Is KCR’s ‘adopted son’ leaving him in the lurch and moving towards BJP?
ఈ మధ్య ‘సియాసత్’ మీడియా సంస్థ ప్రచురించిన ఆసక్తికర రాజకీయ వార్తా కథనపు శీర్షిక ఇది. ‘కేసీఆర్ ను ఇబ్బందుల్లో వదిలేసి ఆయన దత్తపుత్రుడు బీజేపీకి చేరువవుతున్నారా?’ అనేది ఆయా శీర్షిక సారాంశం. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడి ఓటమి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, సాగునీటి ప్రాజెక్టులపై స్నేహపూర్వక సమావేశాలు, అదే ప్రాజెక్టులపై తాజా పరిణామాల వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ, తెలంగాణా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇబ్బందుల్లోకి నెట్టేసి, ఆయన దత్తపుత్రుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో గల బీజేపీకి దగ్గరవుతున్నారనేది ‘సియాసత్’ ప్రచురించిన ఆసక్తికర కథనపు సారాంశం. తాజా రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ కథనాన్ని గుర్తుకు తీసుకురావడమే అసలు విశేషం.
సోమవారం జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి ఇదే అంశాన్ని బోధపరుస్తోందని రాజకీయ పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ కు అనుకూలంగా జగన్ పార్టీ ఎంపీలు ఓటు వేయగా, ఈ ఎన్నికకు తెలంగాణాలోని అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎన్నికల్లో మొత్తం సభ్యుల బలం 244 కాగా, గెలుపునకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 123 మాత్రమే. ఎన్డీఏ నామినేటెడ్, ఇండిపెండెంట్ సభ్యుల ఓట్లు కలిపితే వారి సంఖ్య 110కి చేరుకుంది.
ఇదే దశలో యూపీఏ అభ్యర్థికి 72 మంది ఎంపీల మద్ధతు ఉంది. ఎన్డీఏకు వైఎస్ఆర్ సీపీకి చెందిన ఆరుగురు, బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎపీలు మద్ధతు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్డీఏకు కీలకంగా మారడం విశేషం కాగా, పరస్పరం స్నేహపూర్వకంగా ఉంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలకు చెందిన వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ మాత్రం భిన్నవైఖరిని అవలంభించడం గమనార్హం. తాజా రాజకీయ పరిణామాల్లో కేంద్రంపై పోరుకే కేసీఆర్ సన్నద్ధమవుతున్న తరుణంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నట్లు నిన్నటి ఎన్నికల దృశ్యంలో సాక్షాత్కరిస్తున్నట్లేగా!
ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ‘సియాసత్’ ప్రచురించిన ఆయా ఆసక్తికర రాజకీయ పూర్తి వార్తా కథనాన్ని దిగువన గల లింకులో చదివేయండి.