అత్యంత అరుదుగా జరిగే సంఘటనలు వార్తలుగా చూసినపుడు, గతంలో జరిగిన ఉదంతాలు కూడా జ్ఞప్తికి వస్తుంటాయి. ‘ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలే’ అనేది నక్సలైట్ల, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు తరచుగా చేసే ఆరోపణలు. ఈ ఆరోపణల్లో నిజా, నిజాలు ఎదురుకాల్పుల ఘటనలకు సాక్షీభూతంగా నిలిచే ప్రదేశాలకెరుక కావచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని చెట్లు, చేమలకు వాస్తవాలు తెలిసినా నిష్ప్రయోజనమే కావచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణా ప్రాంతంలోనూ నక్సల్ గ్రూపుల ప్రాబల్యం తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఎన్నో ఎన్కౌంటర్ ఉదంతాలు, అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ, జనశక్తి, సీపీయూఎస్ఐ, చండ్రపుల్లారెడ్డి వర్గానికి చెందిన ఫణిబాగ్చి, రామచంద్రన్, న్యూడెమోక్రసీ, జనరక్షణ సమితి అనేక విప్లవ గ్రూపులు. కొయ్యూరులో నల్లా ఆదిరెడ్డి నుంచి తాజాగా ఇల్లందు అడవుల్లో జరిగిన లింగన్న వరకు మరెన్నో ఎదురుకాల్పుల సంఘటనలు. ఎన్కౌంటర్లలో ఎక్కువగా నక్సలైట్లే మరణిస్తుంటారు. కొన్ని ఎన్కౌంటర్లలో పోలీసుల చిటికెన వేలికి కూడా గాయం కాని ఘటనలు ఉండవచ్చు. మరికొన్ని ఎన్కౌంటర్లలో అనేక మంది పోలీసులే కాదు, ఐపీఎస్ స్థాయి అధికారులు సైతం ప్రాణత్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి.
సిద్ధాంతాలు, విధి నిర్వహణ, ప్రభుత్వ, పాలకుల విధానాలను కాసేపు పక్కన బెడితే… ‘ఎన్కౌంటర్… నక్సలైట్ల అరెస్ట్’ అనే వార్తలు వినడం, చదవడం అత్యంత అరుదైన సన్నివేశం. ఎన్కౌంటర్ జరుగుతున్న సందర్భంగా, ఇరువర్గాల మధ్య భీకర పోరు సాగుతున్న పరిస్థితుల్లో, తూటాల వర్షం కురుస్తున్న నేపథ్యంలో, అరెస్టుల వంటి సంఘటనలు అత్యంత అరుదుగానే చోటు చేసుకుంటుంటాయి. ఎక్కువ శాతం ఇది సాధ్యం కాకపోవచ్చు కూడా. సుమారు 23 ఏళ్ల క్రితం. ప్రస్తుత హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రం సమీపంలోని చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో అప్పటి పీపుల్స్ వార్ భూపతి దళానికి, పోలీసులకు మధ్య భీకర పోరాటం జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు పీపుల్స్ వార్ నక్సల్స్ మృతి చెందారు. కానీ ఇదే ఘటనలో అరుదైన దృశ్యం చోటు చేసుకోవడం ఎన్కౌంటర్ల చరిత్రలోనే ప్రస్తావనార్హ విశేషం. ఉల్లంపల్లిలో జరిగిన హోరా హోరీ పోరులో ఇద్దరు మహిళా నక్సలైట్లు పోలీసులతో పోరాడలేక చేతులెత్తి లొంగిపోయినట్లు సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ సంఘటనలో ఆ ఇద్దరు మహిళా నక్సలైట్లను కూడా ఎన్కౌంటర్ చేస్తారనే ఘటనా స్థలిలోని అందరి అంచనాలను అప్పటి కరీంనగర్ ఎస్పీ ఎన్వీ సురేంద్రబాబు తలకిందులు చేశారు. ఆ ఇద్దరు మహిళా నక్సలైట్లను ‘అరెస్ట్’ చూపడం సురేంద్రబాబు హయాంలో జరిగిన ఎన్కౌంటర్ల చరిత్రలోనే కాదు… తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ఘటన… బహుషా చివరి సంఘటన కూడా కావచ్చు.
ఎప్పుడో 23 ఏళ్ల క్రితం జరిగిన ఉల్లంపల్లి ఎన్కౌంటర్ గురించి ఇప్పుడు ప్రస్తావించడం దేనికంటే… మహారాష్ట్ర-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ సంఘటనలో దశాబ్ధాల తర్వాత సురేంద్రబాబు వారసుడిలా మరో ఐపీఎస్ అధికారి నక్సల్స్ అరెస్ట్ చూపడం విశేషం. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలోని మోజా పెరిమిలిభట్టి ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో చిక్కిన అయిదుగురు మావోయిస్టు నక్సల్స్ అరెస్ట్ చూపిన ఆ ఐపీఎస్ అధికారి పేరు శైలేష్ బల్కవుడే. గడ్చిరోలి ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పెరిమిలిభట్టి గ్రామ పరిసరాల్లో మావోయిస్టు నక్సల్ క్యాంపు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఆయన సి-60 బెటాలియన్ బలగాలను తరలించారు. అడవుల్లో ఇరువర్గాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. ఈ సందర్భంగా తమకు చిక్కిన అయిదుగురు మావోయిస్టు నక్సలైట్లను ఎన్కౌంటర్ ఆరోపణలకు తావు కల్పించకుండా ‘అరెస్ట్’ గా ప్రకటించారు ఎస్పీ శైలేష్ బల్కవుడే. ఎన్కౌంటర్ సంఘటనల్లో నక్సల్స్ మరణాల్లో పోలీసులపై ఆరోపణలు రావడం అనేక ఘటనల్లో సాధారణంగా మారిన నేపథ్యంలో, మరోసారి అరెస్ట్ వంటి దృశ్యం కనిపించడమే అరుదైన విశేషం. ఎన్కౌంటర్ల తీరుపై, నక్సల్స్ ప్రాణాలపై ఇది తర్కం కాదు… పోరాటంలో చేతికి చిక్కిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడమనే అరుదైన ఘటన ఆహ్వానించదగ్గ పరిణామం. సందర్భానుసారం ఇందుకు కారకులైన పోలీసు అధికారుల గురించి చర్చించడం… అంతే.