మరో సంచలనానికి తెలుగు మీడియా వేదికగా మారబోతున్నదా? ప్రస్తుత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో అనూహ్య దృశ్యాలు సాక్షాత్కరించబోతున్నాయా? అనే ప్రశ్నలకు ఔనంటున్నాయి తెలుగు మీడియా వర్గాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనివార్యంగా, అవశ్యంగా భావిస్తున్న ఓ తెలుగు దినపత్రికకు, న్యూస్ ఛానల్ కు మీడియా లెజెండ్ ఒకరు సారధ్యం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక కార్యరూపం దాలిస్తే చాలా ఏళ్ల తర్వాత తెలుగు మీడియాలో మరో సరికొత్త దినపత్రిక, న్యూస్ ఛానల్ ప్రజల ముందు ప్రత్యక్షమయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
క్లుప్తంగా విషయమేంటంటే… తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటిరోజు ఆ పార్టీ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో జరిగిన విషయం విదితమే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెల్చి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్న డజన్ మంది ఎమ్మెల్యేల విషయం, రేవంత్ రెడ్డి పాదయాత్ర వంటి అనేక అంశాలపై పీసీసీ కార్యవర్గంలో చర్చ జరిగింది. ఈ చర్చల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరపున ఓ పత్రిక, న్యూస్ ఛానల్ ను ప్రారంభించాలని నాయకుడొకరు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.
వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రధాన రాజకీయ పార్టీకి అనుబంధంగా అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. కొన్ని పార్టీలకు నేరుగా సంబంధం లేకపోయినా, అనేక మీడియా సంస్థలు ఆయా పార్టీలకు అనుబంధమనే ముద్రను ఆపాదించుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ప్రస్తుతం ఎటువంటి పత్రికగాని, న్యూస్ ఛానల్ గాని లేదు. వైెఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రారంభించిన సాక్షి పత్రిక, న్యూస్ ఛానల్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినదనే విషయం బహిరంగమే.
ఈ పరిణామాల్లోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు కాంగ్రెస్ పార్టీకి ఓ పత్రికతోపాటు, న్యూస్ ఛానల్ అవసరమనే ప్రతిపాదనలు పీసీసీ కార్యవర్గ సమావేశంలో వచ్చాయి. అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా నాయకత్వం సిద్ధపడితే ఆ పత్రికకు, ఛానల్ కు సారధ్యం వహించేదెవరనే అంశంపై సంచలనాత్మక రీతిలో ప్రచారం జరుగుతోంది. టీవీ9 నుంచి అనివార్యంగా నిష్క్రమించిన రవి ప్రకాష్ ‘కాంగ్రెస్ మీడియా’కు సారథ్యం వహించే అవకాశలున్నట్లు ఆయా ప్రచారపు సారాంశం.
ప్రస్తుతం రవి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వాడుకలో గల ‘తొలి వెలుగు’ యూ ట్యూబ్ ఛానల్ కు శాటిలైట్ అనుమతులు కూడా వచ్చాయనే కథనం ప్రచారంలో ఉంది. అంతేగాక ‘తొలి వెలుగు’ టైటిల్ తోనే దినపత్రికను తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ‘తొలి వెలుగు’ పేరుతో వెబ్ పేజీలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ‘గ్రౌండ్ వర్క్’ను రవిప్రకాష్ సైలెంట్ గా పూర్తి చేస్తున్నారని, ‘తొలి వెలుగు’ పేరున ఓ పత్రిక, శాటిలైట్ ప్రసారాలతో న్యూస్ ఛానల్ తెలుగు ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇది ఏమేరకు కార్యరూపం దాలుస్తుందనేది వేచి చూడాల్సిందే.