సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలు. పోలీసు శాఖలో ఇవి ప్రత్యేక విభాగాలు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఇంటలిజెన్స్ బ్యూరో కూడా ఒకటి ఉందా? అని తెలంగాణా పోలీసులు నివ్వరపోయిన ఘటన ఇది. పోలీసు వర్గాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ‘ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ అక్షరాలు గల ఓ మారుతీ కారు కనిపించింది. పోలీసులకు అనుమానం వచ్చింది. కారును ఆపి తనిఖీ చేశారు. కారు లోపలి హంగామా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అచ్చం పోలీసులు వినియోగించే వీహెచ్ఎఫ్ (వైర్ లెస్) సెట్ ను పోలిన పని చేయని పరికరం ఒకటి ఏర్పాటు చేసి ఉంది. దాంతో పాటు ప్రభుత్వ విభాగానికి చెందిన వాహనం మాదిరిగా కనిపించేలా ఎంబ్లమ్ గుర్తు కారుపై ముద్రించి ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కారుతో పాటు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిని స్థానిక నల్లకుంట పోలీసులకు అప్పజెప్పారు.
ఇంటలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరును, కారుపై ప్రభుత్వ ఎంబ్లాన్ని పోలిన ముద్ర, కారు లోపల పని చేయని వీహెచ్ఎఫ్ సెట్ ఏర్పాటు చేయడ, గోల్డ్ కలర్ ఉన్న కారును బ్లూ కలర్ లోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి బాగ్ అంబర్ పేటకు చెందిన తండ్రి కొడుకులు మురళి చంద్ (66), అతని కుమారుడు దుర్గా భవన్ సుందర్ లపై ఐపీసీ సెక్షన్ 419, మోటార్ వెహికల్ చట్టం 177 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వీరు ఇంటలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే పేరుతో ఒక సంస్థను 2018 లో రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం.