మా చిన్నప్పుడు మేము మా పోస్టు మేన్
వచ్చే టైముకి దారి కాసే వాళ్ళం.
అతను మా ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తే, మహానందపడిపోయేవాళ్ళం.
తీరా చేసి, అద్దెకున్న వాళ్ళకిచ్చి,
మాకేమీ ఉత్తరాలు లేవంటే, నీరసం వచ్చేది.
మాకు ఒకటైనా పోస్టు కార్డు ఇస్తే, మొదట చదవడానికి పోటీలు పడి, దెబ్బలాడుకుని, ‘బలవంతుడిదే ఉత్తరం’
అన్నట్టు లాక్కుని, నాలుగుసార్లు చదివాక, మిగిలినవారిని ‘ఉత్తరా’ధికారుల్ని చేసేవాళ్ళం.
ఢిల్లీ నుంచి మా అక్క రాసిన ‘ఇంగ్లాండు’ కవరు వస్తే,
దాంట్లో విశేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి,
దానికి ఎంత గ్లామరో !
ఉత్తరానికి మూడు పక్కలా నింపేశాక,
‘అందరినీ అడిగానని’ చెప్పాలి కాబట్టి,
మా పనిమనిషి అప్పలమ్మ దగ్గిరనించీ,
ప్రతి నెలా టైముకి అద్దె ఇవ్వని ప్రకాశం అంకుల్,
పాలు పొసే పాలశంకరం లాంటి వాళ్ళ పేర్లు
రాయడానికి మార్జిన్ లు వాడుకునేది.
1965 లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ప్రభుత్వం వారు తీసుకునే ‘బ్లాక్ ఔట్’
(కరెంటు తీసేసి,పట్టణమంతా చీకటి చేసెయ్యడం,) విమానం మోత వినిపిస్తే సైరన్ మోగించడం లాంటి విశేషాలన్నీ పూసలు గా గుచ్చి, పెద్ద కవరు రాసేది.
ఢిల్లీ లో రిపబ్లిక్ డే కి జరిగే ఉత్సవాల విశేషాలు మొదటిసారిగా మా అక్క రాసిన
‘పే…..ధ్ధ’ ఉత్తరం ద్వారా తెలుసుకున్నాం.
ఠావులు ఠావులు ఉత్తరాలు రాసేస్తే,
అదనంగా స్టాంపులు అతికించాలని అప్పుడే తెలిసింది.
ఆ ఉత్తరాన్ని వంతుల వారీగా ఎన్నిసార్లు చదివి ఉంటామో చెప్పాలంటే, ‘మాయాబజార్ సినిమా చూసినన్నిసార్లు’ అని చెప్పాలి.
క్లాసు పుస్తకాల కంటే, మా అక్క రాసిన ఉత్తరాలే ఎక్కువ ఆకర్షణగాను, విజ్ఞానదాయకం గాను ఉండేవి.
అందుకే కాబోలు, నెహ్రూ గారు, “కూతురికి ఉత్తరాలు”
అనే శీర్షికతో, ఇందిరా గాంధీ గారికి జైలు నుంచే
ఉత్తరాలు తెగ రాసి పడేశారు.
“మీకు పాఠాలు చెప్పను, కధలు చెబుతాను” అని
విష్ణు శర్మ, ముగ్గురు మొద్దబ్బాయిలయిన
రాజ కుమారులకి కధలు వినిపించి, వాళ్ళతో పాటు,
మనక్కూడా పంచ తంత్రాలూ బోధించాడు.
★★★★★★★★
ఇప్పుడు మన గుట్లన్నీ గూగుల్ మామకి,
ఫేస్ బుక్కు అంకుల్ కీ తెలిసినట్టే, మనకి ఎవరెవరి దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తాయో, ఎవరి దగ్గర్నుంచి ఎంత మనీ ఆర్దరు వస్తుందో, ఎవరింట్లో పెళ్ళి కూతుళ్ళ కోసం,
“అమ్మాయి నచ్చింది” అని వచ్చే ఉత్తరం కోసం పడిగాపులు కాస్తున్నారో, ఏ కుర్రాడు తనకి ఉజ్జోగం ఇస్తున్నట్టు వచ్చే ఉత్తరం కోసం గెడ్డం పెంచుతున్నాడో,
నాటి పోస్టు మేన్ లకి బాగా తెలుసు.
కాబట్టే, దసరా మామూళ్లు దండిగా ఇచ్చేవాళ్ళం.
ఇవ్వకపోతే, ‘అలుగుటయే ఎరుంగని’ పోస్టు మాన్ అలిగిననాడు, ఉత్తరాలే కాదు, కుదరబోయే పెళ్ళి సంబంధం, రాబోయే ఉజ్జోగం కూడా
కాకి ఎత్తుకు పోతుందేమోనని భయం !
అప్పటి పోస్టు మాన్ లు ప్రతి కుటుంబానికి
ఆప్తులు, హీరోలు !
టెలిగ్రాములు తెచ్చే ఎర్ర సైకిల్ వాళ్ళు,
శత్రువులు, విలన్ లు !
టెలిగ్రామ్ వచ్చిందంటే..
“సో అండ్ సో సీరియస్, స్టార్ట్ ఇమీడియేట్లీ” యే !
అందుకే…టెలిగ్రాములకి నూరేళ్లూ నిండించాము !
★★★★★★★★
రెండు మూడు తరాల వాళ్ళం అలా….
‘ఉత్తర’కుమారులం, ‘ఉత్తరా’కుమార్తెలం గా వెలుగుతూ,
తీగలకి గుచ్చిన పాత ఉత్తరాలే దుమ్ము దులిపి,
మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండగానే…..
‘రోజులు మారాయి’ సినిమా తీసిన చాలా కాలానికి,
మా రోజులు మారడం మొదలెట్టాయి.
వింతలు, విడ్డూరాలు, విష్ణు మాయలు జరిగిపోతున్నాయి !
మనలాంటి వాళ్ళకి ఇంట్లో దేశవాళీ టెలిఫోను రావడానికే
సగం జీవితం గడిచిపోతే, గత రెండు దశాబ్దాలుగా
అన్ని రంగాల్లోనూ మార్పులే మార్పులు !
ఒకప్పుడు విమానం శబ్దం వినిపిస్తే,
బయటికి పరుగెత్తి చూసిన
మధ్య తరగతి వాళ్ళలో చాలామంది
లక్షలకి పడగలెత్తి, కోట్లకి అర్రులు చాస్తూ…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగ,
గౌలిగూడా బస్ స్టాండు లాగ,
విమానాశ్రయాలు ఖాళీ లేకుండా చేసేశారు.
“మా వాడు డల్లాస్”అంటే,
“మా అమ్మాయి “డెట్రాయిట్” అనేవారు !
“మా అల్లుడికి లండన్ లో ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది” అంటే,
“మా వాళ్ళకి కెనడా సిటిజెన్ షిప్ వచ్చేసింది” అనేవాళ్ళు.
ప్రస్తుతం కొరోనా కాటుకి, ఆ దేశాలతో పాటు,
మనవాళ్ళు కూడా పాపం,
బిక్కు బిక్కుమంటున్నారనుకోండి !
ఇండియా కి విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్నది,
దేశం లో టాక్స్ లు నిక్కచ్చిగా కడుతున్నదీ,
తద్వారా దేశ ఆర్థిక పురోగతికి దోహద పడుతున్నదీ,
మన మధ్య తరగతి వాళ్ళేట !
పావు కిలో బరువున్న నోకియా ఫోను తో మొదలయిన
మన సాంకేతిక ప్రస్థానం, కొంప కి పది చొప్పున,
తల ఒక్కింటికి రెండు చొప్పున, సెల్ ఫోనులు,
టాబ్ లు కాక, లాప్ టాప్ లు అదనం గా వచ్చి కూచున్నాయి ! ఇంటి నిండా చార్జర్ ల కలగాపులగం !
పొద్దున్న లేచాక, దైవ ధ్యానం, దీపారాధన కంటే ముందే,
‘కరచరవాణీ’ దర్శనం చెయ్యాల్సి రావడమే కాదు,
అన్నిటికీ ఛార్జింగ్ పెట్టడానికే జీవితం సరిపోతోంది !
ఇంక పనికొచ్చే పోస్టులు చూడ్డం, పనికిరాని వాళ్ళు పంపిన పోస్టులు తీసెయ్యడం, నిత్య కృత్యం ఐపోయింది.
ఇది కాక, మన “ఎగుమతి – దిగుమతి” వ్యాపారం (అదే నండి అప్ లోడ్, డౌన్ లోడ్)
ఉండనే ఉంది !
(ఇదేదో పెద్ద వ్యాపారం అనుకోకండి, మనకి వాట్సాప్ లో వచ్చినవి అందరికీ పంపడం, ఫేస్ బుక్కు లో చూసినవి షేర్ చెయ్యడం లాంటివి)
ఇలా కొంతకాలంగా ‘అత్యాధునిక సాంకేతిక విప్లవాలను
ఔపోసన పట్టి, అలరారుతున్నాం’ అని సంతోషిస్తుండగా…
ఒక రోజు మా పని మనిషి గొంతు,
వాష్ ఏరియా లో నుంచి గట్టిగా వినపడుతోంది.
‘ఏదైనా గొడవా’ అని వెళ్ళి చూస్తే…
దుబాయ్ లో ఉన్న కొడుకుతో
వీడియో కాల్ మాట్లాడుతోంది !
తన దగ్గర ఉన్నది నా ఫోను కంటే
కొత్త మోడలు, ఖరీదయినది !
అన్నట్టు….రోజులు మారాయి కదూ….
★★★★★★★★
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఒక రోజు మా పిల్లలు
హడావిడిగా వచ్చి, నన్ను లాక్కెళ్లి,
లాప్ టాప్ ముందు కూచోబెట్టారు.
తీరా చూస్తే, సినిమా ఆఖరి రీలులో గ్రూప్ ఫోటో లాగ, దేశ విదేశాల్లో ఉన్న మా వాళ్ళందరూ అందులో ఉన్నారు !
అందరూ ఒకే సారి,
“బావ గారూ బాగున్నారా ?’, “హాయ్ బ్రో”,
“హల్లో తాత గారూ”
“బాబయ్యా, ఎలా ఉన్నావ్ ?”
“అల్లుడూ…కులాసానా ?”
“మావయ్యా, చాలా రోజులయింది, నిన్ను చూసి”
అని కోరస్ పాడేస్తున్నారు !
ఒక్కక్కళ్ళనే గుర్తుపట్టి, పలకరించి,
పులకరించడానికి కొంచెం టైం పట్టింది.
“ఖండములు ఎన్ని, అవి ఏవి ?” అని,
హైస్కూల్ లో సోషల్ మేష్టారు అడిగితే,
తడుముకుని, బట్టీ బట్టి చెప్పేవాళ్ళం.
ఇప్పుడు ఖండములు, ఖండాంతరములు
అన్నీ ఒకే చోట కనిపించేస్తున్నాయి !!!
ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, కెనడా,
సింగపూర్,లండన్ ఇలా అన్ని దేశాల నుంచీ,
బీరకాయ పీచువాళ్ళందరూ….
కెనేడియన్ దగ్గిరనించీ తాడేపల్లిగూడేరియన్ వరకు
కొరోనా ధర్మమా అని, ఒకేసారి, కొంపల్లో కూచుని,
నెల రోజులుగా అన్ని రకాల కాలక్షేపాలు చేసి, చేసి,
విసుగెత్తి, బహుశా గాలి మార్పు కోసం, యిలా…
“జూమ్” వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
అందరూ ఒకే సారి దండెత్తారు.
ఎవరికీ హెయిర్ కట్ లు లేనట్టుంది !
మగంగులు అందరూ తలలు మాసి ఉన్నారు.
కొన్ని పాత మొహాలు…
ఆకారాలు, ప్రాకారాలు మారిపోయాయి.
కొన్ని కొత్త మొహాలు గుర్తుపట్టలేకపోతున్నా.
కొన్ని పిల్ల మొహాలు యవ్వనం లోకి వచ్చేస్తున్నాయి.
కొన్ని చంటి మొహాలు కొత్తగా పుట్టాయి.
సామూహిక యోగక్షేమాల కార్యక్రమం అయ్యాక,
ఎవరెవరు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో,
ఎవరికి ఎంతమంది పిల్లలో సగర్వంగా చెప్పుకున్నాక,
లోకల్ కొరోనా వార్తలు, స్కోరులు చదువుకున్నాక,
‘ఆరోగ్యాలు జాగ్రత్త’ లాంటి షరా మామూలు
హెచ్చరికలు చేసుకుని, చివరిగా సామూహికంగా
జాతీయ గీతం పాడినట్టు, అందరం “గో, కొరోనా, గో”
అనే మంత్రం చదివి, ‘బై’ లు చెప్పుకున్నాం.
★★★★★★★★
ఇదంతా అయ్యాక, కొత్త రకం ప్రసార మాధ్యమాలు వచ్చాయని, ‘కానీ’ ఖర్చు లేకుండా, నిమిషాల్లో,
ప్రపంచం లో ఎక్కడ ఉన్నా,మన వాళ్ళందరినీ చూస్తూ
మాట్లాడుకునే సౌకర్యాలు వచ్చిన కారణంగా అందరి విశేషాలు, యోగ క్షేమాలు తెలుసుకోగలుతున్నామని సంతోషించాను.
౦౦౦౦౦౦౦౦౦౦౦
కానీ ఏమిటో…..ఆ డొక్కు సైకిల్ మీద ఖాకీ గుడ్డలతో
వచ్చి, నవ్వుతూ అరుగు మీద ఎదురు చూస్తున్న
మాకు అందించిన ఆ ‘కార్డు ముక్క’ ఇచ్చిన ఆనందం,
ఇప్పుడు వాట్సాప్ లు, ఫేస్ బుక్ లు తెచ్చే వందల కొద్దీ
పోస్టులు,విశేషాలు, స్కైపులు, ‘జూమ్’ లు చూపించే వీడియోలు ఇవ్వలేకపోతున్నాయి !
అవునులే ! నాన్న 200 రూపాయలతో రెండు చక్రాల సైకిల్ కొన్నప్పుడు, ఎంతగానో ఆనందించిన ఇదే బుర్ర,
పది లక్షలు పెట్టి నాలుగు చక్రాల కారు కొనుక్కున్నప్పుడు
ఆనందించలేకపోడమేవిటి ?
కాల మహిమ కాకపోతేను ?
ఏమిటో….యీ మనసు !!!
?????
(పలువురు ‘తల పండిన’ సిటిజన్స్ చర్చించుకుని మరీ రాసిన ఈ పోస్టును ఓ సీనియర్ జర్నలిస్ట్ ts29కు పంపారు)