కొత్త ‘చుట్టరికం’ రైతు సంక్షేమానికేనా!?
చక్రబంధంలో రాష్ట్ర రైతాంగం
సకల ఎత్తుగడల్లో కేంద్ర సర్కారు
ఎముకలు కొరికే చలిలో దేశరాజధాని రాజకీయ ఉష్ణోగ్రతలను రైతాంగం గజగజ వణికిస్తున్నాయి. సల్లబడిన వాతావరణాన్ని ఒక్కసారే వేడిక్కించారు వెన్నెముకున్న రైతన్నలు. తమ నిజ జీవిత సమస్యలను సలసల మరిగించి ఎజెండాపైకి తెచ్చి జెండా పాతి అన్నదాతలు అగ్గిరాజేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్ లో గత 20 రోజులుగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు లక్షలాదిగా తరలివచ్చి ఒక కర్షక్ నగర్‌ను అక్కడ ఆవిష్కరించి తమ పట్టుదలను విస్పష్టంగా ప్రకటించారు. ఈ సమస్య పంజాబ్, హర్యానా మరో నాలుగైదు రాష్ట్రాల రైతుల సమస్య మాత్రమేనా…!? మిగిలిన ప్రాంత రైతులు స్పందించకపోవడం మౌనం వహించడం ఉద్యమానికి తీరని అన్యాయం చేసినట్లే. పాలకుల నోట్లో నాలుకకు పరోక్షంగా సహకరించిన వారవుతారు. ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ముందుగా దేశంలోని రైతాంగమంతటికీ నష్టం కలిగించే కేంద్ర మూడు చట్టాల పట్ల దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని రైతులతోపాటు తెలంగాణలోని రైతాంగం ఆందోళనకు ఇంకా శ్రీకారం చుట్టకపోవడానికి కారణం ఏమిటనేది తాజాగా వ్యక్తమైతున్న పెద్ద ప్రశ్న. ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ఇక్కడి రైతుల తక్షణ జరూరు కర్తవ్యమనే ఆకాంక్ష ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. తొలి నుంచి ఉద్యమాల్లో ముందుండే రాష్ట్ర రైతాంగం ఇటీవల ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనేది చర్చనీయాంశం.
తెలంగాణ రైతాంగంలో నిర్లిప్తత:
చరిత్రలోకి తొంగిచూస్తే తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు రాష్ట్రంలోని రైతాంగం రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించడమే కాకుండా సామాజిక సమస్యల పట్ల స్పందించిన దాఖలాలున్నాయి. కానీ విచిత్రంగా గత ఆరేడు సంవత్సరాలుగా రైతాంగంలో స్తబ్దత నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణాలను వెంటనే విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ స్థితికి పలు కారణాలున్నాయి.
రాజకీయ పార్టీల నిర్ణయాలపై ఆధారపడి రైతు సంఘాల కార్యాచరణ కొనసాగడం విషాదకరంగా మారింది. ప్రధానంగా రైతు సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా వ్యవహరించడం ఒక కారణంగా భావించవచ్చు.
రెండో అంశం ఏమిటంటే స్వతంత్ర రైతు సంఘాలు తగిన విధంగా కార్యాచరణ చేపట్టకపోవడం ఫలితంగా రైతుల్లో ఈ చట్టాల పట్ల సరైన అవగాహన లేక సంఘటితం కాలేకపోయారని చెప్పవచ్చు.
మూడో అంశం ఏమిటంటే అసలు రైతు సంఘాల బ్యానర్ కింద పెద్ద ఎత్తున రైతులు లేకపోవడం విషాదకరం. ఉన్న సభ్యుల్లో కూడా మెజారిటీగా నాయకులు, కార్యకర్తలు, సంఘ నిర్మాణ కమిటీలు తప్ప విశాల రైతు రాశుల్లో పట్టు కోల్పోవడం ప్రధాన కారణం.
నాయకత్వాల్లో రాజీ ధోరణి పెరిగి, పోరాటాలకు సంసిద్ధతలేని స్వార్థపర విధానాలు, అంకితభావం లోపించడం కారణమనే విమర్శలున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణి సైతం రైతుల్లో కదలికలు నిలిపివేసింది. కనీస హక్కులే భూస్థాపితమైన దౌర్భాగ్యస్థితి నెలకొనడం మరో కారణంగా చెబుతున్నారు.
అప్రజాస్వామిక విధానాల పైన మాట్లాడాల్సిన మేధావి వర్గంలో ఒక సెక్షన్ మౌనం వహించింది. మరోసెక్షన్ అధికార పార్టీకి తాబేదార్లుగా మారడం కారణంగా పేర్కొంటున్నారు.
ఆయా పలు అంశాల వల్ల తెలంగాణలో రైతాంగ సమస్యలపై రావాల్సినంత కదలిక రాలేదని చెప్పవచ్చు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు నైతిక బాధ్యత వహించాల్సిందే. ముఖ్యంగా రైతాంగ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఏర్పాటైన సంఘాలపైన ఎక్కువ బాధ్యత ఉంది.
తాజాగా జరిగిన భారత్ బంద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ స్వయంగా పాల్గొనడంతో అన్ని రాజకీయ పక్షాల నాయకులు, కేడర్ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడంతో చాలాకాలానికి జనం రోడ్డెక్కిన సందర్భం మనకు పరిస్థితిని గుర్తు చేస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది.
ఈ దిశలో ఆత్మవిమర్శతో ముందుకు సాగుతారా?చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోతారో? తేలాల్సిఉంది.
తెలంగాణ తెగువ ఏమైంది?:
తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగి దేశానికి వేగుచుక్కగా నిలిచిన చరిత్రాత్మక పాత్రను విస్మరించలేము. గత రెండు దశాబ్దాల్లో సాగిన రైతుపోరాటాలను రేఖామాత్రంగా మననం చేసుకుందాం.
రాష్ట్రాన్ని చాలా కాలం పీడించిన కరువుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగింది. ఈ పోరాటంలో భాగంగా 1980, 1990 దశకంలో విస్తృత ప్రజాందోళనలు ముందుకు వచ్చిన విషయం ఇక్కడ గుర్తించాల్సిఉంది. కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు,ఆందోళనలు, అనేక యాత్రలు కొనసాగాయి. ఒక దశలో గంజి కేంద్రాలు ఏర్పాటుచేసిన విషయాలను విస్మరించలేం.
కృష్ణా, గోదావరి నదులపైన సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని రైతాంగం అనేక పోరాటాలు చేసింది. నల్లగొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతాలలో తాగునీటి కోసం ఉద్యమించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. జల సాధన కమిటీల నాయకత్వంలో సుదీర్ఘ పాదయాత్రలు జరిగిన విషయం మరచిపోరాదు.
విద్యుత్ వ్యతిరేక పోరాటం ఉమ్మడి రాష్ట్రంలోనే విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో ఆనాటి ఈ పోరాటం ప్రధాన పాత్ర వహించిందనడంలో సందేహం అవసరం లేదు. ఈ ఉద్యమం ఒక దశలో కాల్పుల స్థాయి వరకు చేరిన విషయం బషీర్‌బాగ్‌లో నలుగురిని పొట్టనబెట్టుకున్న సంఘటనను అందరికీ సుపరిచితమే.
పత్తి రైతుల సమస్యలపైన ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలపై సుదీర్ఘ పోరాటాలు ఆందోళనలు, అధ్యయనాలు కొనసాగిన విషయం తెలిసిందే. ఢిల్లీ స్థాయి నాయకులు కూడా తెలంగాణ పల్లెల్లో పర్యటించి పత్తి రైతులకు మద్దతుగా నిలిచారు. రైతు సమస్యలపై సంఘాలు నిరంతరం ఏదో రూపంలో పోరాటాలు చేస్తూ వచ్చాయి.
మద్దతు ధర సాధనకోసం మార్కెట్ స్థాయిలలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, ఆకస్మిక నిరసనలు జరిగిన సంఘటనలు కోకొల్లలు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, జమ్మికుంట తదితర మార్కెట్లలో ఎప్పుడు రైతులు అప్రమత్తతో ఉంటూ సమస్యలపై పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీలపై దాడులు చేసిన సంఘటనలు తక్కువేమీ లేవు. ఈ క్రమంలో అరెస్టులు, కేసులు కూడా ఎదుర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన సంఘటన అందరికీ గుర్తుంది.
నకిలీ పురుగుల మందులు,నకిలీ విత్తనాలపై ఒక దశలో తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ఆందోళనలు కొనసాగాయి.
పత్తి, మిర్చి, వరి, వేరుశెనగ, దాన్యం అన్ని రకాల పంటలకు న్యాయమైన ధర చెల్లించాలని, మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు నిరంతరం కొనసాగిస్తూ ఒత్తిడి తెచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఈ దశాబ్దకాలంగా రైతుల్లో స్తబ్దత నెలకొంది. దీని ప్రభావం ప్రస్తుత ఇటీవల కేంద్రం తెచ్చిన నల్ల చట్టాల సందర్భంగా స్పష్టమవుతున్నది.
పోరెత్తిన పంజాబ్, హర్యానా రైతులు:
కరోనా పాండమిక్ కష్టకాలంలో అన్ని వర్గాలు అల్లకల్లోలమై తల్లడిల్లుతుంటే బీజీపీ కేంద్ర సర్కార్ మాత్రం ఇదే అదునుగా భావించి అనేక చట్టాల్లో ప్రాథమిక మార్పులు చేస్తూ నూతన చట్టాలను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో అమల్లోకి వచ్చిన 3 వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి విపక్షాలు, వివిధ రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ పెడచెవిన పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చింది. కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసే ఈ నల్ల చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలి నుంచి రైతాంగ సమస్యలపైన ముందు పీఠాన నిలిచే పంజాబ్, హర్యానా రైతులు ఈదఫా కూడా అగ్రభాగంలో ఈ చట్టాలను ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. ఈ నిరసనలను మిగిలిన భారతావనికి తెలియకుండా బీజేపీ సర్కారు అనేకానేక కుయుక్తులు చేస్తూ వచ్చింది.అంబానీ, ఆదానీలకు ప్రయోజనం చేకూర్చే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత ఆరు నెలలుగా క్షేత్రస్థాయి నుంచి రైతులు పోరాటాలను కొనసాగిస్తున్నారు. ఐక్య రైతు సంఘాల నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు లాంగ్ మార్చ్‌కు సిద్ధమయ్యింది. అంత ఆషామాషీగాని ఈ కార్యక్రమాన్ని నెత్తినెత్తుకొని రైతంగం ఇంటిల్లిపాదితో ఢిల్లీగద్దె పై పోరాడేందుకు సర్వసన్నద్ధమై బయలుదేరారు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం లక్షలాదిమంది రైతులు ప్రవాహంలా వేలాది ట్రాక్టర్లలో తరలివచ్చి ఢిల్లీ ముట్టడికి జంగ్ సైరన్ మోగించారు. ఈ ముళ్లబాటలో కలిసొచ్చేవారందరీ సహకారాన్ని, సంఘీభావం సాధిస్తూ సంయమనంతో సాగిస్తున్న సమరం ఒక విధంగా ఢిల్లీ పన్నాగాలను బహిర్గతం చేస్తున్నది. అందుకే రోజురోజుకు రైతులకు మద్దతు పెరుగుతున్నది.
అడుగడుగునా అడ్డంకులు:
కడలి కెరటాలు తరలివచ్చిన రైతాంగం పైన సాయుధ బలగాలను భారీగా మోహరించి సకల ప్రయత్నాలు చేసిన విషయం సభ్యసమాజంలో నిలబెట్టారు. అనుకూల మీడియా వాస్తవాలు తొక్కిపట్టడమే కాకుండా తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బాష్పవాయు గోళాలను అతిశీతల నీటి ఫిరంగులను విచక్షణలేకుండా ప్రయోగించారు. అడుగడుగడుగనా బారికేడ్లను ఏర్పాటుచేసి రైతులను నిరోధించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. జాతీయ రహదారులను పది ఫీట్లలోతు అడ్డంగా గోతులు తవ్వి రైతుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ వారిని ఢిల్లీ రాకుండా నిరోధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. వీటన్నింటిని అధిగమించి రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో పాగా వేసి రణ నినాదమై దేశానికి కనువిప్పు కలిగిస్తుంది. తమ సమస్యల పైన ఏక గొంతుతో చర్చలు చేస్తూ ప్రభుత్వ ఎత్తులను చిత్తుచేస్తున్నది.
ఉద్యమం పైన విషప్రచారం:
రైతులను రెచ్చగొట్టే పద్ధతులు అవలంభిస్తూనే కేంద్రస్థాయి మంత్రులు ఉద్యమం పైన విష ప్రచారానికి లంఘించుకున్నారు. కుక్కను చంపాలంటే పిచ్చికుక్కలుగా ముద్రవేసే నీచమైన కుట్రలకు తెరదీశారు. ఖలిస్తాన్‌లు, పాకిస్థాన్‌లు, ఆఖరికి మావోయిస్టులున్నారంటూ సమస్య ఎజెండా మార్చేందుకు సర్వశక్తులు వెచ్చిస్తున్నారు.
విభజనకు సకల ఎత్తుగడలు:
కేంద్రం తాజా పరిస్థితి తమ మెడకు పూర్తిగా చుట్టుకోకముందే ముందు జాగ్రత్త చర్యలు అన్ని పావులను చకచకా కదుపుతున్నది. మరోవైపు అవగాహన పేరుతో రైతులకు ధీటుగా బలప్రదర్శనలుచేసి పోరాటాన్ని కల్లోలం చేసేందుకు బలగాన్నీ, బలగాలను సంసిద్ధం చేస్తున్నారు. రైతుసంఘాల మధ్య ఉన్న ఐక్యతను రాష్ట్రాల పేరుతో వేరుజేసే యత్నాలు సాగుతున్నాయి. పైకి సన్నాయి నొక్కులు నొక్కుతూనే మీడియాదాడిని పెంచారు. సంఘీభావాన్నీ అడ్డుకునే యత్నాలు సాగుతున్నాయి. మరోవైపు రహదారుల దిగ్బంధం పైన కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఏక కాలంలో బహుముఖ ఎత్తుగడలను అమలుచేస్తున్నారు. రైతుల ఉద్యమం బీజేపీ భవిష్యత్తు బాటలకు పెద్ద స్పీడ్బేకర్లనే అంశం ఆ పార్టీ దాని మాతృసంస్థ ఎప్పుడో గ్రహించి చదరంగాన్ని ప్రారంభించిన సంగతిని మరువరాదు.
ఉద్యమానికి గట్టి సంఘీభావం:
రైతాంగ ఉద్యమానికి వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నాయి. ప్రతినిధులు హాజరై రైతుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా రైతు సంఘాలు ప్రతినిధులు ఢిల్లీ రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు భారత్ బంద్ లో విశేష భాగస్వామి నిలిచారు. ఇంతటితో లాభం ఉండదు. కారణాలు ఏవైనా సమస్య అన్ని ప్రాంతాల రైతులదైనప్పుడు జరిగిన జాప్యం పక్కనపెట్టి తక్షణం ఎక్కడికక్కడ ఉద్యమం ప్రారంభించినపుడే పరిష్కారం లభిస్తుంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా సింఘూ పోరాట పీకను కేంద్రం పిసికేస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలి.
ఉద్యమిస్తేనే ఉనికి పదిలం:
ఇప్పటికైనా రాష్ట్రంలోని రాజకీయపక్షాలు, రైతు సంఘాలు జరుగుతున్న అన్యాయాలపై క్షేత్రస్థాయి నుంచి కార్యక్రమాలను చేపడితే తప్ప రైతులు సంఘటితమయ్యే అవకాశాలు లేవు. తక్షణ కార్యక్రమంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు ఐక్య కార్యాచరణ ఏర్పడి ఢిల్లీ రైతులకు మద్దతు తెలపడమే కాకుండా ఇక్కడ ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టడం అత్యంత అవసరం. దీనివల్ల బలంగా రైతు ప్రయోజనాలు కాపాడుకోవడమే కాకుండా, కేంద్రంలోని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి నల్ల చట్టాలను మార్పు చేసుకునేందుకు ఆకాశం దక్కుతుంది. లేకుంటే కొందరు కేంద్ర నాయకులు చెబుతున్నట్టు ఇది పంజాబ్, హర్యానా రైతుల సమస్యగా మారిపోయి వారి ఉద్యమాన్ని అణిచి వేసేందుకు అవకాశం చిక్కుతుంది.ఇప్పటికైనా అవగాహన కలిగిన రైతు సంఘాలు ఐక్య కార్యాచరణకు సిద్ధమైతే ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా ముందుకు వెళ్తారని రైతులు ఆశిస్తున్నారు. సింఘూ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను చూసైనా రాష్ట్ర రైతాంగానికి కనువిప్పు కలగాలని ఆశిద్దాం.
రవి ® సంగోజు
నోట్: ఈ వార్తా కథనంలోని దృశ్యాలు ఫైల్ ఫొటోలుగా గమనించగలరు