‘Chai na’ ఏమిటి…? ‘china’ కదా? అని అప్పుడే అక్షరాల్లో స్పెల్లింగ్ మిస్టేక్ గా భావించకండి. ఇది అక్షర దోషమేమీ కాదు. మీరు చదువుతున్నది కరెక్టే. అది ‘Chai na’ యే. ‘china’ కాదు. ఈ స్పెల్లింగులో ‘a’ ఎందుకు అదనంగా చేరిందో, దాని ‘కత’ ఏమిటో తెలుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. ఇక మొదలు పెట్టడమే తరువాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యా రంగాన్ని శాసిస్తున్న వారి పేర్లేమిటి? అని ఎవరినడిగినా ఠక్కున ఆయా రెండు పేర్లను ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు… తెలుసు కదా? ఓ కోర్సుకు రకరకాల పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేయడమే అందుకు కారణం కావచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో వీరి దోపిడీని ‘Chai’Na’ కరోనా వైరస్ తోనూ పోల్చవచ్చు. ఎందుకంటే అంతగా విస్తరించింది మరి వీళ్ల దోపిడీ. ఫీజుల పేరుతో పీడించేందుకు ఒకే రకమైన కోర్సుకు రకరకాల పేర్లు పెట్టి మరీ దోచుకుంటున్నారు.
టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ లో చేరిన విద్యార్థి ఇంజనీరింగ్, మెడిసిన్, లేదా సీఎ చేయాలనే లక్ష్యంతో చదువుతుంటారు. తమకు అనుకున్న అడ్మిషన్ ఎక్కడా రాకపోతే డిగ్రీలో జాయిన్ అవుతారు. కానీ ఇంటర్ లోనే ‘చై నా’ వైరస్ ప్రారంభం అవుతుంది.
ఒకే రకమైన కోర్సుకు రకరకాల పేర్లు పెట్టి డబ్బులను దండుకుంటున్న తీరు ఇక్కడ గమనార్హం. ఇంటర్ లో చేరితే MPL, NPL, IPL, NEON, SPARK, ఇలా మొత్తం 20 నుండి 30 రకాల పేర్లతో అడ్మిషన్ ఇస్తారు. ఈ పేర్లన్నీ ఫీజుల కోసం యాజమాన్యాలు పెట్టుకున్న పేర్లు. వీటి గురించి విద్యా వంతులకే అర్థం కాదు, ఇక సామాన్య ప్రజలకు ఏమి అర్థం అవుతుందనేది జవాబు లేని ప్రశ్న.
ఇంటర్ చదువు అంటే MPC, BiPC, CEC, HEC అనే పేర్లు విన్నాం. కానీ.. ఇవేం పేర్లో అర్థం కాని పరిస్థితి. తమకు అర్థం కానిదే గొప్ప దానిగా భావించి క్యూ కట్టి మరీ అడ్మిషన్ లు తీసుకుంటుండడం ఓ ఫ్యాషనే కాదు… ఇది మన బలహీనత కూడా. దీన్నే కార్పొరేట్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.
జూన్ లో అడ్మిషన్ లకై చైనా వైరస్ లాగా ఇప్పటి నుంచే గ్రామాలలో కార్పొరేట్ PROలు జల్లెడ పడుతున్నారు. కార్పొరేట్ కు తలొగ్గిన అధికార గణం ఎక్కడా నోరు మెదపదు. రకరకాల పేర్లతో బహిరంగంగా ప్రకటనలు ఇచ్చినా వారిని ఏమీ అనరు.
‘చైనా’ దేశంలో ‘కరోనా’ వైరస్ వచ్చి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ‘Chai Na’ వారి నిర్భంధ చదువులతో విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఆత్మ హత్యలకు పాల్పడుతుండగా, తల్లి తండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
చైనా దేశంలో కరోనా వైరస్ కు చికిత్స లాగా, తెలుగు రాష్ట్రాలలో ‘Chai Na’ కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థల కట్టడికి మందు కని పెట్టాల్సిన అవసరం పాలకులకు ఎంతైనా ఉంది.
✍ తుమ్మలపల్లి ప్రసాద్