పరిరక్షించుకోకపోతే ఎంతటి అపురూపమైన పశు జాతైనా కాలగర్భంలో కలిసిపోతుంది. అత్యంత పొట్టిగా ఉండి, తక్కువ మేత, నీటితో, ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించడం పుంగనూరు పశువుల మేలైన లక్షణం. ఔషధ విలువలున్న చిక్కటి పాలను అందించే అరుదైన గోజాతి ‘పుంగనూరు’ పశువులను మచిలీపట్నంలో కొందరు ఎంతో శ్రద్దగా పెంచుకొంటున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా ఆవును కొలుస్తారు. ప్రతీ రోజు ఆవుకి పూజలు చేసి, గో పంచకాన్ని తీర్థంగా తీసుకుంటారు. అదే గో పంచకంతో ఇళ్ళు శుద్ధి చేసుకుంటారు. దాదాపు హిందువులు అందరూ గోవు పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎన్నో పూజా కార్యక్రమాలలో ఆవు పాలు తప్పకుండా భాగంగా ఉంటాయి. గృహ ప్రవేశం మొదలు, ప్రతీ శుభ కార్యక్రమంలో ఆవుని భాగస్వామిగా చేస్తారు.
ఆవు నుంచీ వచ్చే మలాన్ని, మూత్రాన్ని పంట పొలాలకి వాడుతారు. ఈ మధ్య కాలంలో ఒక్క ఆవు మలం, మూత్రం ఒక ఎకరానికి సరిపడేలా ఎరువులని తయారు చేసుకోవచ్చని తెలియడంతో ఒక్కసారిగా ఆవులకు డిమాండ్ పెరిగిపోయింది. దాంతో గతంలో కంటే ఆవు ఖరీదు ఇప్పుడు ఎక్కువైంది. ఆవులలో రకరకాల జాతులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దేశవాళీ, ఒంగోలు, పుంగనూరు, కపిల… ఇలా రకరకాల ఆవులు రూ. 20 వేలు మొదలు మహా అయితే ఒక లక్ష రూపాయల ఖరీదులో లభ్యం అవుతున్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో తరతరాలుగా విరాజిల్లుతున్న ఈ పశుజాతి సంతతి కొన్ని వందలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరులోని పశు పరిశోధనా స్థానంలో వీటిని కొనుగోలు చేయవచ్చు. పుంగనూరు ఆవుపాలలో ఔషధీయ గుణాలు ఉండటం వల్ల తల్లిపాలు లేని పిల్లలకు పుంగనూరు ఆవుల పాలను ఇస్తే అది ఒక దివ్యామృతంగా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు.
కానీ చిత్తూరు ప్రాంతానికి చెందిన పుంగనూరు జాతికి చెందిన ఒక ఆవు ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఈ ఆవు పాలు, పెరుగు సమస్థం ఏడుకొండల వెంకన్న ప్రసాదాలలో వాడుతారట. ఈ ఆవు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా దాదాపు 100 లీటర్లు. ఈ ఆవు ఖరీదు అక్షరాల రూ. 12 కోట్ల పైమాటేనట. వింటేనే షాక్ అవుతున్నాం కదా! నేను పట్టుకొన్నది వేరే పుంగనూరు గిత్త లెండి!!
✍️ ఎన్. జాన్సన్ జాకబ్ , మచిలీపట్నం.