థాయ్ లాండ్ వెళ్ళినపుడు ఫిఫి ఐలాండ్ వెళ్ళాం. పెద్ద లాంచీలో తీసుకెళ్లారు. అక్కడ దిగగానే టూరిజం వాళ్ల వలంటీర్లు వచ్చి 50 బాత్ (అక్కడి కరెన్సీ) లు ఇమ్మన్నారు. టికెట్, యాక్టివిటీస్ అన్నిటికీ ముందే చెల్లించేయడం వల్ల ఈ డబ్బు ఎందుకని అడిగాం.
“టూరిస్ట్ లు వచ్చి చూసెళ్ళి పోరు. అడ్డమైన ప్లాస్టిక్ బాటిళ్ళూ, చిప్స్ పాకెట్లూ నానా చెత్తా అతి శుభ్రంగా అందంగా ఉన్న బీచ్ లో పడేసి పోతారు. థాయ్ బీచ్ లలో చెత్త ఉండటం నిషిద్ధం. అదంతా క్లీన్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. అదంతా మీ దగ్గరే వసూలు చేస్తాం” అని చెప్పి మరీ తీసుకున్నారు. అలా పడేసే వాళ్ళలో ఇండియన్స్ ఫస్ట్ లైన్లో ఉంటారని కూడా కితాబిచ్చాడు గైడు
న్యూస్ చానెళ్ల వాళ్ళు “హైద్రాబాద్ మునిగితే గానీ కళ్ళు తెరవదా GHMC?” అని వర్షం పడ్డప్పుడు రొటీన్ గా అడిగే ప్రశ్న అడుగుతున్నారు.
నాకు తెలిసి GHMC is working its best now.
గ్రీన్ సిగ్నల్ మీద రోడ్ దాటడం ఏమిటని అడిగితే అది తప్పని ఒప్పుకోకుండా, గవర్నమెంటు సరిగా రోడ్లు వేసిందా, జీబ్రా లైన్స్ గీసిందా అని ఎదురు ప్రశ్నలేస్తుంటారు.
ప్లాస్టిక్ బాటిళ్ళూ, కవర్లూ, కట్టల కొద్దీ నాలాల్లో పడేస్తారు, అది వాళ్ళ సొంత డస్ట్ బిన్ అయినట్టు. చెరువు పూడ్చిన స్థలం అని తెల్సీ మిడిల్ క్లాస్ అడ్జస్ట్ మెంట్ తో ఇళ్ళు కడతారు.
తర్వాత వానాకాలం చెరువొచ్చి ఇంట్లో కూచుంటే గవర్నమెంట్ వచ్చి దాన్ని వెళ్లగొట్టాలంటారు.
అలాటి లే ఔట్లకు పర్మిషన్స్ ఎలా ఇస్తారో టౌన్ ప్లానింగ్ వాళ్ళకే తెలియాలి. సగం సిటీ చెరువుల మీదే.
ఎలా కట్టినా సరే , అక్రమాలన్నీ డబ్బు కడితే సక్రమాలై పోయే రెగ్యులరైజింగ్ విధానాలు చేతిలోనే.
పోనీ వర్షపు నీటి కోసం ఇంకుడు గుంటలు తవ్వరు.
ఓపెన్ మాన్ హోల్స్ కనపడితే వాటిలో చెత్త పడేస్తారు.
అసలు ప్రతి చోటా చెత్త పడేయడం మన జన్మ హక్కు , అది యమపాశమై మన మెడకు చుట్టుకునే దాకా…
పాతాళం లోతులో సెల్లార్లు ! వాటిలో నీళ్ళు నిలిస్తే వాటిని మళ్ళీ రోడ్ మీదకు పంప్ చేయడం.
పూర్తిగా ప్రభుత్వం తప్పు (ఏ ప్రభుత్వమైనా సరే) అయినట్టూ జనం తప్పు ఏ మాత్రం లేనట్టూ, జనం మంచు కడిగిన ముత్యాలైనట్టూ..
అయితే విచిత్రంగా ప్రభుత్వం కూడా వీళ్ళని ఏమీ ప్రశ్నించదు. కఠిన చర్యలు తీసుకోదు. నాలాలో ఫ్లాస్టిక్ క్లీనింగ్ కి ఆ చుట్టు పక్కల వాళ్ళ దగ్గర ఖర్చులు వసూలు చేయడం లాంటి చర్యలు తీసుకుంటే ఏం?
అలాటి చర్యలు ఏమీ ఉండవు, ఫైన్లు ప్రాక్టికల్ గా ఏమీ ఉండవ్..
ఓట్ల కోసమేమో మరి!
ఒక్క రాత్రిలో 32 సెంటీమీటర్ల వర్షం అంటే అసాధారణమైన స్థితి. ఏ ప్రభుత్వమూ 100% సమర్థంగా అరికట్టలేని విపత్తు.
హైద్రాబాదే కాదు, అమెరికాలో కూడా చాలా వూళ్ళలో వరదలు వస్తే వీధులు నదులూ సముద్రాలూ అవుతాయి. కార్లు కొట్టుకు పోతాయి. మనుషులు మునిగి పోతారు.
ఇదే సందు గా వాట్సప్ వీరులు ఎక్కడెక్కడివో అస్సాంలో బ్రహ్మపుత్ర పొంగినప్పటివీ, ఇంకా వీలుంటే 2012 ఉత్తరాఖండ్ వరదలవీ వీడియోలూ సంపాదించి “హైద్రాబాద్ మునిగింది”పేరుతో పంపిణీ చేస్తున్నారు.
హైద్రాబాద్ కాదు, ఒక్కరాత్రిలో ఇంత వాన కురిస్తే ఏ సిటీ అయినా మునుగుతుంది.
జనం కోసం మాట్లాడాలి కరెక్టే, కానీ బాధ్యత లేకుండా జనం చేసే చెత్త పనుల గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి.
✍️ సుజాత వేల్పురి