పొంగులేటి ప్రసాదరెడ్డి.. అదేమిటీ శ్రీనివాసరెడ్డి కదా? పేరు తప్పుగా ప్రస్తావించారనుకుంటున్నారా? కానే కాదు.. మీరు వింటున్నది నిజమే.. ఆయన పేరు పొంగులేటి ప్రసాదరెడ్డే.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయానా సోదరుడు. దశాబ్దానికి మించిన శ్రీనివాసరెడ్డి రాజకీయ నేపథ్యంలో ప్రసాదరెడ్డి ఎప్పుడూ తెర ముందుకు రాలేదు. పొంగులేటి వ్యాపార సామ్రాజ్యానికి మాతృ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అంతేకాదు పొంగులేటి బ్రదర్స్ కుటుంబానికి చెందిన వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలోని మరో 9 కంపెనీలకు డైరెక్టర్ కూడా. ఆయా సంస్థల నిర్వహణ తదితర అంశాలను స్వయంగా ప్రసాదరెడ్డే పర్యవేక్షిస్తుంటారు. అయితే ఏంటీ…? అంటున్నారా? అదే అసలు విశషం మరి..
ఇన్నాళ్లపాటు అన్నచాటు తమ్మునిలా వ్యవహరించిన పొంగులేటి ప్రసాదరెడ్డి గడచిన వారం, పది రోజులుగా తెర ముందుకు రావడమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా నిర్వహించిన ఏ కార్యక్రమాలకు సంబంధించిగాని, చివరికి ఆయన కుమారుని పెళ్లి, కూతురి రిసెప్షన్ కు ఖమ్మంలో జరిగిన భారీ ఏర్పాట్లో ప్రసాదరెడ్డి ఎక్కడా ప్రత్యక్ష పాత్ర పోషించిన దాఖలాలు లేవు. అంతెందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాట్లలోనూ ప్రసాదరెడ్డి ప్రత్యక్ష పాత్ర కనిపించలేదు. ఇప్పటి వరకు ఆయా ఏర్పాట్లను చేసిన, లేదా చూసిన వ్యవస్థ వేరే ఉండేది.
తాజా సీన్ ఏమిటంటే తన అనుచరులు సహా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడిన శ్రీనివాసరెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లన తర్వాత తన సోదరునితో కలిసి నడుస్తూ ప్రసాదరెడ్డి యాక్టివ్ కావడం గమనార్హం. ఇందులో భాగంగానే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలను శ్రీనివాసరెడ్డి కలుస్తున్న సందర్భాల్లోనూ ప్రసాదరెడ్డి ఆయన వెన్నంటే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో రాహుల్ గాంధీని శ్రీనివాసరెడ్డి తదితరులు కలిసన సమయంలోనూ ప్రసాదరెడ్డి ఉండడం విశేషం. అంతేకాదు వచ్చే నెల 2వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఖమ్మంలో నిర్వహించనున్న ‘తెలంగాణా జన గర్జన’ సభ ఏర్పాట్లను కూడా ప్రసాదరెడ్డి స్వయంగా చూస్తున్నారు. సభ నిర్వహణ, జన సమీకరణ, ఏర్పాట్లు, అనుమతులు తదితర అంశాలను ప్రసాదరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ పొంగులేటి అభిమానులకు, అనుచరులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే గతానికి భిన్నంగా ప్రసాదరెడ్డే స్వయంగా ఆయా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండడం, దగ్గరుండి మరీ సభ నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకోవడంపై పొంగులేటి అభిమానుల్లో భిన్న చర్చ జరుగుతోంది. కాలం కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో ప్రసాదరెడ్డి ఏదేని నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అనేది పొంగులేటి అభిమానుల్లో జరుగుతున్న తాజా చర్చల్లోని సారాంశం. మొత్తంగా తన అన్న శ్రీనివాసరెడ్డి వెన్నంటే ఉంటూ ప్రసాదరెడ్డి ప్రత్యక్ష పాత్ర పోషిస్తుండడం ఓ ఆసక్తికర చర్చగా మారిందని చెప్పవచ్చు.