ఏడాది క్రితం ఈ సమయానికి మనందరికీ ఒకటే సందేహం. మరణానికి మనమెంత దూరంలో ఉన్నామా అని, బతుకెంత భారమవబోతోందా అని!
ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలే మన మాట వినరు. అటువంటిది యావద్భారతావనినీ అర్ధసంవత్సరం పాటు ఇళ్లకు తాళాలేసి గడప దాటొద్దంటూ గదమాయించడం ఎంత కష్టం? ఎవరు వింటారు? కానీ విన్నారు.
మూతబడ్డ మిల్లుల పొగగొట్టాలన్నీ కాసేపలా ఊపిరి పీల్చుకున్నాయి. మనందరం ముసుగులు ధరిస్తే ఈ నేలమీది చెట్టూచేమలన్నీ స్వేచ్ఛగా స్వచ్ఛతననుభవించాయి.
ప్రతి మనిషిలోనూ నిద్రాణంగా పడివున్న ‘మానవుడు’ బద్ధకంగా ఒళ్లువిరుచుకుని లేచి ఆకలేసినవాడి ఇంటి ముందు ‘దేవుడు’గా ప్రత్యక్షమయ్యాడు.
మతాలనీ, అభిమతాలనీ పక్కనబెట్టి నెలలతరబడి వండివార్చి మరీ వడ్డించారు.
అనంతవాయువుల్లో కలవబోయే ప్రాణాల్ని ప్రాణంపెట్టి, ప్రాణవాయువునందించీ కాపాడారు. అందరూ ఇక్కడి మనుషులే! ఎక్కడినుంచో దిగిరాలేదు. ఏ దేవుడూ అవతారమెత్తి రక్షించలేదు.
ఈ యుద్ధం మనకు నీతిని, సహనాన్ని, క్షమని, కరుణనీ నేర్పింది. పంచుకోవడం అలవాటు చేసింది.
రోజుకో రీతిగా రంగుమార్చే రాజకీయ నాయకుల్లా అంతుపట్టని పోకడలతో పట్టిపీడించిన కరోనా దెయ్యాన్ని కొమ్ములువంచే జల్లికట్టులో మనందరం విజేతలమే!
మన నిబద్ధతే ఈ పరిస్థితికి కారణం. మన సహనమే మనకు శ్రీరామరక్షగా నిలిచింది.
విగ్రహాల తలలు పగలగొట్టే రాక్షసులు తిరుగాడే సమయంలోనే నిగ్రహంతో తలలు పగిలిపోయేలా ఆలోచిస్తూ రక్షకులు కూడా నిద్రమానుకుని పరిశోధనలు జరిపారు. సత్వర ఫలితం సాధించారు.
అకుంఠిత దీక్షతో సాధించిన ఈ టీకా పట్ల అనుమానాలు, అవమానాలు కొత్తేమీ కాదు. ప్రతి సమర్ధవంతమైన నాయకుడికీ ఎదురుదాడి అలవాటే!
అన్ని వైరల్ వ్యాక్సిన్ల లాగే దీనికీ సహజంగా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందరో చిన్నారుల ప్రాణాల్ని కాపాడుతున్న టీకాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీకు సమీపంలో ఉన్న ఏదైనా ఇమ్యునైజేషన్ సెంటర్ని ఒకసారి సందర్శించండి.
కన్నులైనా తెరవని చిన్నిపాపల దగ్గరనుంచి పాలబువ్వ తినే పసివాళ్లదాకా ఎంతమంది సూదులు పొడిపించుకుంటున్నారో మీ కళ్లతో మీరే చూడండి. ధైర్యం అదే వస్తుంది. ఆ తల్లులందరికీ ఆరోగ్యవంతమైన బిడ్డల్ని అందించే దిశగా కోట్లాది రూపాయల వ్యయం, వందలాది శాస్త్రవేత్తల శ్రమ, వేలాది కార్మికుల కృషి కలగలిసి ఒక సూదిమందు బయటికొస్తుంది.
అది నిజంగానే సంజీవని. ఏ హనుమంతుణ్ణీ పంపనక్కరలేకుండా మన ముంగిట్లో వాలే దివ్యౌషధమది.
మిడిమిడి జ్ఞానంతో చేసే సత్యదూరమైన ప్రచారాలను నమ్మకండి.
ముందువరుసలో నిలిచి, మీకందరికీ సేవచేసుకునే భాగ్యం లభించినందుకు సంతోషిస్తున్నాం.
ముందుగా మాకిచ్చిన ఈ ప్రాధాన్యతకు వందనమర్పిస్తున్నాం.
✍️ కొచ్చెర్లకోట జగదీశ్