వజ్రాన్ని
ఎన్నేండ్లు కప్పిపెడుతరు
కలుపుమొక్కలు
రాళ్లకంపలు మట్టిదిబ్బలెంత పరుచుకున్నా
భూమిలో విత్తనం దాగదు, జల ఊటాగదు పాలమూరు దాటాగదు
పువ్వులు పరిమళిస్తనే ఉంటవి
జానపదం ప్రవహిస్తనే ఉంటది
విస్మృత గేయాలు
వీరుల వీరగాథలు విజయగీతికలు
చారిత్రక కథలు చరిత్ర చెరిపేసిన యోధుల గాథలు
పాలమూరు జానపదాలు
ప్రపంచాన గానకిరీటాలు
యతిప్రాసలుండవు
అలంకార వ్యాకరణాలు, శబ్దశ్వాసలుండవు
బతుకుదెరువుల
పల్లాయిలుంటయి గోసాయిల గోసలుంటయి
కన్నీటిసుడుల తాళాలుంటాయి
పౌరుషాల్ని మొలిపిచ్చే చరణాలుంటాయి
పండుగసాయన్న,మియాసాబ్ ల వీరత్వాలుంటాయి
ఆకలి పేదరికాన్ని కావడిగట్టుకొని
ఊరూరు ఇల్లిల్లు సంచారమై
సమాజపు గుమ్మిలో గూడల్లుకున్న పాటలు
విసిరేయబడ్డ పాటలు వినిపించుకోనిపాటలు
తాళపత్రాలలో పొదుగలేవు
తామ్రపత్రాలలో చోటుండదు
కాగితాలలో ఇమడలేవు
కలాలలో పొందలేవు,ఇంటర్ నెట్ లు వొంపుకోలేవు
కూలినాట్ల పంటకోతల తల్లులనోట
సాలుసాలుకు మునుంమునుంకు
కొడవలి పదమైతది కల్లం కోలాటమైతది
చిలుక కొరికిన జానపండు పాట
కాలువగట్లమీద గూడలేసినపాట
కార్మిక కర్షక కాడెద్దుల మోటపాట
చిందుభాగోతాల హారికథలపాట
కాలాన్ని నిద్రపోనివ్వనిపాట యక్షగానాల జానపాట
రచ్చకట్టమీద రావిచెట్టుపాట
పండువెన్నెలై కురిసె పన్నెండు మెట్లకిన్నెరపాట
వందలయేళ్ల వెండితెరలలో
అడుక్కతినే కళగానే చూయించారు
శాస్త్రీయ సంగీత లలిత నృత్య కళలే
ప్రపంచకళలుగా వాకిళ్లు తెరిచి ఆరబోసిండ్రు
ఇప్పుడిప్పుడే
కళలు ఆకాశపు మెట్లుదిగుతున్నయి
అస్తిత్వ ఆశ్రిత కళళలు జెండాఎగురేస్తున్నవి
దర్శనం మొగులయ్యపాట
దారెంబడి దరిసెనపూలతోట
పన్నెండుమెట్ల చిలుకకిన్నెరపాట
పాలమూరు వజ్ర రాగాల గుట్ట
జానపద గేయం దునియా జనగీతమై
భీమ్లానాయక్ సినిమాలో దుమ్ములేపింది
బొమ్మజెవుడు చెట్టు కాంతినిచూసి
సూర్యసెంద్రులు కళ్ళెళ్ళబెట్టారు.
(దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం సందర్భంగా…)
- వనపట్ల సుబ్బయ్య