మాడుగుల నారాయణమూర్తి… పూర్వ జర్నలిస్టు. తెలుగు పండితుడు కూడా. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి చెందిన నారాయణమూర్తి పలు రచనలు చేశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ప్రాశస్త్యంపై పలు పుస్తకాలు కూడా వెలువరించారు. పాత్రికేయునిగా వార్తా రచనలోనే కాదు, అవధానిగానూ ప్రాచుర్యం పొందారు. అయితే ఏంటట అంటే…?
ప్రస్తుత కరోనా కల్లోల పరిణామాల్లో ‘మాస్క్’ల ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. పురుషుల సంగతి వేరు. మాస్క్ లేకుంటే ఏ ‘కర్చీఫ్’నో మాస్కుగా మూతికి తగిలించుకోగలరు. మరి మహిళల మాటేమిటి? వస్త్ర ధారణలో ‘మ్యాచింగ్’ అంటే మహిళలకు మహా మక్కువ కదా? సాధారణ మాస్కులకన్నా ‘మ్యాచింగ్’ మాస్కులంటే అతివలు ఇష్టపడే అవకాశాలెక్కువ. మున్ముందు చీరలతోపాటే మ్యాచింగ్ బ్లౌజుకు తోడుగా ‘మాస్క్’ సైతం తయారయ్యే అకాశాలున్నాయంటున్నారు నారాయణమూర్తి. ఇదే అంశంపై ఆయన రాసిన నాలుగు లైన్ల పద్యం సాహిత్యపరంగా మహదాసక్తికరంగా ఉంది. పద్యానికి తగిన విధంగా ఫొటోను కూడా తన ఫేస్ బుక్ వాల్ పై మూర్తి జత చేశారు. ఇక పద్యాన్ని చదివి ఆస్వాదించండి.
ముసుగుల సంస్కృతి పాతదె
విసుగులతో పనివలదట వేషముతోడన్
గుసగుసలాడినకానీ
రుసలే బుసలైనచో కరోనా రాదో!!