పౌరుషానికి, పరాక్రమానికి ప్రతీకగా మా మధ్య జాతివైరం సృష్టించి వినోదించే మానవుల్లారా ? కాస్తంత తీరిక చేసుకుని మా వ్యథ ఆలకిస్తారా…. చావో బతుకో తేలాల్సిందే తప్ప బరి దాటని మహా వీరజాతిగా మీరు పొగిడితే తెగ మురిసిపోయే అల్ప సంతోషులం మేం. నాటి పల్నాడులో బ్రహ్మనాయుడు, నాగమ్మల రోషానికి, సౌరుషానికి మేము సమిధలమయ్యాం. మీ రాజ్య కాంక్షకు, ధన దాహానికి కుత్తుకలు తెగి నెత్తురోడుతూ మేము బలిదానం చేస్తున్నాం. మా జాతికి వందల ఏళ్ల వయసున్నా, మీ కేళీ, విలాసాల కోసం నెలల ప్రాయానికే అంతమైపోతున్నాం. నాడు రాజ్యాల కోసం మమ్మ ల్ని బలిచేస్తే, నేడు జూద వినోదంలో రూకలకోసం మా బతుకు నూకలు చెల్లిపోయేలా చేస్తూ, పైశాచికానందం పొందుతున్నారు. ఇదేమన్నా బాగుందా?
ఈ భూగోళం మీద మీరే అత్యంత తెలివిగలవారని మాలాంటి సాధారణ ప్రాణికోటికంతా తెలుసు. మీరు న్యాయం చట్టం మానవ హక్కులు అన్నీ ఏర్పాటుచేసుకున్నారు కదా! మరి మా విషయంలో అవేవీ గుర్తుకు రావా? ఈ లోకంలో కోడి పుంజులుగా పుట్టడమే మేం చేసుకున్న పాపమా ?? అనాదిగా మిమ్మల్ని జాము జాముకూ హెచ్చరిస్తూ, సూర్యోదయానికల్లా ఊరికంతటికీ మేలుకొలుపు పాడుతూ వచ్చింది మేము కాదా ? దైనందిన కార్యకలాపాలు ప్రారంభించే ముందు ‘కొక్కొరొకో’ అంటూ ఎలుగెత్తి శుభం పలికేది మా జాతే కదా! మరి కూత కూస్తే, కోతకొచ్చిందన్నట్లు మీరు మా కాళ్లకు కత్తులు కట్టి కుత్తుకలు తెగ్గొట్టుకోమంటూ బరిలో దింపటం న్యాయమేనా ??
హై టెక్ సంస్కృతి ప్రబలి, నాగరికులమని మిడిసిపడే మీరు టీవీ చానళ్లలో క్రీడలు, వినోదం వంటి తెగబోలెడు కార్యక్రమాలు ఉండగా, మా చావుకు రేవుపెట్టే పందెపు వినోదానికి అర్రులు చాచటం భావ్యమా? ఓడిన పుంజు శరీరాన్ని మా కళ్లముందే కాల్చుకు తినే మిమ్మల్ని నాగరికులని భావించడం పొరపాటు ! పండుగ నెల ముందు బాదం పిస్తా, కిస్మిస్, జీడిపప్పులు పెడుతుంటే.., ఆహా.. మానవులకు మనమీదెంత ప్రేమ అని మురిసిపోతున్నాం . కానీ… మీ కపటబుద్ధి కళ్లకు కట్టేసరికే బరిలో బలైపోతున్నాం. మా వేడి నెత్తురు మీ నేలపై ఒలికితే మీకు శుభమా ? ఇకనైనా కుక్కుట జాతిపై మిక్కిలి మక్కువతో చక్కగ చూసుకోమని రెక్కలు జోడించి ప్రార్థిస్తున్నాం !!
✍️ ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం
(పదిహేనేళ్ల క్రితం… నేను దివిసీమ ప్రాంతీయ కార్యాలయంలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నపుడు రాసిన స్టోరీ ఇది. అప్పటికీ, ఇప్పటికీ ఇదే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది.)