సడన్ లాకేసినా… కొంత తీసేసినా
మొత్తం పీకేసినా… మీకే చెల్లుతదీ
నోరున్నోళ్ళ నాలుక ఎటైనా మడతేస్తరు
మద్యం షాపులు తెరిసిన మా‘రాజు’లు
తీర్థం పోసిన దేవుళ్ళు
మీ పటాలకు దండలెయ్యాలే
‘పొర్లు’ దండాలు సామీ!
ఆలి తాళి అమ్మైనా ‘రుణం’ తీర్చుకుంటాం
ఖజానా ఖాళీ లేకుండా ఇదే మా ‘భయాన’
అయ్యా రోజింతా… అంతా చెల్లిస్తం
సప్పట్లు కొట్టినం… దీపాలు పెట్టినం
పూలుజల్లినపుడు… కళ్ళప్పగించినం
‘తీర్థం’ దగ్గర మాకెందుకు సిగ్గు
‘ప్రసాదం’ కోసం ఎదురుసూపులు
ఆ చేత్తో ఇచ్చి… ఈ చేత్తో గుంజుకోవడం
ప్రభువులకు అనాదిగా రివాజు
ప్రజలకిది షరా మామూలు
పేదోనింట నిత్యం నీలినీడలే
మాటలన్నీ మెత్తగనే ఉంటయి
కత్తుల్లెక్క కసుక్కున దిగుతయ్
వలస కార్మికులోలే ఓర్సుకోవాలే
చెడి బతికినోళ్ళం రోషమెందుకు బిడ్డా!?
✍️ రవి సంగోజు