పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆచూకీ గురించి భిన్న కథనాలు వ్యాప్తిలోకి వస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ కు ఆయన బాసటగా నిలిచారని, ఈ నేపథ్యంలోనే మధు ఆచూకీ లేకుండా పోయారనే వార్తలు ఒకవైపు, అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కుంటున్నారని, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసే కీలక సమయంలోనే మధు అదృశ్యమయ్యారనే కథనాలు ఇంకోవైపు వ్యాప్తిలోకి వస్తున్నాయి. మినీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్ట మధు ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయినట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే. ఓ జిల్లా పరిషత్ చైర్మెన్ గడచిన ఎనిమిది రోజులుగా ఆచూకీ లేకుండా పోవడంపై భిన్న ప్రచారంతో కూడిన వార్తా కథనలు సహజమే కావచ్చు. ఇదే దశలో ఈ విషయంలో అధికారికంగానూ ఎటువంటి సమాచారం బహిర్గతం కావడం లేదు.

ఈ పరిణామాల్లోనే ‘ఖబర్ కట్టా’ అనే మహారాష్ట్ర మీడియా సంస్థ ఒకటి ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అడ్వకేట్ దంపతుల హత్యోదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న పుట్ట మధు మహారాష్ట్రలోని ‘వని’ అనే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని ‘ఖబర్ కట్టా’ ప్రచురించిన వార్తలో నివేదించింది. పుట్ట మధు మొబైల్ ను ట్రాక్ చేస్తున్న పోలీసులు అతని కదలికలను గుర్తించారని, అతని కోసం సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, ఈమేరకు గత ఆదివారం అర్థరాత్రి సమయంలో తెలంగాణా పోలీసులు ‘వని’ ప్రాంతానికి చేరుకున్నారని ‘ఖబర్ కట్టా’ వార్తా కథనపు సారాంశం. అయితే పుట్ట మధు మహారాష్ట్రలోని ‘వని’ ప్రాంతానికి ఎందుకు వెళ్లారనే అంశంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కర్నాటకలోని రాయచూర్ లో, మహారాష్ట్రలో తన బంధుగణం, స్నేహితులు ఉన్నారని, ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో ఆయన కుమార్తె, అల్లుడు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

పుట్ట మధు గురించి ‘ఖబర్ కట్టా’ ప్రచురించిన వార్త కథనంలోని భాగం

ఈ నేపథ్యంలోనే పుట్ట మధు ఆచూకీపై మరాఠీ మీడియా సంస్థ ప్రచురించిన కథనం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన కథనపు క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, పుట్ట మధు మహారాష్ట్రలోని ‘వని’లో పోలీసులకు చిక్కారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పుట్ట మధు కదలికలను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలోనూ పోలీసులు కనుగొన్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. మొత్తంగా ఓ జిల్లా పరిషత్ చైర్మెన్ హోదాలో గల మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం, ఆచూకీ అధికార పార్టీ నేతలకు పట్టని అంశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments are closed.

Exit mobile version