలో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.