‘తోట కూర దొంగిలించిన నాడే నన్ను దండించి ఉంటే…ఇప్పుడు నాకీ ఉరి శిక్ష పడేది కాదు కదా? అమ్మా?..’ అంటూ కేటుగాడు సినిమాలో మోహన్ బాబు కన్నతల్లిని నిందిస్తాడు…నిలదీస్తాడు. ఈ వాక్యంలో పరిపూర్ణత ఉందో లేదోగాని సారాంశం మాత్రం అదే. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా అది. తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన ఉదంతంలో ఆమెపై సానుభూతి శాతంకన్నా, రెవెన్యూ వ్యవస్థలోని అవినీతి శాతమే ఎక్కువగా ప్రస్ఫుటిస్తున్న తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ వ్యవస్థలో పరాకాష్టకు చేరిన అవినీతి అంశంలో ప్రభుత్వ చర్యలను కూడా ప్రస్తుతం నిందించాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం జరిగిన కొన్ని ఘటనలను ఉదాహరణలుగా పరిశీలిస్తే, రెవెన్యూశాఖ అవినీతిపై ప్రభుత్వ ఉదాసీనత స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగానే ఈ ఘోర ఉదంతాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఘటన నెం. 1
ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రాతనిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఇద్దరు రైతులు దారుణ హత్యకు గురయ్యారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో చోటు చేసుకున్న ఈ హత్యలకు భూప్రక్షాళన ప్రక్రియలో రెవెన్యూ శాఖ తప్పిదాలే కారణంగా వార్తలు వచ్చాయి. రైతుల పాస్ బుక్కుల్లో రెవెన్యూ తప్పిదాల ఫలితంగా రైతుల మధ్య గెట్ల పంచాయతీ ఏర్పడి హత్యలకు దారి తీసింది. దాదాపు ఏడాదిన్నర క్రితం అంటే 2018 మే నెలలో జరిగిన ఈ ఘటనలను రెవెన్యూ హత్యలుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అభివర్ణించారు. అయితే ప్రభుత్వం ఈ హత్యోదంతాలపై తీవ్రంగా స్పందించిన దాఖలు లేకపోవడం గమనార్హం.
ఘటన నెం. 2
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన గిరిజన రైతులు రెవెన్యూ అధికారులను పరుగెత్తించి మరీ దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి కారణమైంది. తమ వద్ద భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి పాస్ బుక్కులు ఇవ్వడం లేదని, ఇచ్చినవారి పాస్ బుక్కుల్లో భూముల నమోదు సక్రమంగా లేదంటూ రఘునాథపాలెం మండలం ఎమ్మార్వో తిరుమలాచారి కారును అడ్డగించి దాడికి దిగారు. అంతకు కొద్ది నిమిషాల ముందే గ్రామంలోకి వచ్చిన వీఆర్వో రాములుపై దాడి చేశారు. ప్రాణభయంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు పరుగెత్తి పక్కనే గల మసీదులో దాక్కున్నాడు. పంగిడిలో గిరిజన రైతులు రెవెన్యూ వ్యవస్థపై తిరగబడిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కలిగించింది. కేవలం పంగిడిలోనే రెవెన్యూ అధికారులు రూ. 50 లక్షలు, మండలం వ్యాప్తంగా రూ. 5.00 కోట్ల వరకు రైతుల నుంచి వసూళ్లు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సమయానికి రంగప్రవేశం చేసి రక్షణ చర్యలు తీసుకోకుంటే గిరిజన రైతుల చేతుల్లో ఈ ముగ్గురు రెవెన్యూ అధికారులు బలయ్యేవారని 2018 మే నెలలో జరిగిన ఘటన తీవ్రత స్పష్టం చేసింది. అయితే ఈ సంఘటనలో రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.
ఘటన నెం. 3
ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటకు చెందిన ఓ రైతు తన ఎకరం భూమికి పాస్ పుస్తకం పొందడానికి రూ. 40 వేల మొత్తాన్ని లంచంగా ఇచ్చాడంటే భూప్రక్షాళనలో రెవెన్యూ వసూళ్ల బరితెగింపును అవగతం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల పుట్టకోటలో భూప్రక్షాళన ప్రక్రియకు అవకాశమే లేదు. కానీ తాను పాస్ పుస్తకం ఇప్పస్తానని అప్పటి వీఆర్వో దినసరి కూలీ చేసుకునే బక్క రైతు నుంచి అప్ప చేయించి మరీ రూ. 40 వేలు జేబులో వేసుకోవడం గమనార్హం. పంగిడి ఉదంతం నేపథ్యంలోనే ఈ సంఘటన కూడా వెలుగు చూసింది. కానీ వీఆర్వోపై అధికారులు కఠిన చర్యలు తీసుకోలేదు. ఈ మూడు ఉదంతాలు ఉదాహరణ మాత్రమే.
భురికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో రెవెన్యూ అధికారుల వసూళ్ల తంతు ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదని ఎవరైనా భావిస్తే పొరపాటే అవుతుంది. భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు అద్భుతంగా పనిచేశారని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ నుంచే రెవెన్యూ అధికారులు ప్రశంసలు పొందడం విశేషం. ఇదే దశలో రెవెన్యూ వ్యవస్థ కుళ్లిపోయిందని, దాన్ని అవసరమైతే రద్దు చేస్తామని, లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని పాలక నేతలే వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే.
గమనించాల్సిన అంశం ఏమిటంటే…భురికార్డుల ప్రక్షాళనలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎకరానికి కనీసంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 10 వేల చొప్పున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణల సారాంశం. కొన్ని ప్రాంతాల్లో రైతు బంధు సొమ్ములో నాలుగో వంతు మొత్తాన్ని లంచంగా స్వకరించిన తర్వాతే పాస్ బుక్కులతోపాటు తొలివిడత చెక్కులను రైతుల చేతుల్లో పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక అంచనా ప్రకారం సగటున ప్రతి మండలానికి రూ. 3.00 కోట్ల చొప్పన అప్పటి సంఖ్య ప్రకారం రాష్ట్రంలోని 584 మండలాల్లో మొత్తం రూ. 1,752 కోట్ల మొత్తాన్ని భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రస్థాయిలో వసూళ్ల ఆరోపణలు వచ్చినా, అధికారులపై సామూహిక దాడులు జరిగినా, రైతుల హత్య వంటి ఘటనలు చోటు చేసుకున్నా వసూళ్లకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై, సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పడు చెప్పండి… కేటుగాడు సినిమాలో మోహన్ బాబు ‘తోటకూర’ డైలాగ్ రెవెన్యూ వ్యవస్థకు అన్వయించడం సముచితమే కదా? భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో రెవెన్యూ వ్యవస్థ వసూళ్లను ప్రభుత్వం నిలువరించే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది కదా? తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఉదంతంలో సానుభూతి శాతం కన్నా రెవెన్యూ వ్యవస్థపై ఆగ్రమ శాతమే మిన్నగా ఉండడానికి కారకులెవరన్నదే కదా అసలు ప్రశ్న?